Begin typing your search above and press return to search.

ముంబైని పడగొట్టి.. సోషల్ మీడియా టాప్ లోకి ఆర్సీబీ

కొన్నాళ్ల కిందట టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల మధ్య విభేదాలు ఉన్నాయంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 March 2024 2:30 PM GMT
ముంబైని పడగొట్టి.. సోషల్ మీడియా టాప్ లోకి ఆర్సీబీ
X

కొన్నాళ్ల కిందట టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల మధ్య విభేదాలు ఉన్నాయంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికితగ్గట్లే అటు కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడం..ఇటు రోహిత్ కు పగ్గాలు దక్కడం.. కోహ్లి జట్టుకు దూరంగా ఉండడం.. అనేక ఉదాహరణలు కనిపించాయి. మైదానంలో రోహిత్, కోహ్లి కదలికలను అందరూ గమనించేవారు. చివరకు జట్టు రోహిత్ వర్గం, కోహ్లి వర్గంగా చీలిపోయిందనే వాదన వినిపించింది. అయితే, వారిద్దరూ ప్రొఫెషనల్ క్రికెటర్లు. చిన్న వయసు నుంచే జాతీయ జట్టుకు ఆడిన ప్రతిభావంతులు. అలాంటివారి మధ్య విభేదాలు ఉంటాయంటే ఎవరూ నమ్మరు. దీనిపై కొన్నాళ్లకు రోహిత్ స్పష్టమైన వివరణ ఇచ్చాడు. మరి ఈ ప్రభావమో ఏమోగానీ.. ఐపీఎల్ లోనూ కోహ్లి ప్రాతినిధ్యం వహించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రోహిత్ ప్రాతినిధ్యం వహించే ముంబై ఇండియన్స్ (ఎంఐ) మధ్య మ్యాచ్ లు పోటాపోటీగా జరుగుతుంటాయి.

సోషల్ మీడియాలోనూ అభిమానులు ఈ మేరకు కోహ్లి, రోహిత్ వర్గాలు విడిపోయారా? అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. బెంగళూరు, ముంబై రెండూ మహా నగరాలు కావడంతో వీటికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మరో ప్రధాన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కు వీరి కంటే ఫాలోవర్లు ఎక్కువనే ఉన్నారు.

ముంబైని వెనక్కునెట్టి

ఆదివారం జరిగిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఢిల్లీని ఓడించి టైటిల్ కొట్టిన సంగతి తెలిసిందే. డబ్ల్యూపీఎల్ నిరుడు ప్రారంభమైంది. రెండో సీజన్ లోనే బెంగళూరు చాంపియన్ అయింది. అయితే, బెంగళూరు పురుషుల జట్టు 16 సీజన్లుగా ఆడుతున్నా చాంపియన్ గా నిలవలేకపోయింది. మరోవైపు ఈ గెలుపుతో సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫాలోయర్ల సంఖ్య పెరిగింది. ముంబైని వెనక్కునెట్టి ఇప్పుడు బెంగళూరు ఇన్ స్టా గ్రామ్ లో అత్యధిక ఫాలోయర్లు కలిగిన రెండో జట్టుగా ఫ్రాంచైజీగా నిలిచింది. ప్రస్తుతం ఆర్సీబీకి 12.7 మిలియన్లు, ముంబైకి 12.6 మిలియన్లు ఫాలోవర్లు ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ 14.1 మిలియన్ల ఫాలోవర్లతో వీటికి అందనంత ఎత్తులో నిలిచింది. కాగా, ముంబై ఇండియన్స ఈ ఏడాది తమ కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ నుంచి తీసుకొచ్చి పగ్గాలు అప్పగించింది. ఈ ప్రభావంతో ముంబైని చాలామంది సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు.