టీమ్ ఇండియా హిట్టర్ పచ్చబొట్టు.. దేవుడి బిగ్ ప్లాన్
2023 ఐపీఎల్.. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్. టార్గెట్ 205
By: Tupaki Desk | 6 Oct 2024 1:30 AM GMT2023 ఐపీఎల్.. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్. టార్గెట్ 205. కానీ, కోల్ కతా ఏడు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో 31 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న బ్యాట్స్ మన్ తొలి బంతికి రెండు పరుగులే తీశాడు. దీంతో ఆ జట్టు గెలవడం కష్టమేనని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడే జరిగింది అద్భుతం. వరుసగా ఐదు సిక్సులు.. బౌలర్ పై దయ లేకుండా విరుచుకుపడ్డాడు అతడు.. అప్పుడు కట్ చేస్తే.. ఇప్పుడా క్రికెటర్ టీమ్ ఇండియా టి20 రెగ్యులర్ ప్లేయర్.
డాషింగ్.. డాషింగ్..
17 ఏళ్ల కిందట ఓకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టి టీమ్ ఇండియా టి20 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. మళ్లీ ఎడమచేతివాటంతో అలాంటి డాషింగ్ బ్యాట్స్ మన్ దొరుకుతాడా? అని ఎదురుచూస్తుండగా వచ్చాడు రింకూ సింగ్. ఉత్తరప్రదేశ్ కు చెందిన రింకూ.. యువరాజ్ లా స్పిన్నరే. కానీ, పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడని అనుకున్నారు. కానీ, శ్రీలంకతో టి20 సిరీస్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు కూడా తీసి జట్టును గెలిపించాడు. కాగా, రింకూ ఎడమచేతి వాటం బ్యాటర్. అదే చేతిపై గాడ్స్ ప్లాన్ (దేవుడి ప్రణాళిక) అని పచ్చబొట్టు ఉంటుంది. దీనివెనుక కారణం ఏమిటో రింకూ తాజాగా తెలిపాడు.
జట్టులో చోటు తప్పక..
ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె కూడా జట్టులో ఉన్నప్పటికీ రింకూకూ చోటు కచ్చితంగా ఇస్తున్నారు. దీన్నిబట్టే అతడి ప్రాధాన్యం తెలుస్తోంది. కాగా, రింకూ రేపటి నుంచి బంగ్లాదేశ్ జరిగే టి20 సిరీస్ లో ఏడో నంబరు బ్యాటర్ గా బరిలో దిగనున్నాడు. ఈ సందర్భంగా గ్వాలియర్ లో ఉన్నాడు. అతడికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇదిప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో రింకూ తన చేతిపై ‘దేవుడి ప్లాన్’ అని రాసున్న టాటూ గురించి చెప్పాడు. ఏడేళ్ల పాటు ఐపీఎల్ లో ఆడేందుకు ఆడటానికి ఎదురుచూసిన తాను దేవుడి ప్లాన్ ప్రకారమే ముందుకువెళ్తున్నట్లు చెప్పాడు. ఈ టాటూ వేయించుకున్నాకే తన జీవితంలో మార్పు వచ్చిందని వివరించాడు.