Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియా మేటి ఆల్ రౌండర్ పై గంభీర్ మార్క్ వేటు

ఎవరూ గమనించలేదు కానీ.. శ్రీలంకతో వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో అతిపెద్ద మార్పు రవీంద్ర జడేజా లేకపోవడం.

By:  Tupaki Desk   |   20 July 2024 11:30 PM GMT
టీమ్ ఇండియా మేటి ఆల్ రౌండర్ పై గంభీర్ మార్క్ వేటు
X

ఎవరూ గమనించలేదు కానీ.. శ్రీలంకతో వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో అతిపెద్ద మార్పు రవీంద్ర జడేజా లేకపోవడం. మరి అతడు విశ్రాంతి కోరాడా? సెలక్టర్లు ఎంపిక చేయలేదా? అనేది తెలియదు కానీ.. జడేజాను మాత్రం పక్కనపెట్టారనే వాదన వినిపిస్తోంది.

30 ఏళ్ల కిందట రిటైరైన దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ స్థాయిలో మరో ఆటగాడు భారత జట్టుకు దొరుకుతాడా? అని అందరూ ఎదురుచూశారు. ఇర్ఫాన్ పఠాన్ నుంచి ఎందరో ఆటగాళ్లు వచ్చినా కపిల్ కు కనీసం దగ్గరగా రాలేకపోయారు. అయితే స్పిన్ ఆల్ రౌండర్ గా ఆ స్థానాన్ని కాస్తయినా భర్తీ చేశాడు రవీంద్ర జడేజా. 2006, 2008 అండర్-19 ప్రపంచ కప్ లు ఆడిన అరుదైన రికార్డున్న జడేజా.. 2009లో టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. మధ్యలో రెండేళ్లు జట్టుకు దూరమైనా.. 2013 నుంచి మాత్రం వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేకపోయింది. అందరికీ తెలియని విషయం ఏమంటే.. రంజీ ట్రోఫీలో జడేజా మూడు ట్రిపుల్ సెంచరీలు చేశాడు.

టి20లకు గుడ్ బై..

ఇటీవలి టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన జడేజా ఆ తర్వాత సహచరులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల తరహాలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. వాస్తవానికి జడేజా ఏడాది నుంచి ఫామ్ లో లేడు. ఐపీఎల్ లోనూ ఈ ఏడాది అతడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పెద్దగా రాణించలేదు. పైగా రెండేళ్ల కిందట చెన్నై కెప్టెన్సీని వివాదాస్పద రీతిలో వదిలేశాడు. ఇక టి20 ప్రపంచ కప్ లోనూ రాణించలేదు. 35 ఏళ్ల జడేజాను టి20 జట్టులో కొనసాగించడం కష్టమే అనిపించింది. అయితే, అతడే రిటైర్మెంట్ ఇచ్చాడు.

వన్డేలకూ కష్టమే..

ఎడమచేతి మెరుపు స్పిన్, 8వ నంబరులో బ్యాటింగ్.. మైదానంలో మెరుపు వేగంతో ఫీల్డింగ్ తో జడేజా టీమ్ ఇండియాకు మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఉపయోగపడ్డాడు. అయితే, అతడిని టి20ల్లోనే కాదు వన్డేల్లోనూ చూసే అవకాశం ఉండదని తెలుస్తోంది. శ్రీలంకతో సిరీస్‌ కు ఎంపిక చేయకపోవడంతో ఈ చర్చ మరింత పెరిగింది. భవిష్యత్‌ ప్రణాళికల దృష్ట్యా యువ ఆల్ రౌండర్లను ప్రోత్సహించాలని గంభీర్ భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అందులోనూ జడేజాకు దీటుగా, అదే తరహా బౌలింగ్ యాక్షన్, బ్యాటింగ్ సామర్థ్యంతో అక్షర్ పటేల్ అందుబాటులోకి వచ్చాడు. టి20 ప్రపంచ కప్ ఫైనల్లో అక్షర్ బ్యాటింగ్ ను అందరూ చూశారు. ఇతడినే కాక ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్‌ సుందర్‌ నూ వన్డేలకు ఎంపిక చేశారు. జడేజా స్థానాన్ని సుందర్‌ తో భర్తీ చేయనున్నట్లు స్పష్టం అవుతోంది. కాగా, వచ్చే ఫిబ్రవరిలో భారత్ ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడనుంది. ఆలోపు ఆరు వన్డేలే ఉన్నాయి. అందులో మూడు శ్రీలంకతోనే. దీంతోనే చాంపియన్స్ ట్రోఫీకి గంభీర్ జట్టును సిద్ధం చేస్తున్నాడు.

టెస్టుల్లో కనిపిస్తాడు.

జడేజా భారత్ కు 197 వన్డేలు ఆడి 2,756 పరుగులు చేశాడు. 220 వికెట్లు పడగొట్టాడు. 72 టెస్టుల్లో 294 వికెట్లు తీశాడు. 3,026 పరుగులు చేశాడు. ఇకపై అతడు టెస్టుల్లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది.