Begin typing your search above and press return to search.

మొన్న వన్డే.. నేడు టెస్టు సిరీస్ లాస్.. గంభీర్ ఇదేం కోచింగ్

12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ ఓడడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

By:  Tupaki Desk   |   26 Oct 2024 4:30 PM GMT
మొన్న వన్డే.. నేడు టెస్టు సిరీస్ లాస్.. గంభీర్ ఇదేం కోచింగ్
X

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా బీసీసీఐ ఏరికోరి తెచ్చుకున్న గౌతమ్ గంభీర్ పై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.. దాదాపు రెండు నెలల కిందట శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోతే ఏదో పొరపాటున పోయిందిలే అనుకున్నాం.. బంగ్లాదేశ్ వంటి జట్టుపై స్వదేశంలో చెలరేగి ఆడి టెస్టు సిరీస్ గెలిస్తే అహో అనుకున్నాం.. కానీ, న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు వచ్చేసరికి అసలు కథ బయటపడింది.. 46 పరుగులకే ఆలౌట్ కావడం.. 36 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఓడిపోవడం.. ఇప్పుడు చరిత్రలో తొలిసారి టెస్టు సిరీస్ నే ఓడడంతో ఇదేందిది? అనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ ఓడడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక‌, పాకిస్థాన్ జట్లు భారత్ లో టెస్టు సిరీస్ లు గెలిచాయి. కానీ, న్యూజిలాండ్ కు ఎన్నడూ అంత సీన్ లేదు. ఎంతటి మేటి బ్యాట్స్ మెన్, బౌలర్లు ఉన్నా.. న్యూజిలాండ్ జట్టు మన దేశానికి వస్తే ప‌సి కూన‌గానే కనిపించేది. అలాంటి జట్టు ఇప్పుడు ఏకంగా టెస్టు సిరీసే గెలిచింది.

ఇదేం ఆట..?

బెంగళూరులో తొలి టెస్టు గత బుధవారం ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం ప్రభావంతో ఒక రోజు రద్దయింది. కానీ, తర్వాతి మూడున్నర రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. భారత్ ఓడింది. ఇక రెండో టెస్టు పుణెలో రెండున్నర రోజుల్లోనే ముగిసింది. భారత్ మళ్లీ ఓడింది. టాస్ ఓడి బౌలింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ను 255 పరుగులకే కట్టడి చేసింది. కానీ, ఈ స్కోరునూ అందుకోలేకపోయింది. 45 ఓవ‌ర్ల‌కే ఆలౌటై 156 ప‌రుగులే చేయగలిగింది. దీంతో టెస్టు అసలు ఇండియాలోనే జ‌రుగుతున్నదా? లేక న్యూజిలాండ్ లోనా అనే సందేహం కలిగింది. క‌నీసం ఒక సెష‌న్ పాటు కూడా బ్యాటింగ్ చేయ‌లేదు. జ‌ట్టు మొత్తం క‌లిసి ఒక సెష‌న్ ఆడలేదు.

గంభీర్ కు డేంజర్ బెల్

42 ఏళ్లకే టీమ్ ఇండియా హెడ్ కోచ్ వంటి పెద్ద పదవి పొందిన గంభీర్ కు ఇది రెండో డేంజర్ బెల్. శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను పట్టుబట్టి ఆడించినా వ‌న్డే సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు భారత్ లో టెస్టు సిరీస్ నే కోల్పోయింది. అంతేకాదు.. మూడు ద‌శాబ్దాల్లో ఆస్ట్రేలియా (2004), ఇంగ్లండ్ (2012) ఇంగ్లండ్ మాత్రమే భారత్ లో టెస్టు సిరీస్ నెగ్గాయి. అలాంటి ఇప్పడు న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో ఓటమి దిగ్భ్రాంతికరమే.

మేల్కొనకుంటే..

జట్టు ఆటతీరుపై గంభీర్ ఏం ఆలోచిస్తున్నాడో తెలియాల్సి ఉంది. రోహిత్, కోహ్లి వంటి బ్యాట్స్ మెన్ ఫామ్ లోనే లేరు. వీరి వయసు కూడా 35 దాటింది. యశస్వి లాంటి మరికొందరు కుర్రాళ్లను వెదకాల్సి ఉంది. బౌలింగ్ లోనూ అశ్విన్, జడేలాకు గట్టి ప్రత్యామ్నాయాలను చూడాలి. మొత్తానికి గంభీర్ ముందు పెద్ద టాస్క్ ఉంది. దానిని అతడు ఎలా ఛేదిస్తాడో?