Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియాకు 'గాయం'.. ఎంత పెద్దదైతే అంత ఇబ్బంది

అయితే, మ్యాచ్ చివరి అరగంటలో పంత్ గాయంతో మైదానాన్ని వీడాడు. కుడి కాలికి బంతి తగలడంతో తీవ్రంగా ఇబ్బంది పడిన పంత్.. కష్టమ్మీద బయటకు వచ్చాడు.

By:  Tupaki Desk   |   18 Oct 2024 2:45 AM GMT
టీమ్ ఇండియాకు గాయం.. ఎంత పెద్దదైతే అంత ఇబ్బంది
X

బెంగళూరు వేదిక గా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా 46 పరుగులకే ఆలౌటై తీవ్ర పరాభావాన్ని మూటగట్టుకుంది. నాలుగేళ్ల కిందట పింక్ బాల్ (డే-నైట్) టెస్టులో 36 పరుగులకే ఆలౌటైంది. మళ్లీ ఇప్పుడు 46కే జట్టు అంతా కుప్పకూలింది. అయితే, దీనికి మించిన గాయం జట్టుకు మరోటి కనిపిస్తోంది.

కారు ప్రమాదం జరిగినా కాలికేనా?

బెంగళూరు టెస్టులో టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ గాయపడ్డాడు. రెండో రోజు గురువారం భారత ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ పంత్ (20) కావడం గమనార్హం. అంటే జట్టు చేసిన 46 పరుగుల్లో దాదాపు సగం అతడివే. అయితే, మ్యాచ్ చివరి అరగంటలో పంత్ గాయంతో మైదానాన్ని వీడాడు. కుడి కాలికి బంతి తగలడంతో తీవ్రంగా ఇబ్బంది పడిన పంత్.. కష్టమ్మీద బయటకు వచ్చాడు. జట్టు ఫిజియో తోడుగా పంత్ నడుచుకుంటూ వస్తున్న తీరు చూస్తే అతడి గాయం పెద్దదిగానే కనిపిస్తోంది. 22 నెలల కిందట పంత్ ఘోర రోడ్డు ప్రమాదంలో కుడికాలి తీవ్ర గాయమైంది.

ఇప్పుడదే కాలికి గాయమైందా? అనిపిస్తోంది.

పరిస్థితులు ఎలాంటివైనా..

పంత్ ఎలాంటి పరిస్ధితుల్లోనైనా ఎదురుదాడి చేయగల బ్యాట్స్ మన్. బౌలర్ ఎవరన్నదీ చూడకుండా దాడి చేస్తాడు. గత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో పంత్ కీలక పాత్ర పోషించాడు. ఇక వికెట్ల వెనుక కూడా చురుగ్గా ఉంటాడు. అలాంటి పంత్ న్యూజిలాండ్ తో టెస్టులో గాయపడడం పెద్ద దెబ్బనే.

బ్యాటింగ్ కు దిగుతాడా?

న్యూజిలాండ్ తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా ఉన్న పంత్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగుతాడా? అనేది చూడాలి. పంత్ గాయం తీవ్రతను బట్టి జట్టు నిర్ణయం తీసుకునే వీలుంది. వాస్తవానికి కివీస్ ఇప్పటికే వంద పరుగుల పైగా ఆధిక్యం సాధించినందున ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్ భారత్ కు చాలా కీలకం. మరీ ముఖ్యంగా పంత్ బ్యాటింగ్ దిగడం ఇంకా కీలకం.

మరి ఏం జరుగుతుందో?

వచ్చే మ్యాచ్ ల సంగతేంటి?

న్యూజిలాండ్ ఇంకో రెండు టెస్టులతో పాటు, ఆస్ట్రేలియా సిరీస్ లో ఐదు టెస్టులు ఆడాల్సిన టీమ్ ఇండియాకు పంత్ గాయంతో దూరమైతే తీరని నష్టమే. ధ్రువ్ జురెల్ పూర్తిగా కొత్త కుర్రాడు. కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ అతడు బ్యాటింగ్ లోనే విఫలం అవుతున్నాడు. జట్టులో చోటే కష్టం అన్నట్లుంది అతడి పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో పంత్ కోలుకుని.. ఆస్ట్రేలియా టూర్ కు అందుబాటులోకి రావడమే జట్టుకు మేలు.