దిగ్గజ స్పిన్నర్ రిటైర్మెంట్ లో అనూహ్య టర్న్..? అదేమిటో...?
దీనికితగ్గట్లే అతడు రిటైర్ అయ్యాక పెట్టిన ట్వీట్లు అనుమానం కలిగించాయి. అభిమానులందరూ జట్టులో ఏదో జరుగుతోందని.. అందుకే అతడు రిటైర్ అయ్యాడనే కామెంట్లు చేశారు.
By: Tupaki Desk | 16 Jan 2025 4:13 AM GMT500 వికెట్లు తీసిన స్పిన్నర్ అనూహ్యంగా రిటైర్ కావడం ఏమిటి..? అది కూడా విదేశాల్లో సిరీస్ మధ్యలో వైదొలగడం ఏమిటి..? ఆపై వెంటనే స్వదేశం వచ్చేయడం ఏమిటి..? అంతకు రెండు సిరీస్ ల ముందు సిరీస్ లో సెంచరీ కొట్టిన అతడు అనూహ్యంగా రిటైర్ కావడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా..? ఇదీ ఇటీవలి కాలంలో భారత క్రికెట్ అభిమానులను వేధిస్తున్న సందేహం. దీనికితగ్గట్లే అతడు రిటైర్ అయ్యాక పెట్టిన ట్వీట్లు అనుమానం కలిగించాయి. అభిమానులందరూ జట్టులో ఏదో జరుగుతోందని.. అందుకే అతడు రిటైర్ అయ్యాడనే కామెంట్లు చేశారు.
రవిచంద్రన్ అశ్విన్.. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్. బ్యాట్ తోనూ విలువైన పరుగులు చేసే అశ్విన్.. బోర్డర్–గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) సందర్భంగా మూడో టెస్టు అనంతరం రిటైర్ అయ్యాడు. అశ్విన్ లాంటి వాడు ఇలా చేశాడేమిటి? అని అందరూ నోరెళ్లబెట్టారు. అతడికి అవమానం జరిగిందని, అందుకే ఈ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. 500 పైగా వికెట్లు తీసిన మేటి ఆటగాడికి కనీసం ముగింపు (ఫేర్ వెల్) టెస్టు ఆడే అవకాశమైనా ఇవ్వలేదనే విమర్శలు వచ్చాయి.
కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ వీరిద్దరిలో అశ్విన్ రిటైర్మెంట్ కు కారణం ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇలా ఊహాగానాలు సాగుతుండగా.. తన రిటైర్మెంట్ పై అశ్విన్ యూట్యూబ్ ఛానెల్ లో స్పందించాడు.
బ్రేక్ నిర్ణయం తానే తీసుకున్నట్లు తెలిపాడు. మరే కారణం లేదన్నాడు. సిరీస్ మధ్యలోనే వచ్చేసింది అందుకే అని అన్నాడు. తాను తప్పుకొన్నాక క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడొద్దని అనుకున్నానని.. అందుకే, మెల్‌బోర్న్ తో పాటు సిడ్నీ టెస్టుల తర్వాత కొన్ని విషయాలపై పోస్టులు పెట్టానని చెప్పాడు.
ఫ్యాన్ వార్ తీవ్ర స్థాయిలో ఉందని.. ప్రజలు చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారని, వాటిలో ఏ నిజాలూ లేవని అశ్విన్ వివరించాడు. తనలోని క్రియేటివిటీని కోల్పోయినట్లుగా భావించినందుకే రిటైర్ అయినట్లు తెలిపాడు. తాను ముగించిన తీరూ సంతోషకరంగానే ఉందన్నాడు.