Begin typing your search above and press return to search.

బెంగళూరుతో మ్యాచ్... హైదరాబాదీల ఈ కోరిక నెరవేరుతుందా?

ఆడిన 7 మ్యాచ్ లలోనూ ఐదు మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.

By:  Tupaki Desk   |   25 April 2024 4:06 AM GMT
బెంగళూరుతో మ్యాచ్... హైదరాబాదీల ఈ కోరిక నెరవేరుతుందా?
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఆడిన 7 మ్యాచ్ లలోనూ ఐదు మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కేకేఆర్ కూ సన్ రైజర్స్ కూ సమాన పాయింట్లే ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేటు కేకేఆర్ కు కాస్త మెరుగ్గా ఉంది! ఆ సంగతి అలా ఉంచితే... నేడు ఆర్సీబీతో జరగబోతోన్న మ్యాచ్ లో ఫ్యాన్స్ హైదరాబాద్ జట్టును ఓ ఆసక్తికరమైన కోరిక కోరుతున్నారు.

అవును... 277/3, 287/3, 266/7 ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేసిన భారీ స్కోర్లు ఇవి. పైగా ఇవి రికార్డ్ నెలకొల్పిన మొత్తం పరుగులు కూడా! పైగా ఇందులో 287/3 టోటల్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైన కాగా.. అది కూడా వారి సొంతమైదానం చినస్వామి స్టేడియంలో! ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 34, ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 102, క్లాసెన్ 67, మార్కరం 32*, అబ్దుల్ 37* లు బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు.

ఈ క్రమంలో తమ సొంత మైదానంలో హైదరాబాద్ జట్టు బెంగళూరుతో పోరుకు సిద్ధమైంది. ఈ సమయంలో ఫుల్ ఫాం లో ఉన్న సన్ రైజర్స్ బ్యాటర్లు గత బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చేసిన 187 పరుగులకు.. మరో 13 పరుగులు జోడించాలని కోరుకుంటున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 6 ఓవర్లు (పవర్ ప్లే) ముగిసే సరికి వికెట్లేమీ నష్టపోకుండా 125 పరుగులు చేసిన జట్టుకు ఇది సాధ్యమే అనేది వారి నమ్మకంగా ఉంది.

ఇదే ఉప్పల్‌ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్‌ జట్టు 277 పరుగులు చేసింది. దీంతో... ఒక్కసారిగా ఐపీఎల్‌-17లో సరికొత్త ఊపు రావడంతో పాటు, హైదరాబాద్ ఫ్యాన్స్ లో కొంగొత్త ఉత్సాహం వచ్చింది. ఇదేదో గాలివాటం అనుకునేలోపు వారం రోజులు తిరక్కుండానే తన రికార్డును తానే బద్దలు కొట్టింది సన్‌ రైజర్స్‌. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో కేవలం 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులతో సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇలా ఎటు చూసినా పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్... నేడు బెంగళూరుతో.. సొంత మైదానం ఉప్పల్ లో జరగనున్న మ్యాచ్ లో ఇటీవల బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చేసిన 287 కి మరో 13 కలిపేస్తే... ఐపీఎల్ లో 300 పరుగుల రికార్డ్ ను సృష్టించినట్లవుతుందని భావిస్తున్నారు.. ఆశిస్తున్నారు.. జరుగుతుందని నమ్ముతున్నారు. మరి ఏమి జరగబోతోందనేది తెలియాలంటే... కొన్ని గంటలు వేచి చూడాల్సిందే!