అతడే విధ్వంసక ప్లేయర్.. కానీ, నాకే చాన్సులు.. టీమ్ ఇండియా స్టార్
రిషభ్ పంత్.. టెస్టులు, వన్డేలు, టి20లు మూడు ఫార్మాట్లలోనూ రెండున్నరేళ్ల కిందటి వరకు రెగ్యులర్ ప్లేయర్. 2022 డిసెంబరు చివరలో కారు ప్రమాదంలో గాయపడడం అతడి కెరీర్ కు స్పీడ్ బ్రేకర్ గా మారింది.
By: Tupaki Desk | 1 March 2025 11:30 AM GMTటీమ్ ఇండియాలో ఏడెనిమిదేళ్లుగా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ గా పేరు తెచ్చకున్న ఒకే ఒక క్రికెటర్ అతడు.. కొన్నిసార్లు నిర్లక్ష్యంగా షాట్ కొట్టి ఔటైనా.. అతడే మ్యాచ్ విన్నర్ అని ఇప్పటికీ చాలామంది ఒప్పుకొంటారు. ఘోరమైన రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడి.. తీవ్ర గాయాల నుంచి కోలుకుని వికెట్ కీపింగ్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. ఈ ఉదాహరణలన్నీ బట్టి మనం చెప్పుకొంటున్న క్రికెటర్ ఎవరో తెలిసిపోయి ఉంటుంది.
రిషభ్ పంత్.. టెస్టులు, వన్డేలు, టి20లు మూడు ఫార్మాట్లలోనూ రెండున్నరేళ్ల కిందటి వరకు రెగ్యులర్ ప్లేయర్. 2022 డిసెంబరు చివరలో కారు ప్రమాదంలో గాయపడడం అతడి కెరీర్ కు స్పీడ్ బ్రేకర్ గా మారింది. కోలుకుని జట్టులోకి వచ్చిన పంత్ ను టెస్టులు, టి20లకు తీసుకుంటున్నా.. వన్డేలకు మాత్రం ఫస్ట్ చాయిస్ గా పరిగణించడం లేదు.
వన్డే టీమ్ కూర్పు భిన్నంగా ఉండడంతో పంత్ కు చాన్స్ దక్కడం లేదని చెప్పొచ్చు. మొన్నటి ఇంగ్లండ్ తో సిరీస్ లో పంత్ ను కాదని కేఎల్ రాహుల్ కు కీపింగ్ బాధ్యతలు అప్పగించారు. చివర్లో అనూహ్యంగా కోహ్లి గాయపడడంతో వచ్చిన శ్రేయస్ అయ్యర్ రాణించడంతో ఇక పంత్ ను తీసుకోవాలనే ఆలోచన ఆగిపోయింది.
వాస్తవానికి వికెట్ కీపింగ్ లేకుంటే రాహుల్ కు కూడా తుది జట్టులో చోటు కష్టమే. ఒకవేళ రాహుల్ గనుక విఫలమై.. పంత్ కు చాన్స్ వస్తే ఇక రాహుల్ కు చోటు లభించదనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రాహుల్ స్పందన ఏమిటనేది ఆసక్తికరం. న్యూజిలాండ్ తో ఆదివారం మ్యాచ్ కు ముందు రాహుల్ మీడియాతో మాట్లాడాడు. పంత్ విధ్వంసక ఆటగాడని.. తనకంటే అతడే ఈ విషయంలో మెరుగని ఒప్పుకొన్నాడు.
ప్రతి మ్యాచ్ కు ముందు కెప్టెన్, కోచ్‌లు తనను తీసుకోవాలా? పంత్ ను ఎంచుకోవాలా? అన్న సందిగ్ధంలో ఉంటారని రాహుల్ తెలిపాడు. పంత్ ప్రతిభావంతుడని.. మ్యాచ్ లో తానేం చేయగలడో ఇప్పటికే చాలాసార్లు నిరూపించాడి రాహుల్ చెప్పాడు. ఆట స్వరూపాన్నే మార్చగల సత్తా పంత్ కు ఉందన్నాడు.
ఒకవిధంగా చెప్పాలంటే.. పంత్ కెరీర్ ప్రస్తుతం స్తబ్ధుగా ఉంది. టెస్టుల్లోనే అతడు రెగ్యులర్ అయ్యాడు. టి20ల్లో సంజూ శాంసన్, వన్డేలకు రాహుల్ ను ఎంపిక చేస్తున్నారు. టెస్టుల్లో కూడా ధ్రువ్ జురెల్ నుంచి పంత్ కు గట్టిపోటీ ఉంది. అయితే, దూకుడుగా ఆడడం, ఎడమచేతి వాటం కావడం పంత్ కు కలిసొస్తోంది. అది కూడా పరుగుల సాధించే వరకే. విఫలమైతే కష్టాలు తప్పవు.