నాకు ఇంగ్లిష్ రాదూ.. టీమిండియా క్రికెటర్ కు గమ్మత్తైన కష్టం
దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కు ఎంపికయ్యాడు. ఈ అవార్డు అందుకునేందుకు వెళ్లినపుడు ఇంగ్లిష్ లో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు.
By: Tupaki Desk | 22 Aug 2023 12:01 PM GMTకిక్ సినిమాలో "నాకు ఇంగ్లిష్ రాదూ".. అంటూ రవితేజ అద్భుతంగా హాస్యం పండిస్తాడు. కానీ ఆ సినిమాలో అతడికి ఇంగ్లిష్ వచ్చు. కానీ, మన చెప్పుకోబోయే కథనంలో క్రికెట్ హీరోకు నిజంగానే ఇంగ్లిష్ రాదు. అలాంటివాడికి ఏకంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఇంగ్లిష్ లో మాట్లాడక తప్పని పరిస్థితి ఎదురైంది. ఇక చూడండి అతడి కష్టాలు...
ఐర్లాండ్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ ద్వారా టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తొలిసారి బ్యాట్ పట్టి మైదానంలోకి దిగాడు. శుక్రవారం మ్యాచ్ ద్వారానే అరంగేట్రం చేసినప్పటికీ బ్యాటింగ్ అవకాశం రాలేదు. అయితే అందివచ్చిన చాన్స్ ను ఉపయోగించుకున్న అతడు ఐదో స్థానంలో వచ్చి 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. టీమిండియా గెలుపులో అతడిదే కీలక పాత్ర. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కు ఎంపికయ్యాడు. ఈ అవార్డు అందుకునేందుకు వెళ్లినపుడు ఇంగ్లిష్ లో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. సొంత భాష హిందీలో అయితే సులువుగా ఉంటుందని ప్రజెంటేటర్ కు రింకూ చెప్పాడు.
కెప్టెన్ సాయం..
అంతర్జాతీయ మ్యాచ్ కాబట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సందర్భంగా హిందీలో మాట్లాడింది మిగతా దేశాల వారికి తెలియదు. దీంతో రింకూ ఇబ్బందిని గమనించిన కెప్టెన్ బుమ్రా ట్రాన్స్ లేటర్ గా మారాడు. రింకూ చెప్పిన దాన్ని ఇంగ్లిష్ లోకి అనువదించాడు. అయితే.. ఇక్కడే ప్రజంటేటర్ చిన్న గమ్మత్తు చేశాడు. "రింకూ న్వువు కెప్టెన్ మాట వింటావా?" అంటూ కెప్టెన్, అనువాదం చేస్తున్న బుమ్రా ఎదుటే ప్రశ్నించాడు. దీన్నికూడా అంతే ఫన్ గా తీసుకున్న బుమ్రా అనువాదం చేసి చెప్పాడు. "నేను ఎప్పుడూ కెప్టెన్ మాట వింటా" అని బదులిచ్చాడు.
ఆ ఐదు సిక్స్ లు జీవితాన్ని మార్చేశాయి
మ్యాచ్ ముగిశాక రింకూను భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఐపీఎల్ లో ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ పై చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సులు కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అవే తన జీవితాన్ని మార్చేశాయని రింకూ పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచ్ లలో కూడా రింకూ దూకుడు కొనసాగింది. తద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
కొసమెరుపు: ఐర్లాండ్ టూర్ కు రింకూ తొలిసారిగా విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణించాడు. ఇది అతడి జీవితంలో ఊహించని అనుభవం. ఈ సందర్భంగా పక్క సీట్లో కూర్చున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ.. రింకూను సరదాగా ఇంటర్య్వూ చేశాడు. ఇంగ్లిష్ లో మాట్లాడాల్సిన అవసరం వస్తే వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ సలహా తీసుకుంటానని రింకూ చెప్పాడు. నిజంగానే అలాంటి పరిస్థితి ఎదురైంది. అయితే, సంజూ కాకుండా బుమ్రా సాయం చేశాడు.