Begin typing your search above and press return to search.

పరుగులు, వికెట్లు, క్యాచ్ లు '0'.. టీమిండియా ఆల్ రౌండర్ కు గడ్డు కాలం

కొంత కష్టంగా అనిపించినా.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు టి20 కెరీర్ మసకబారుతోంది

By:  Tupaki Desk   |   15 Jun 2024 11:46 AM GMT
పరుగులు, వికెట్లు, క్యాచ్ లు 0.. టీమిండియా ఆల్ రౌండర్ కు గడ్డు కాలం
X

అతడికి ఇకమీదట పొట్టి ఫార్మాట్ లో చోటు కష్టమేనేమో? మొన్నటివరకు ఎదురేలేదని అనిపించిన స్టార్ ఆల్ రౌండర్ నేడు తుదిజట్టులోనే ఉండడం కష్టమేనేమో? మైదానంలో పాదరసంగా కదిలే అతడు.. ఆ ఫీల్డింగ్ తో మాత్రమే ఎక్కువ కాలం కొనసాగలేడేమో? టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది.

అన్నీ సున్నాలే..

కొంత కష్టంగా అనిపించినా.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు టి20 కెరీర్ మసకబారుతోంది. బ్యాటింగ్ కూడా చేయగల అక్షర్ పటేల్ వంటి ఆల్ రౌండర్ దొరకడంతో జడేజా స్థానానికి ఎసరు వచ్చింది. దీనికితోడు జడేజా 35 ఏళ్లకు వచ్చాడు. ఫామ్ కూడా సరిగా లేదు. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాతో మ్యాచ్ లలో ఒక్క పరుగు కూడా చేయలేదు అతడు. వికెట్ కూడా తీయలేదు. అద్భుత ఫీల్డర్ అయిన అతడు ఒక్క‌ క్యాచ్ కూడా పట్టలేదు.

అక్షర్ నే నమ్ముతున్న మేనేజ్ మెంట్?

జడేజా కంటే అక్షర్ పటేల్ పైనే టీమిండియా మేనేజ్ మెంట్ ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకనే పాక్ తో మ్యాచ్ లో ముందుగా అతడినే బ్యాటింగ్ కు పంపింది.

ఇక మూడు మ్యాచ్ లలో జడేజాకు ఒకేసారి బ్యాటింగ్ వచ్చింది. పాక్ తో మ్యాచ్‌ లో అతడు తొలి బంతికే ఔటయ్యాడు. ఐర్లాండ్, అమెరికాతో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఫీల్డింగ్ లో రనౌట్ లేదా ఒక్క క్యాచ్ కూడా అందుకోలేక‌పోయాడు. అమెరికాతో మ్యాచ్ లో జడేజాకు బౌలింగ్ అవకాశం ఇవ్వలేదు. పాక్ పై అందరూ చక్కగా బౌలింగ్ చేస్తుంటే జడేజా 2 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చాడు. వికెట్ దక్కలేదు.

పుంజుకుంటేనే..

ఈ ఏడాది ఐపీఎల్ లోనూ జడేజా ఆకట్టుకోలేదు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరలేకపోవడానికి ఇదీ ఓ కారణం. టీమిండియా తరఫునా విఫలం అవుతున్న అతడు మరోసారి సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. లేదంటే పొట్టి ఫార్మాట్ లో చోటు కష్టమే.