Begin typing your search above and press return to search.

ఉత్తరప్రదేశ్ ఎంపీతో టీమ్ ఇండియా క్రికెటర్ వివాహం!

ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా డాషింగ్ బ్యాటర్ రింకూ సింగ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు.

By:  Tupaki Desk   |   17 Jan 2025 11:35 AM GMT
ఉత్తరప్రదేశ్ ఎంపీతో టీమ్ ఇండియా క్రికెటర్ వివాహం!
X

ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్స్ లు కొట్టి అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన ఆ క్రికెటర్ ఫేట్ మారిపోయింది.. అతడి తండ్రి గ్యాస్ డెలివరీ ఏజెంట్. కొడుకు మాత్రం క్రికెట్ లో రాణిస్తూ టీమ్ ఇండియా స్థాయికి వచ్చాడు. దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ స్థాయిలో ఫినిషర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే టీమ్ ఇండియా తరఫున టి20ల్లో స్థానాన్ని ఖాయం చేసుకున్న అతడు భవిష్యత్ లో వన్డేలకూ ఎంపికవుతాడని భావిస్తున్నారు.

సంక్రాంతి ముగియడంతో.. ముహూర్తాలకు వేళయింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. వచ్చే రెండు నెలలు మంచి ముహూర్తాలు ఉన్నట్లున్నాయ్. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా డాషింగ్ బ్యాటర్ రింకూ సింగ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు.

టి20ల్లో మంచి ఆటగాడిగా ఎదుగుతున్న రింకూ.. ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్ తో జరగనున్న ఐదు మ్యాచ్ ల సిరీస్ కు ఎంపికయ్యాడు. తుది జట్టులోనూ అతడికి చోటు దక్కే అవకాశం ఉంది. కాగా, రింకూ ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు. అతడికి తాజాగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ తో నిశ్చితార్థం జరిగింది.

సరోజ్.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మచ్లిషహర్ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. దేశంలోని అతి పిన్న వయు మహిళా ఎంపీల్లో ఈమె ఒకరు. కాగా, రింకూ-ప్రియా నిశ్చితార్థం అత్యంత నిరాడంబరంగా జరిగింది.

టీమ్ ఇండియా తరఫున 2 వన్డేలు, 30 టి20లు ఆడిన రింకూ త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకీ ఎంపికయ్యే ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు.

కొసమెరుపు: టీమ్ ఇండియా టెస్టు, వన్డే జట్టు సభ్యుడైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రవీబా జడేజా గుజరాత్ లో బీజేపీ తరఫున ఎమ్మెల్యే. ఇప్పుడు రింకూ భార్య సమాజ్ వాదీ పార్టీ ఎంపీ.