టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్? మళ్లీ అలాంటోడు దొరకుతాడా?
టీమ్ ఇండియాలో ప్రస్తుతం రిటైర్మెంట్ సీజన్ నడుస్తోంది.. ఏ టోర్నీ ముగిశాక ఎవరు రిటైర్ అవుతారా? అనే ఊహాగానాలు సాగుతున్నాయి.
By: Tupaki Desk | 9 March 2025 10:33 PM ISTటీమ్ ఇండియాలో ప్రస్తుతం రిటైర్మెంట్ సీజన్ నడుస్తోంది.. ఏ టోర్నీ ముగిశాక ఎవరు రిటైర్ అవుతారా? అనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు స్టార్ క్రికెటర్లు రిటైర్ అవుతున్నారు. గత ఏడాది టి20 ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి, మేటి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టి20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. వయసు రీత్యా 35 దాటిన ఈ ముగ్గురూ కుర్రాళ్లకు చాన్సిచ్చారు అనుకోవాలి.
ఇక ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) జరుగుతున్న సమయంలోనే దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అశ్విన్ టెస్టులకు మాత్రమే పరిమితం కాబట్టి.. ఇప్పట్లో టెస్టులు లేవు కాబట్టి ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు.
ఇప్పుడు టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ మరొకరు రిటైర్ అవుతున్నారు. దీంతో మళ్లీ అలాంటోడు దొరకుతాడా? అనే సందేహం వ్యక్తం అవుతోంది. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు.. స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. టి20ల నుంచి తప్పుకొన్న జడేజా మొత్తానికే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంటున్నారు. జడేజా 2009 నుంచి టీమ్ ఇండియాలో భాగం. మధ్యలో వేటుకు గురైనా 2013 నుంచి మాత్రం వెనుదిరిగి చూడలేదు.
అయితే, బ్యాటింగ్ లో ఫర్వాలేకున్నా.. జడేజా కొన్నాళ్లుగా టెస్టులో అనుకున్నంతగా బంతిని స్పిన్ చేయలేకపోతున్నాడు. వన్డేల్లోనూ జడేజా కంటే స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ బాగా ఆడుతున్నాడు. అచ్చం జడేజాలాగే బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక జడేజాకు 36 ఏళ్లు. దీంతోపాటు అతడు బీజేపీలోనూ చేరాడు. జడేజా రివాబా జడేజా గుజరాత్ లో బీజేపీ ఎమ్మెల్యే.
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత జడేజా రిటైర్ కానున్నాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ సందర్భంగా అతడి తన పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేయగా.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వచ్చి హగ్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఎమోషనల్ వాతావరణం కనిపించింది. ఇటీవల అశ్విన్ తో పాటు ఆస్ట్రేలియా మేటి క్రికెటర్ స్టీవ్ స్మిత్ ను ఇలాగే కోహ్లి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత వారు రిటైర్ అయ్యారు.
కాగా, రవీంద్ర జడేజా సూపర్ స్పిన్నర్. అత్యంత స్వల్ప సమయంలో ఓవర్ పూర్తిచేయగల సామర్థ్యం అతడి సొంతం. బ్యాటింగ్ లోనూ లోయరార్డర్ లో జడేజా అత్యంత కీలకం. అన్నిటికి మించి జడేజా సూపర్ ఫీల్డింగ్ జట్టుకు బలం. మళ్లీ ఇలాంటి ఆల్ రౌండర్ దొరుకుతాడా? అనేది చూడాలి.