Begin typing your search above and press return to search.

పడి లేచిన టీమ్ ఇండియా కెరటం.. రికార్డులు బద్దలే బద్దలు

ఎస్ యూవీలో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ గంటకు వందకు పైగా కిలోమీటర్ల వేగంతో జాతీయ రహదారిపై ప్రయాణం.. అంతలోనే అనుకోని ప్రమాదం

By:  Tupaki Desk   |   21 Sep 2024 11:34 AM GMT
పడి లేచిన టీమ్ ఇండియా కెరటం.. రికార్డులు బద్దలే బద్దలు
X

ఎస్ యూవీలో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ గంటకు వందకు పైగా కిలోమీటర్ల వేగంతో జాతీయ రహదారిపై ప్రయాణం.. అంతలోనే అనుకోని ప్రమాదం.. సెకన్లలో తప్పిన ముప్పు.. తీవ్ర గాయాలు.. కాలిపోయిన వీపు.. దెబ్బతిన్న మోకాలు .. ఏడాదిపైగా క్రికెట్ కు దూరం.. ఇలాంటి పరిస్థితుల్లో మరే క్రికెటర్ అయినా కథ ముగిసిందని అనుకుంటారు. కానీ, అతడు మాత్రం గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. రికార్డులు అందుకుంటున్నడు.

మిస్టర్ ఎక్స్ ఫ్యాక్టర్

టీమిండియా వికెట్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ బంగ్లాదేశ్ తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ధనాధన్ సెంచరీ బాదాడు. 109 పరుగుల వద్ద ఔటైన అతడు టెస్టుల్లో తన ఆరో సెంచరీ నమోదు చేశాడు. అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. అయితే, ధోనీ 90 టెస్టులకు గాను ఈ రికార్డును అందుకోలేకపోయాడు. పంత్ మాత్రం 33 టెస్టులకే ఆరో టెస్టు సెంచరీని చేసేశాడు. ధోనీ 144 ఇన్నింగ్స్‌ల్లో ఆరు శతకాలు చేయగా.. పంత్ 58 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేయడం గమనార్హం. వృద్ధిమాన్ సాహా 54 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు చేశాడు.

20 నెలల తర్వాత టెస్టు ఆడుతూ..

2022 డిసెంబరు 30న ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగి రావడమే అద్భుతం. ఈ ఏడాది ఐపీఎల్ తో పోటీ క్రికెట్ లోకి అడుగుపెట్టిన పంత్.. ఆపై టి20 ప్రపంచ కప్ లో మోస్తరు ప్రదర్శనే చేశాడు. శ్రీలంకతో సిరీస్ లోనూ ఫర్వాలేదనిపించాడు. అయితే, 20 నెలల తర్వాత అతడు బంగ్లాదేశ్ తో టెస్టు ఆడుతూనే అదరగొట్టాడు. దూకుడైన ఆటతో సెంచరీ అందుకున్న పంత్ తనను టెస్టుల్లో మంచి బ్యాటర్ గా ఎందుకు పరిగణిస్తారో చాటిచెప్పాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్స్ లోనూ 39 పరుగులు చేసిన పంత్.. అనూహ్యంగా ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తనకంటే ముందు వచ్చిన ఓపెనర్ శుభ్ మన్ గిల్ ను దాటి మరీ సెంచరీ కొట్టేశాడు.

దిగ్గజ కీపర్ ప్రశంసలు..

టెస్టుల్లోనూ వన్డేలు, టి20 తరహాలో ఆడడం పంత్ స్టయిల్. అందుకేనేమో.. ఆస్ట్రేలియా దిగ్గజం, పంత్ లాగే ఎడమ చేతివాటం వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఆడమ్ గిల్ క్రిస్ట్ ముచ్చటపడ్డాడు. పంత్ తనకంటే దూకుడుగా ఆడతాడని కొనియాడాడు. పంత్.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలలో సెంచరీలు చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. కాగా, వచ్చే 4 నెలల్లో భారత్ వరుసగా 10 టెస్టులు (ప్రస్తుత టెస్టుతో కలిపి) ఆడాల్సి ఉంది. ఇందులో ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలోనే 5 టెస్టులు ఆడాల్సి ఉంది. పంత్ ఇదే విధంగా రాణిస్తే భారత జట్టుకు అంతా శుభమే.