చెన్నై ఆల్ రౌండ్ అల్లుడికి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ షాక్..
గత ఐపీఎల్ సీజన్ లో అద్భుత ప్రదర్శన ఎవరిదంటే.. చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ది అని అందరూ అంటారేమో..?
By: Tupaki Desk | 30 July 2024 9:51 AM GMTగత ఐపీఎల్ సీజన్ లో అద్భుత ప్రదర్శన ఎవరిదంటే.. చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ది అని అందరూ అంటారేమో..? కానీ, అభిమానుల మనసులు గెలుచుకున్నది మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. వరుసగా ఐదారు మ్యాచ్ లు ఓడిపోయినా.. ఆపై ఆరు మ్యాచ్ లు గెలిచి నాకౌట్ కు చేరింది. అక్కడ కూడా మంచి ప్రదర్శనే చేసినా అది సరిపోలేదు. దీంతో ఈ సాలా (ఈ సంవత్సరం కూడా) కన్నీళ్లే అంటూ వెనుదిరిగింది. అయితే, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ లో ఓ ఆటగాడు మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అది ఎంతగా అంటే.. వరుసగా డకౌట్లు.. సింగిల్ డిజిట్ కు ఔట్ అవుతూ.. తన మానసిక స్థితి బాగోలేదని వైదొలగేంతగా... నాలుగైదు మ్యాచ్ ల తర్వాత తిరిగొచ్చిన అతడు పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ ప్రభావం జట్టుపై పడింది.
మ్యాక్సీ.. ఏదీ మాయ?
ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎంతటి విధ్వంసకారుడో చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ లో అతడు అఫ్ఘానిస్థాన్ పై సాధించిన డబుల్ సెంచరీ అతి గొప్ప వన్డే ఇన్నింగ్స్ లో ఒకటి అనడంలో సందేహం లేదు. అయితే, ఆ వెంటనే మ్యాక్స్ వెల్ ఫామ్ కోల్పోయాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో బెంగళూరు తరఫున దారుణ ప్రదర్శన చేశాడు. ఓ దశలో తన మానసిక స్థితి బాగోలేదంటూ రెస్ట్ తీసుకున్నాడు. కాగా, ఇటీవలి జరిగిన టి20 ప్రపంచ కప్ లోనూ మ్యాక్సీ ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. అఫ్ఘానిస్థాన్ పై అర్థ సెంచరీ చేసినా అదేమీ గెలుపునకు ఉపయోగపడలేదు. దీంతోనే 35 ఏళ్ల మ్యాక్స్ వెల్ పని అయిపోయిందంటూ కథనాలు వచ్చాయి. దీనికితోడు మెక్ గర్క్ వంటి యువ సంచలనాలు దూసుకొస్తున్న తరుణంలో మ్యాక్సీకి చోటు కష్టమేనంటూ చెప్పుకొచ్చారు.
బెంగళూరు బైబై
వచ్చే సీజన్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమిళనాడు అల్లుడైన గ్లెన్ మ్యాక్స్ వెల్ ను వదిలించుకోవాలని చూస్తోందట. ఈ మేరకు అతడికి సంకేతాలు పండడంతో మ్యాక్స్ వెల్ ఇన్ స్టా గ్రామ్ లో ఆర్సీబీని అన్ ఫాలో చేశాడు. అంతేకాదు.. బెంగళూరు మంచి ప్రణాళికలతో కూడా ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ ను తీసుకోవాలని చూస్తోంది. తద్వారా బ్యాటింగ్ లో బలోపేతం కానుంది. ఎలాగూ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ రిటైర్ అయినందున రాహుల్ ఆ పాత్ర పోషించడం బెంగళూరుకు బాగా మేలుచేస్తుంది. రాహుల్ సొంత రాష్ట్రం కర్ణాటకనే. బెంగళూరు అతడికి కొట్టిన పిండి. దీంతో వచ్చే సీజన్ లో అయినా.. బెంగళూరు ఈ సాలా కప్ నమదే (ఈ సంవత్సరం కప్ మనదే) ఆశ నెరవేరుతుందోమో చూద్దాం..?