ఆర్.ఆర్. వర్సెస్ ఆర్సీబీ... బలాబలాలు, హెడ్ టు హెడ్ గణాంకాలివే!
ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా 19వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.
By: Tupaki Desk | 6 April 2024 4:11 AM GMTఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా 19వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇప్పటికే సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ కు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉఇంది. ఈ జట్టు.. ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ మూడు మ్యాచ్ లు ఓడిన బెంగళూరు తో తలబడనుంది! జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ఇందుకు సిద్ధమైంది!
అన్నీ అనుకూలంగా సాగుతున్న రాజస్థాన్ రాయల్స్ సంగతి కాసేపు పక్కనపెడితే... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అతిపెద్ద ఆందోళన వారి విదేశీ బ్యాటర్లనే చెప్పాలి! కీలక సమయాలో వారి ఫెయిల్యూర్ జట్టుకు శాపంగా మారుతుంది. ఇదే సమయంలో బౌలింగ్ విభాగం కూడా దారాళంగా పరుగులు సమర్పించుకుంటుంది. లక్నో తో జరిగిన చివరి మ్యాచ్ లో.. పార్ట్ నర్ షిప్ లను బ్రేక్ చేయడంలో ఆర్సీబీ బౌలర్లు విఫలమయ్యారు!
ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ జట్టు పూర్తిగా విరాట్ కోహ్లి చేసిన పరుగులపైనే ఆధారపడి ఉంది! ఫాఫ్ డు ప్లెసిస్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్ వెల్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్ లతో కూడిన టాప్ – మిడిల్ ఆర్డర్ లు తమ స్థాయికి తగ్గట్లు ఆడటం లేదనే చెప్పాలి! ఈ మ్యాచ్ లో ఒత్తిడి అంతా బెంగళూరుపైనే ఉండే అవకాశం ఉంది. రాజస్థాన్ ఏమాత్రం ఒత్తిడిలో ఉండదు!
రాజస్థాన్ రాయల్స్ లో కీ ప్లేయర్స్ లో రియాన్ పరాగ్ మూడు మ్యాచ్ లలో 181 పరుగులు చేయగా.. కెప్టెన్ సంజూ శాంసన్ 109 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో... చాహల్ 3 మ్యాచ్ లలోనూ 6 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ ఐదు వికెట్లు పడగొట్టాడు!
ఇక బెంగళూరు విషయానికొస్తే.. ఇక్కడ అంతా వన్ మ్యాన్ షో నే ఎక్కువగా నడుస్తుంది. ఇందులో భాగంగా.. 4 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ 203 పరుగులు చేయగా.. దినేష్ కార్తీక్ 90 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో... మ్యాక్స్ వెల్ 4, యష్ దయాల్ 4 వికెట్లు పడగొట్టారు.
హెడ్-టు-హెడ్ గణాంకాలు!:
ఐపీఎల్ లో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 30 సార్లు తలపడ్డాయి. వీటిలో బెంగళూరుపై రాజస్థాన్ 12 మ్యాచ్ లు గెలుపొందగా.. రాజస్థాన్ పై బెంగళూరు 15 మ్యాచ్ లు గెలిచింది. ఇక మిగిలిన మూడు మ్యాచ్ లూ ఎలాంటి ఫలితాలు ఇవ్వకుండానే ముగిసాయి.
ఇక బెంగళూరుపై రాజస్థాన్ అత్యధిక స్కోరు 217 కాగా... రాజస్థాన్ పై బెంగళూరు అత్యధిక స్కోరు 200గా ఉంది!