Begin typing your search above and press return to search.

నాన్న వెస్టిండీస్ క్రికెటర్.. కొడుకు 2 స్వర్ణాల అమెరికా ఒలింపిక్ రన్నర్

తండ్రిలా క్రికెటర్ కాబోయి.. పరుగుల వీరుడై.. ఒలింపిక్స్ లో డబుల్ గోల్డ్ కొట్టాడు అతడు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 10:30 AM GMT
నాన్న వెస్టిండీస్ క్రికెటర్.. కొడుకు 2 స్వర్ణాల అమెరికా ఒలింపిక్ రన్నర్
X

తండ్రిలా క్రికెటర్ కాబోయి.. పరుగుల వీరుడై.. ఒలింపిక్స్ లో డబుల్ గోల్డ్ కొట్టాడు అతడు. అసలే పరుగుకు తగిన కరీబియన్ జీన్స్... అందుకే అందరిలా అతడు కూడా క్రికెటర్ కావాలనుకున్నాడు.. అంతకుమించి తన తండ్రిలా ఫాస్ట్ బౌలర్ కూడా కావాలనుకున్నాడు.. అయితే, అతడు ఒకటి తలిస్తే విధి మరోటి తలచింది. బంతిని పట్టాల్సినవాడు.. రన్నింగ్స్ ట్రాక్ పైకి వచ్చాడు. ఫలితం ఇప్పుడు ఒలింపిక్స్ లో డబుల్ గోల్డ్. పారిస్ లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ కుర్రాడు 400 మీటర్ల హర్డిల్స్‌, 4×400 రిలేలో రెండు స్వర్ణాలు నెగ్గాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. పతకాల పట్టికలో చైనాను మించి అమెరికా టేబుల్ టాపర్ గా నిలిచిందంటే కారణం.. అతడే అనుకోవచ్చు.. ఇదంతా అమెరికా అథ్లెట్‌ రాయ్‌ బెంజమిన్‌ గురించి.

ఒలింపిక్స్ లో పతకాలు గెలిస్తే క్రికెట్ లో చర్చ కావడం ఏమిటి..? కానీ.. ఇదే జరిగింది. ఎవరీ రాయ్ బెంజమిన్ అని చూస్తే.. వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ విన్‌ స్టన్‌ బెంజిమన్‌ కుమారుడు. ఇంతకూ విన్ స్టన్ 1987 నుంచి 1995 వరకు వెస్టిండీస్ కు ఆడాడు. పేస్ బౌలర్ అయిన అతడు 21 టెస్టులు, 85 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే, రాయ్ కూడా నాన్నలాగే ఫాస్ట్‌ బౌలర్‌ అవ్వాలని చూశాడు. కానీ పరుగులో అతడి ప్రతిభను గుర్తించిన అంటిగ్వా కోచ్‌ లు ట్రాక్‌- ఫీల్డ్‌ వైపు మళ్లించారు.

కరీబియన్లకే జెల్లకొట్టి

సహజంగా పరుగు పందెం అంటే గుర్తొచ్చేది కరీబియన్లు. వారి శరీర తత్వం అలా ఉంటుంది. అయితే, రాయ్ ఇప్పుడదే కరీబియన్లకు చెక్ పెడుతూ ఒలింపిక్ పరుగులో దూసుకొచ్చాడు. ఏకంగా రెండు స్వర్ణాలతో తండ్రి సొంత దేశానికి గండికొట్టాడు. రాయ్ బెంజమిన్ పారిస్ ఒలింపిక్స్ లో అమెరికా తరఫున బరిలోకి దిగాడు. అదెలా సాధ్యం.. అంటారా? విన్ స్టన్ బెంజమిన్ కరీబియన్ దీవులకు చెందినవాడైనా, రాయ్ మాత్రం అమెరికాలో పుట్టాడు. దీంతో అతడు అమెరికన్ అయ్యాడు. ఇప్పుడు ఆ దేశానికి పతకాలు అందించి గర్వపడేలా చేశాడు.

నాకు వరల్డ్ కప్ ఫైనల్ గుర్తొచ్చింది..

రన్నింగ్ రేస్ లో కుమారుడు రాయ్ విజయంపై విన్ స్టన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి అనుభూతిని పొందినవారిని తాను ఎప్పుడూ కలవలేదన్నాడు. ఇది మాటల్లో చెప్పలేని ఆనందం అని.. అద్భుత క్షణాలు అని కొనియాడాడు. రాయ్ పడిన కష్టాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘‘ఒలింపిక్ వ్యక్తిగత విభాగంలో రెండు స్వర్ణాలు సాధించడం అంటే మామూలు మాటలు కాదు. రాయ్ రేస్ ప్రారంభానికి ముందే నా దృష్టంతా అక్కడే ఉంది. చాలా రిస్క్‌ తీసుకుంటున్నాడని నా భార్యతో చెప్పా. అయితే, ట్రాక్‌లోకి దిగాక పూర్తి ఫిట్‌ గా ఉన్నాడనే భరోసా కలిగింది. చివరికి అనుకున్నది సాధించాడు. దీన్ని చూస్తుంటే వరల్డ్ కప్ ఫైనల్ చూసినంత భావోద్వేగం కలిగింది’’ అని చెప్పుకొచ్చాడు.