Begin typing your search above and press return to search.

మైదానంలో కాలిడిన టీమిండియా "ఎక్స్" మ్యాన్

అయితే, పంత్ తాజాగా ఓ లోకల్ మ్యాచ్‌ లో బ్యాట్ పట్టిన వీడియో ట్విటర్ లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన క్రికెట్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   16 Aug 2023 12:58 PM GMT
మైదానంలో కాలిడిన టీమిండియా ఎక్స్ మ్యాన్
X

టీమిండియాకు ఒకదాని వెంట ఒకటి గుడ్ న్యూస్ లు. మొన్నటికి మొన్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా కోలుకుని జట్టుకు తిరిగి అందుబాటులోకి రాగా.. నేడు మరో అత్యంత కీలక ఆటగాడు బ్యాట్ పట్టాడు. బెంగళూరులో లోకల్ మ్యాచ్ ఆడుతూ కనిపించాడు.

అతడ అండర్ 19లోనే అద్భుతాలు చేశాడు. 'ఒంటి చేత్తో' సిక్స్ లు కొట్టడమే కాదు.. ఒంటిచేత్తో మ్యాచ్ లు గెలిపించగల ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అదే ఊపులో టీమిండియాలోకీ వచ్చేశాడు. తొలి రెండుమూడేళ్లు తడబడినా గట్టిగా నిలదొక్కుకున్నాడు. జట్టుకు ఇప్పటివరకు టెస్టు మ్యాచ్ లను గెలిపించే మొనగాడైన వికెట్ కీపర్ లేని లోటును తీరుస్తున్నాడు అనుకుంటుండగా ఊహించని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇదంతా టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ గురించి.

అమ్మను కొత్త సంవత్సరం నాడు ఆశ్చర్యపరుద్దామని వెళుతూ 2022 డిసెంబరు చివరలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు పంత్. అతడు ప్రయాణిస్తున్న ఎస్ యూవీ అతి వేగం కారణంగా ప్రమాదానికి గురై.. క్షణాల్లో పూర్తిగా దహనమైపోయింది. వాస్తవాని ప్రమాదం జరిగిన తీరు చూస్తే పంత్ ప్రాణాలతో బతికి ఉండడమే గొప్పనుకున్నారు. కానీ, భూమ్మీద నూకలు ఉండడంతో అతడు.. కాలిపోతున్న కారు నుంచి బయటకు రాగలిగాడు. వీపు భాగం కాలడం, కొన్ని గాయాలతో బయటపడ్డాడు.

ఏడాది పాటు దూరం..పంత్ గాయపడింది గత ఏడాది చివర్లో. అతడు తిరిగి మైదానంలో అడుగుపెట్టేది ఎపుడున్నది నిన్నటివరకు స్పష్టత లేదు. అయితే, కొన్ని నెలల కిందట పంత్ సొంతంగా మెట్లు ఎక్కుతున్న వీడియోలు, స్విమ్మింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. కానీ, మైదానంలోకి ఎప్పుడు దిగుతాడనేది మాత్రం తేలలేదు. అయితే, పంత్ తాజాగా ఓ లోకల్ మ్యాచ్‌ లో బ్యాట్ పట్టిన వీడియో ట్విటర్ లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన క్రికెట్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అతడు త్వరగా కోలుకుని ఫిట్‌ నెస్ కూడా సాధించి టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఓ లెక్క ప్రకారం పంత్ వచ్చే ఫిబ్రవరిలో మైదానంలోకి దిగే వీలుంది. అనంతరం ఐపీఎల్ కూడా ఆడడం ఖాయం.

కాలిగాయంతోనే..రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్‌ కు కాలికి సర్జరీ జరిగింది. వాస్తవానికి అతడు వికెట్ కీపర్ కావడంతో ఏం జరుగుతుందోనని అంతా భయపడ్డారు. కాలికి శస్త్రచికిత్స కారణంగానే పంత్ 3 నెలలు మంచానికే పరిమితం అయ్యాడు. ఆపై వేగంగా కోలుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావస శిబిరంలో ఉన్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్‌ లు ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌ లో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోను పంత్ ఇటీవలే సోషల్ మీడియాలో పెట్టాడు.

ప్రపంచ కప్ నకు దూరం..స్వదేశంలో సరిగ్గా 50 రోజుల్లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ నకు పంత్ అందుబాటులో ఉండడు. గత ప్రపంచ కప్ నాటికి అతడికి 21 ఏళ్లే. అప్పట్లో ఎమర్జింగ్ ప్లేయర్ గా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్ లోనూ రాణించాడు. అయితే, ఈ ప్రపంచ కప్ నకు మాత్రం పంత్ కష్టమే. అతడు తిరిగి జాతీయ జట్టులోకి వచ్చేది వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌ తో టెస్టు సిరీస్‌ కే. కానీ త్వరగా మ్యాచ్ ఫిట్‌ నెస్‌ను సాధిస్తే ఇంకాస్త ముందుగానే వచ్చినా ఆశ్చర్యం లేదు.