Begin typing your search above and press return to search.

వచ్చేశాడు ‘జూనియర్ వాల్’.. టీమ్ ఇండియాలోకి స్టార్ క్రికెటర్ వారసుడు

ఆస్ట్రేలియాతో పుదుచ్చేరి, చెన్నై లలో సెప్టెంబరు 21, 23, 26న వన్డేలు జరగనున్నాయి.

By:  Tupaki Desk   |   31 Aug 2024 7:40 AM GMT
వచ్చేశాడు ‘జూనియర్ వాల్’.. టీమ్ ఇండియాలోకి స్టార్ క్రికెటర్ వారసుడు
X

బహుశా భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ అనే ‘మహాద్భుతం’ లేకుంటే అతడినే అత్యుత్తమ బ్యాట్స్ మన్ గా చెప్పేవారేమో..? టెస్టుల్లో గంటలకు గంటలు ఆడగల సత్తా.. చెక్కుచెదరని డిఫెన్స్.. వన్డేల్లోనూ దూకుడు.. జట్టు కోసం వికెట్ కీపింగ్ బాధ్యతలు మోసేందుకు సిద్ధం.. ఇదంతా సమర్థుడైన, నిజాయతీపరుడైన ఓ ఆటగాడి లక్షణం. అంతేకాదు.. దేశం కోసం అండర్ 19 జట్టు, ఇండియా ఏ జట్టు.. సీనియర్ జట్టు.. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చిన అతడి వ్యక్తిత్వం, క్రమశిక్షణ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొన్నటికి మొన్న టి20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన జట్టుకు హెడ్ కోచ్ గా ఘనతను అందుకుని సగర్వంగా తప్పుకొన్నాడు. ఇప్పడు అతడి కుమారుడు కూడా దేశానికి ఆడేందుకు సిద్ధమయ్యాడు.

అబ్బాయి.. అచ్చం నాన్నలా కాదు

మిస్టర్ డిపెండబుల్.. ది వాల్.. ఈ పేర్లు వినగానే గుర్తొచ్చేది రాహుల్ ద్రవిడ్. వన్డేలు, టెస్టుల్లో 10 వేలపైగా పరుగులు చేసిన భారత గ్రేట్ బ్యాట్స్ మన్. భారత క్రికెట లో టెండూల్కర్ తర్వాత మేటి బ్యాట్స్ మెన్ ఇతడేనని క్రికెట్ పండితుల అభిప్రాయం. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ శకం ఆరంభమైంది. సమిత్.. భారత అండర్-19 జట్టులోకి ఎంపికయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మహరాజా టి20 టోర్నీలో మైసూర్ వారియర్స్ కు ఆడుతున్నాడు సమిత్. 18 ఏళ్ల 295 రోజుల వయసున్న సమిత్ కుడిచేతి వాటం పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్. ఇతడిని స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌, రెండు నాలుగు రోజుల మ్యాచ్ కు బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా, కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో కర్ణాటక విజయం సాధించడంలో సమిత్ కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో 362 పరుగులు, బౌలింగ్‌ లో 16 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత మహరాజా టి20 టోర్నీతోనే సమిత్ సీనియర్ స్థాయిలో తొలిసారిగా ఆడుతున్నాడు.

ఆస్ట్రేలియాతో పుదుచ్చేరి, చెన్నై లలో సెప్టెంబరు 21, 23, 26న వన్డేలు జరగనున్నాయి. సెప్టెంబరు 30, అక్టోబరు 7న నాలుగు రోజుల మ్యాచ్ లు నిర్వహిస్తారు. కాగా, అండర్ 19 వన్డే జట్టుకు ఉత్తర ప్రదేశ్ కు చెందిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ మహమ్మద్ అమన్, నాలుగు రోజుల మ్యాచ్‌ లకు మధ్యప్రదేశ్ కు చెందిన సోహమ్ పట్వర్ధన్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

స్టార్ కిడ్ అయినంతనే సరిపోదు

సినిమాలైనా, రాజకీయాలైనా, క్రికెట్ అయినా అసలు ఏ రంగమైనా ప్రవేశం వరకే వారసత్వం పనికొస్తుంది. ఆ తర్వాత అంతా వారి ప్రతిభ, కష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ఇదే నియమం సమిత్ ద్రవిడ్ కూ వర్తిస్తుంది. ఉదాహరణకు సచిన్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను భవిష్యత్ క్రికెటర్ గా చేయాలకున్నాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ (అది కూడా లెఫ్ట్ హ్యాండ్)గా తీర్చిదిద్దాడు. కానీ, అర్జున్ కనీసం మెప్పించలేకపోతున్నాడు. అయితే, అర్జున్ లా కాకండా సమిత్ కు మాత్రం అండర్-19 రూపంలో మంచి చాన్స్ దొరికింది. దీనిని అతడు ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.