Begin typing your search above and press return to search.

ఘోర పరాభవ గడ్డపైనే ప్రపంచ విజేత.. ఆ దిగ్గజానికి సరైన గురుదక్షిణ

సచిన్ టెండూల్కర్, సౌరభ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ వంటి స్టార్లున్న జట్టుకు అతడు కెప్టెన్.

By:  Tupaki Desk   |   1 July 2024 5:45 AM GMT
ఘోర పరాభవ గడ్డపైనే ప్రపంచ విజేత.. ఆ దిగ్గజానికి సరైన గురుదక్షిణ
X

సచిన్ టెండూల్కర్, సౌరభ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ వంటి స్టార్లున్న జట్టుకు అతడు కెప్టెన్. కానీ, వన్డే ప్రపంచ కప్ లో తొలి రౌండ్ కూడా దాటలేకపోయింది. అప్పటి పసికూన బంగ్లాదేశ్ వంటి జట్టు చేతిలో ఓడిపోయి ఘోర పరాభవంతో వెనుదిరిగింది. కెప్టెన్ గా ఆ ఆటగాడి ప్రయాణం కూడా ముగిసింది. ఓ విధంగా అతడి కెరీర్ లో ఇదో పెద్ద మచ్చ.

జెంటిల్మన్ గేమ్ లో జెంటిల్మన్

జెంటిల్మన్ గేమ్ గా పేరుగాంచిన క్రికెట్ లో అసలైన జెంటిల్మన్ ఎవరంటే రాహుల్ ద్రవిడ్ పేరే చెప్పాలి. అచ్చమైన క్లాస్ బ్యాట్స్ మన్ అతడు. ఒకవేళ టెండూల్కర్ ను మినహాయిస్తే భారత క్రికెట్ లో అత్యంత గొప్ప బ్యాటర్ గా రాహుల్ ద్రవిడ్ పేరే చెప్పాలి. అయితే, ద్రవిడ్ కెప్టెన్ గా మాత్రం అత్యంత చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. 2007లో అతడి సారథ్యంలో భారత జట్టు కరీబియన్ దీవుల్లో జరిగిన ప్రపంచ కప్ లో తొలి రౌండ్ లోనే వెనుదిరిగింది. దీంతో దేశమంతా ఆందోళన చెలరేగింది. ధోనీ సహా ఆటగాళ్ల ఇళ్లపై అభిమానులు దాడులకు దిగారు. ఆ వెంటనే కొంత కాలానికి ద్రవిడ్ కెప్టెన్సీ వదులుకున్నాడు. క్రమంగా వన్డే ఫార్మాట్ కూ దూరమయ్యాడు. ఓ విధంగా అతడి కెరీర్ లో ఇదో పెద్ద మచ్చ. అంతేకాదు.. ప్రపంచ విజేత జట్టులో సభ్యుడిగా ఉండాలన్న ద్రవిడ్ కోరిక కూడా ఇంతటితో ఆగిపోయింది. ద్రవిడ్ వైస్ కెప్టెన్ గా ఉన్న సమయంలో 2003లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.

మళ్లీ ఇప్పుడు..

పరాభవం పొందిన చోటే సగర్వంగా ట్రోఫీ ఎత్తడం అంటే ఇదేనేమో..? శుభమన్ గిల్ వంటి వారితో కూడిన జట్టుతో 2018లో అండర్ 19 జట్టు కోచ్ గా ప్రపంచ కప్ సాధించి తన కలను కొంత నెరవేర్చుకున్న ద్రవిడ్ ఇప్పుడు వెస్టిండీస్ లో సీనియర్ జట్టు టి20 ప్రపంచ చాంపియన్ గా నిలవడంలోనూ ముఖ్య భూమిక పోషించాడు. చిరకాల స్వప్నం నెరవేర్చకున్నాడు. 2007లో కెప్టెన్ గా వన్డే ప్రపంచ కప్ లో ఎక్కడైతే దారుణ పరాభవం పొందాడో ఇప్పుడు అక్కడే ట్రోఫీ పైకెత్తాడు.

ద్రవిడ్ వాస్తవానికి వన్డే ప్రపంచ కప్ తో కోచ్ గా తప్పకోవాల్సింది. కానీ, బోర్డు కోరిక మేరకు టి20 ప్రపంచ కప్ వరకు కొనసాగాడు. అతడి కోసమే అన్నట్లుగా ఆడిన టీమిండియా ప్రపంచ కప్ కొట్టింది. తమ దిగ్గజానికి సరైన బహుమతి ఇచ్చింది.