బెంగళూరు వర్సెస్ హైదరాబాద్... నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్!!
బెంగళూరు టీం లో విరాట్ కొహ్లీ వన్ మ్యాన్ షో చేస్తున్నా జట్టు కలిసిరాకపోవడం వారికి శాపంగ మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 15 April 2024 5:21 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ లో మ్యాచ్ నెంబర్ 30 ఈ రోజు జరగనుంది. ఇందులో భాగంగా... చినస్వామీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ మూడు గెలిచిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉండగా.. ఆరు మ్యాచ్ లలో ఒక్కటి మాత్రమే గెలిచిన బెంగళూరు లాస్ట్ లో ఉంది! అంటే... పోటీలో నిలవాలంటే బెంగళూరు ఈ మ్యాచ్ కచ్చితంగా గెలిచి తీరాలన్నమాట!
బెంగళూరు టీం లో విరాట్ కొహ్లీ వన్ మ్యాన్ షో చేస్తున్నా జట్టు కలిసిరాకపోవడం వారికి శాపంగ మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచ్ లలో 319 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉండగా... ఈ జట్టులో డూప్లెసిస్ 170, దినేష్ కార్తీక్ 143 పరుగులతో ఉన్నారు. ఇక బౌలర్ల విషయానికొస్తే... యాష దయాల్ 5 మ్యాచ్ లు ఆడి ఐదు వికెట్లు, మ్యాక్స్ వెల్ ఆరు మ్యాచ్ లు ఆడి 4 వికెట్లు పడగొట్టారు.
ఇక సన్ రైజర్స్ విషయానికొస్తే... ఐదు మ్యాచ్ లు ఆడిన క్లాసెన్ 186 పరుగులు చేసిన టాప్ స్కోరర్ గా ఉండగా.. అభిషేక్ శర్మ 177, ట్రావిన్స్ హెడ్ 133 పరుగులు చేశారు. ఇక బౌలింగ్ డిపార్ట్ మెంట్ లో కెప్టెన్ కమిన్స్ ఐదు మ్యాచ్ లలో 6 వికెట్లు తీసుకోగా, నటరాజన్ 3 మ్యాచ్ లలో 5 వికెట్లు తీసుకున్నాడు.
హెడ్-టు-హెడ్ రికార్డులు:
బెంగళూరు, హైదరాబాద్ లు ఇప్పటి వరకు 23 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాయి. వీటిలో ఆర్సీబీ 10 మ్యాచ్ లు గెలుపొందగా, హైదరాబాద్ 12 మ్యాచ్ లలోనూ గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితాలను ఇవ్వలేదు. ఇక, హైదరాబాద్ పై బెంగళూరు అత్యధిక స్కోరు 227 కాగా, బెంగళూరుపై హైదరాబాద్ అత్యధిక స్కోరు 231 గా ఉంది.
పిచ్ రిపోర్ట్:
చిన్నస్వామి పిచ్ రెండో బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఈ సీజన్ లోని మొదటి రెండు గేమ్ లలో ఇది స్పష్టంగా కనిపించింది కూడా. ఇందులో భాగంగా... మార్చి 25న పంజాబ్ కింగ్స్ నిర్ధేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో బెంగళూరు విజయవంతంగా ఛేదించగా.. మార్చి 29న కోల్ కతా నైట్ రైడర్స్.. బెంగళూరు నిర్దేశించిన 182 పరుగుల కేవలం 16.5 ఓవర్లలోనే అధిగమించింది.
ఇక ఈ మైదానంలో 68.18% వికెట్లు పేసర్లే తీయడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ మైదానంలో పేసర్లు 647 వికెట్లు తీయగా, స్పిన్నర్లు 302 వికెట్లు తీశారు. ఈ క్రమంలో... ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 170 పరుగులుగా ఉంది.