Begin typing your search above and press return to search.

బుమ్రా వచ్చేశాడు.. పంతూ వస్తున్నాడు.. 140 కి.మీ. తుఫాను వేగంతో

ప్రస్తుతం అతడి ప్రాక్టీస్‌ కు సంబంధించిన అప్‌ డేట్‌ బయట కు వచ్చింది. బెంగళూరులో ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ లో సాధనకు దిగాడు.

By:  Tupaki Desk   |   5 Aug 2023 9:38 AM GMT
బుమ్రా వచ్చేశాడు.. పంతూ వస్తున్నాడు.. 140 కి.మీ. తుఫాను వేగంతో
X

అది 2022 డిసెంబరు 30.. కొత్త సంత్సరం రోజు అమ్మను ఆశ్చర్యపరుద్దామని బయల్దేరాడు.. కానీ కుర్రాడికి వేగం ఎక్కువ కదా..? అది కూడా ఎస్ యూవీ కారు లో ప్రయాణం.. పైగా హైవే మీద .. ఇంకేం..? ఎక్కడో చిన్న పొరపాటు. అంతే ఘోర ప్రమాదం. అది జరిగిన తీరు చూస్తే అసలు ప్రాణాలతో బయటపడడం కష్టమే అనిపించింది. కానీ, ఎక్కడో లక్ ఉన్నట్లుంది. ప్రాణాలతో గట్టెక్కాడు. ఇదంతా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గురించి. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు లోయరార్డర్ లో బ్యాటింగ్ భారాన్నీ మోస్తున్నాడు పంత్. అలాంటి వాడు ఊహించని ప్రమాదానికి గురవడం దిగ్భ్రాంతి కలిగించింది. అయితే, ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వస్తున్నాడా త్వరలో..?

భారత క్రికెట్ అభిమానుల కు గుడ్‌ న్యూస్ ఏమంటే పంత్‌ చాలా వరకు కోలుకున్నాడు. ఇప్పటికే అతడు ఎలాంటి సాయం లేకుండా మెట్లు ఎక్కుతూ దిగుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఇటీవల కొలను లో నడుస్తూ కొంత వ్యాయామం కూడా చేశాడు. పంత్ రికవరీ

అవుతున్న విషయాన్ని గత నెలలో బీసీసీఐ కూడా వెల్లడించింది. ప్రస్తుతం అతడి ప్రాక్టీస్‌ కు సంబంధించిన అప్‌ డేట్‌ బయట కు వచ్చింది. బెంగళూరులో ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ లో సాధనకు దిగాడు.

140 కి.మీ. వేగంతో వస్తున్న బంతిని ఎదుర్కొంటూ

పంత్ అంటేనే దూకుడు. ఒంటి చేతితో సిక్స్ లు కొడుతూ ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్నవాడు. అలాంటివాడు ఇంకెంతో కాలం క్రికెట్ కు దూరంగా ఉండలేడనేది సత్యం. ఇప్పుడు మరో విశేషం ఏమంటే అతడు చాలావరకు కోలుకున్నాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో విసిరే బంతులను పంత్‌ ఎదుర్కొగలుతున్నాడు. ఈ స్థాయి వేగంతో వచ్చే బంతులను ఆడుతున్నాడంటే పంత్ మైదానంలో దిగే రోజు మరెంతో దూరంలేదనేది స్పష్టం.

ఆ గాయాలు పెద్దవే..

వాస్తవానికి పంత్ కు అయిన గాయాలు మామూలువి కాదు. గత డిసెంబరులో దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ కు వెళ్తుండగా రూర్కీ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో పంత్ అద్దం పగలగొట్టుకుని బయటకు దూకేశాడు. తల, మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. వీపు భాగం కాలిపోయింది. కాలు విరిగింది. దీంతో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆ గాయాల నుంచి కోలుకుని సాధన మొదలుపెట్టాడని తెలుస్తోంది. దీంతో అభిమానులు.. "లెజెండ్‌.. నువ్వు తిరిగి వస్తారని ఆశిస్తున్నా" "ప్రపంచ కప్‌ కు తిరిగి వచ్చే అవకాశం ఉందా?" "పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం తీసుకోండి. దయ చేసి తొందరపడకండి" "టెస్ట్‌ క్రికెట్‌ కు పంత్ ఎంతో ఊపు తెస్తాడు" 'ప్రపంచ కప్‌ వచ్చేస్తోంది.. నువ్వూ వచ్చేయ్' అంటూ సందేశాలు పెడుతున్నారు.

వచ్చే ఏడాదే మైదానంలోకి..

రిషభ్ పంత్ టీమిండియాలోకి రాకముందే ఎక్స్ ఫ్యాక్టర్ గా పేరుగాంచాడు. అంటే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసేవాడని అర్థం. దీనికితగ్గట్లే కొన్ని గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇప్పుడిప్పుడే పరిపూర్ణ బ్యాట్స్ మన్ గా ఎదుగుతున్నాడు. ఇలాంటి సమయంలో ప్రమాదానికి గురికావడం గమనార్హం. కాగా, పంత్ కోలుకుని మైదానం లోకి దిగేందుకు మరో ఆరు నెలలైనా పట్టొచ్చు. అతడిని మనం ఐపీఎల్ లో చూసే అవకాశం ఉంది. వన్డే ప్రపంచ కప్ మాత్రం మిస్సయినట్లే. మరోవైపు ఇప్పటికే టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా కోలుకుని తిరిగొచ్చాడు. ఐర్లాండ్ లో టి20 సిరీస్ కు ఏకంగా కెప్టెన్ అయ్యాడు. ఇక మిగిలింది పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్.