Begin typing your search above and press return to search.

పాక్ లో ‘వెరీబ్యాడ్ ఫ్లడ్ లైట్స్’.. క్రికెటర్ నుదిటికి తీవ్ర గాయం

అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో నాసిరకంగా ముగించినట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   9 Feb 2025 8:06 AM GMT
పాక్ లో ‘వెరీబ్యాడ్ ఫ్లడ్ లైట్స్’.. క్రికెటర్ నుదిటికి తీవ్ర గాయం
X

క్రికెట్ లో చాన్నాళ్ల తర్వాత ముక్కోణపు టోర్నీ.. అందులోనూ పాకిస్థాన్ గడ్డపై.. మరీ ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ టోర్నీ ముంగిట.. ఇంకా చెప్పాలంటే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లతో కలిపి ముక్కోణపు టోర్నీ.. కానీ, ఏర్పాట్లు చూస్తుంటే మాత్రం అత్యంత దారుణం అనిపిస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ లో చాంపియన్స్ ట్రోఫీ మైదానాలు సరిగా సిద్ధం చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. తీరా టోర్నీ ప్రారంభానికి పది రోజులు కూడా సమయం లేని సమయంలో మ్యాచ్ సందర్భంగా కీలక ఆటగాడు తీవ్రంగా గాయపడడం విమర్శలకు అవకాశం ఇస్తోంది.

12 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ లో ముక్కోణపు టోర్నీ జరుగుతోంది. ఇక ఈ నెల 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ముక్కోణపు టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో శనివారం లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడ్డాయి. కానీ, స్టేడియంలో ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో నాసిరకంగా ముగించినట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పాక్ ఇన్నింగ్స్ 38వ ఓవ‌ర్‌ లో క్యాచ్ అందుకునే ప్ర‌య‌త్నంలో న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్, భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర నుదిటికి బంతి బ‌లంగా తాకింది. దీంతో రక్తం బొటాబొటా కారింది. న్యూజిలాండ్ ఫిజియోలు వచ్చి రచిన్ ను బయటకు తీసుకెళ్లారు. అయితే, హెడ్ ఇంజ్యూరీ అసెస్‌ మెంట్) ప‌రీక్ష‌లు చేయగా గాయం అంత తీవ్ర‌మైన‌ది కాదని తేలింది.

తప్పు ఫ్లడ్ లైట్లదా..? రచిన్ దా?

మ్యాచ్ లో రచిన్ బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌ కు ప్రయత్నించాడు. బంతి గమనాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. ఫ్లడ్‌ లైట్ల వెలుతురే దీనికి కారణం అని నిందిస్తున్నారు.

గడాఫీ మైదానాన్ని చాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఆధునికీకరించి రెండు రోజుల కిందటే పునఃప్రారంభించారు. ఇంతలోనే రచిన్ ఘటన చోటుచేసుకోవడంతో ఐసీసీ, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. నాసిరకం ఫ్లడ్‌ లైట్లతోనే ఇలా జరిగిందని అంటున్నారు.

మైదానం అసమర్థ నిర్వహణ కారణంగా ఓ యువ క్రికెటర్ ఐసీసీ ట్రోఫీలో ఆడే అవకాశం కోల్పోయాడంటూ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఐసీసీ దృష్టిసారించాలని కోరుతున్నారు. మిగతా మైదానాల సంగతి ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

పాకిస్థాన్ మైదానాల్లో అంతర్జాతీయ మ్యాచ్‌ లు ఎందుకు? ఆటగాళ్ల భద్రతకు ఐసీసీ కట్టుబడాలి. పాకిస్థాన్‌ సరైన సదుపాయాలను కల్పించలేకపోతే చాంపియన్స్ ట్రోఫీని దుబాయ్‌ మార్చేయండి... పాక్ బోర్డు ఇప్పటికైనా ఫ్లడ్ లైట్లను మెరుగుపర్చాలి. చెత్త లైటింగ్‌ తోనే రచిన్ బంతిని అంచనా వేయలేకపోయాడు. హడావుడిలో గ్రౌండ్ పనులు నాసిరకంగా చేసినట్లు అనిపిస్తోంది.. అంటూ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.