Begin typing your search above and press return to search.

ఆటలోనే కాదు.. కెప్టెన్ గానూ రోహిత్ దూకుడు.. ఇక లక్ష్యం అదే

బంగ్లాదేశ్ తో తొలి టెస్టును సునాయాసంగా గెలిచిన టీమ్ ఇండియాకు రెండో టెస్టు జరుగుతున్న కాన్పూర్ లో వాతావరణమే పెద్ద ప్రత్యర్థిగా మారింది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 3:39 PM GMT
ఆటలోనే కాదు.. కెప్టెన్ గానూ రోహిత్ దూకుడు.. ఇక లక్ష్యం అదే
X

టెస్టు మ్యాచ్ లో వర్షం కారణంగా దాదాపు రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. అప్పటికి ప్రత్యర్థి జట్టులో మూడే వికెట్లు పడ్డాయి. నాలుగో రోజు మ్యాచ్ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో వేరే జట్టు కెప్టెన్ అయితే ఏం చేస్తాడు? మ్యాచ్ ఎలాగూ డ్రా కావడం ఖాయమని భావిస్తాడు. సహచరులను కూడా డ్రా కోసమే ప్రయత్నాద్దాం అని చెబుతాడు. కానీ, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అలా కాదు. మిగతా రెండు రోజుల్లోనే మ్యాచ్ ను ఖతం చేయాలనుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన మొదటి బంతినే సిక్స్ కొట్టాడు. ఇక చూస్కో.. దూకుడే దూకుడు. ఫలితంగా టీమ్‌ ఇండియా మళ్లీ అదరగొట్టింది.

డ్రా కాదు గెలుపే లక్ష్యం

బంగ్లాదేశ్ తో తొలి టెస్టును సునాయాసంగా గెలిచిన టీమ్ ఇండియాకు రెండో టెస్టు జరుగుతున్న కాన్పూర్ లో వాతావరణమే పెద్ద ప్రత్యర్థిగా మారింది. తొలి రోజు కొన్ని ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. బంగ్లా 107 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. రెండో, మూడో రోజు ఆట వర్షం, వాతావరణ పరిస్థితుల కారణంగా జరగలేదు. కానీ, చివరకు భారత్ గెలిచింది. రెండు టెస్టుల సిరీస్‌ ను 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. వాస్తవానికి రెండో టెస్టు డ్రా అవుతుందని భావించారు. కానీ, మన జట్టు సూపర్ ఆట తో విజయం సాధించింది.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో

బంగ్లా టెస్టు సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్ ను మరింత సుస్థిరం చేసుకుంది. దీంతో వరుసగా మూడోసారి ఫైనల్‌ కు చేరేందుకు అవకాశం దక్కింది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్ లో భారత్ 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించింది. 2 ఓటములు ఎదుర్కొంది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ప్రస్తుతం మన జట్టు పాయింట్ల శాతం 74.27. వచ్చే ఏడాది జూన్ లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ కు జరగనుంది.

స్వదేశంలో న్యూజిలాండ్ తో ఈ నెలలో మూడు టెస్టులు, ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం మూడు గెలిచినా నేరుగా ఫైనల్‌ చేరుతుంది. న్యూజిలాండ్ తో ఈ నెల 16న మొదలయ్యే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే ఆస్ట్రేలియా సిరీస్‌ తో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌ కు వెళ్తుంది.

రోహిత్ సాధిస్తాడా?

సరిగ్గా ఏడాది క్రితం భారత్ కు వన్డే ప్రపంచ కప్ త్రుటిలో చేజారింది. ఆ కప్ లో అద్భుత ఆటతీరుతో జట్టు ఫైనల్ చేరింది. కానీ, ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. అయితే, ఆ బాధను మరిపిస్తూ వెస్టిండీస్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది రోహిత్ శర్మ టీమ్. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ కు సమీపంగా ఉంది. డబ్ల్యూటీసీనీ గెలిస్తే రోహిత్ శర్మ చరిత్రలో నిలిచిపోతాడు అనడంలో సందేహం లేదు. కాగా, ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో భారత్‌ తర్వాత ఆస్ట్రేలియా ఉంది. ఒకవేళ ఆ జట్టే ఫైనల్ కు చేరితే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పరాజయానికి గట్టిగా బదులు తీర్చుకునే అవకాశం దక్కుతుంది. మరి రోహిత్ దీనిని సాధిస్తాడా? లేదా? అనేది చూడాలి.