Begin typing your search above and press return to search.

17 సీజన్లు..1 ఐపీఎల్ టైటిల్.. అరుదైన క్రికెటర్ రిటైర్మెంట్

తమిళనాడు క్రికెటర్, టీమిండియా మాజీ సభ్యుడు వికెట్ కీపర్ బ్యాటర్ 38 ఏళ్ల దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు.

By:  Tupaki Desk   |   23 May 2024 10:46 AM GMT
17 సీజన్లు..1 ఐపీఎల్ టైటిల్.. అరుదైన క్రికెటర్ రిటైర్మెంట్
X

ఎప్పుడో 2004లో ధోనీ కంటే ముందే టీమిండియాలోకి వచ్చాడు. చారిత్రాత్మక విజయాల్లో భాగమయ్యాడు. మేటి క్రికెటర్ అవుతాడని భావించినా అంచనాలు అందుకోలేకపోయాడు. కెరీర్ చివరలో మాత్రం ఫినిషర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా చిన్న వయసులో ప్రేమ పెళ్లి చేసుకుని.. సహచర క్రికెటర్ చేతిలో మోసపోయాడు. కెరీర్ లో కిందకు పడిపోయినా పైకి లేచాడు. మరో గొప్ప క్రీడాకారిణిని భార్యగా ఇచ్చి దేవుడు అతడికి మేలు చేశాడు. అనుకున్నంత గొప్పగా కాకపోయినా.. మంచి రికార్డులతోనే అతడు కెరీర్ ముగిస్తున్నాడు.

కొద్దిగా లక్ కలిసొచ్చి ఉంటే..

తమిళనాడు క్రికెటర్, టీమిండియా మాజీ సభ్యుడు వికెట్ కీపర్ బ్యాటర్ 38 ఏళ్ల దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఈ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన అతడు బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం తన నిర్ణయం ప్రకటించాడు. కాగా, 17 సీజన్ల నుంచి దినేశ్ కార్తీక్ ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. మొత్తం 6 జట్లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. ధోని, కోహ్లి, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, వృద్ధిమాన్‌ సాహా, మనీశ్‌ పాండే మాత్రమే ఈ రికార్డును కలిగి ఉన్నారు. పదిహేడేళ్ల చరిత్రలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే అతడు మిస్సయ్యాడు. ధోని (264) తర్వాత అత్యధిక ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు దినేశ్ కార్తీకే (257). ఇక 2018-20 మధ్య కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) కెప్టెన్‌ గా 37 మ్యాచ్‌లు ఆడి 19 విజయాలు సాధించాడు. కీపర్‌ గా 174 డిస్మిసల్స్‌ లో భాగమయ్యాడు. ధోని (190) తర్వాత దినేశ్ కార్తీక్ దే రెండో స్థానం.

కాగా, 2004లో ధోనీ కంటే ముందే 18 ఏళ్ల వయసులో టీమిండియాలోకి వచ్చిన కార్తీక్ స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. మంచి ప్రతిభావంతుడే అయినా అవకాశం వచ్చినప్పుడు విఫలమై జట్టులో చోటు కోల్పోయాడు. కాస్త లక్ కలిసొచ్చి ఉంటే దినేశ్ కార్తీక్ దిగ్గజ క్రికెటర్ అయ్యేవాడు.

2008 నుంచి ఐపీఎల్ జర్నీ ఇలా..

2008లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ.2.1 కోట్లకు క్తారీక్ ను కొనుక్కుంది. 2010 వరకు ఆ జట్టుతోనే ఉన్న అతడు తర్వాత పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ కు మారాడు. రెండేళ్ల అనంతరం 2013లో ముంబై ఇండియన్స్‌ కు మారాడు. ఆ ఏడాదే రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై తొలిసారి ఐపీఎల్ టైటిల్ కొట్టింది. డీకే కెరీర్ లో ఇదొక్కటే ఐపీఎల్ టైటిల్. అంతేకాదు.. ముంబై తరఫున ఇదే అతడికి చివరి మ్యాచ్. కాగా, 2014 వేలంలో ఢిల్లీ మరోసారి డీకేను దక్కించుకుంది. ఏకంగా 12.5 కోట్లు వెచ్చించింది. 2015వేలంలో బెంగళూరు తొలిసారి దినేశ్‌ కార్తీక్‌ కు చోటిచ్చింది. రూ 10.50 కోట్లు ఖర్చు పెట్టింది. 11 ఇన్నింగ్స్‌ లో 141 పరుగులు మాత్రమే చేయడంతో మరుసటి ఏడాది అతడిని వదిలించుకుంది.

సురేశ్‌ రైనా సారథ్యంలోని గుజరాత్‌ లయన్స్‌ (2016, 2017)కు 2018లో కోల్‌కతా కు మారాడు. గంభీర్‌ వెళ్లపోయాక దినేశ్‌ కార్తీక్‌ ను కెప్టెన్‌ అయ్యాడు. జట్టు ఓటముల నేపథ్యంలో 2020 సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి వైదొలగాడు. 2022 మెగా వేలానికి ముందు కేకేఆర్‌ కార్తీక్‌ ను రిలీజ్‌ చేసింది. ఆర్సీబీ రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేసింది. 183 పైగా స్ట్రైక్‌ రేట్ తో 330 పరుగులతో రాణించాడు. ఫినిషర్‌ గా ఆకట్టుకున్నాడు. టి20 ప్రపంచకప్‌22 జట్టులో చోటు కూడా సంపాదించాడు. కానీ, దీంతోపాటే 2023 సీజన్‌ లో 13 మ్యాచ్‌ లలో 140 పరుగులే చేశాడు. ఈ ఏడాది మాత్రం 13 ఇన్నింగ్స్‌ లో 326 పరుగులు సాధించాడు.

ఓవరాల్‌ ఐపీఎల్‌ కెరీర్‌ లో డీకే.. 257 మ్యాచ్‌ లలో 4,842 పరుగులు చేశాడు. ఇందులో 22 అర్థ శతకాలు ఉన్నాయి.

గార్డ్ ఆఫ ఆనర్ ఇప్పించిన కోహ్లి ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భావోద్వేగానికి గురైన దినేశ్ కార్తీక్ ను స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓదార్చాడు. ఆటగాళ్లతో ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ ఇప్పించాడు. అభిమానులను కూడా ఉత్సాహపరుస్తూ ఆర్సీబీ ఆటగాళ్లతో కలిసి కోహ్లీ మైదానం మొత్తం చుట్టేశాడు.

కొసమెరుపు: దినేశ్ కార్తీక్ అంటే అందరికీ గుర్తొచ్చేది 2018 నాటి నిదహాస్ ఫైనల్ మ్యాచ్. బంగ్లాదేశ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో 12 బంతుల్లో 34 పరుగుల అసాధ్యమైన లక్యాన్ని కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టి పూర్తి చేశాడు.