స్టార్ బ్యాట్స్ మన్..టెస్టులు: మరో ఏడాది..వన్డేలు: కనీసం రెండేళ్లు
కెప్టెన్ అవుతాడు అనుకున్న ప్రధాన పేసర్ బుమ్రా గాయంతో దాదాపు మూడు నెలలుగా మైదానంలోకే దిగని పరిస్థితి.
By: Tupaki Desk | 27 March 2025 11:30 AMచరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ లో 0-3తో క్లీన్ స్వీప్, ఆపై ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో ఓటమి.. సంప్రదాయ ఫార్మాట్ లో ఆటగాడిగానూ జట్టులో చోటు కష్టం అనే పరిస్థితుల్లో కెప్టెన్.. మరో స్టార్ బ్యాట్స్ మన్ లో నిలకడ లేమి.. ఇవన్న చూస్తే టెస్టుల్లో టీమ్ ఇండియా ప్రస్తుతం సంధి దశలో ఉంది. కెప్టెన్ అవుతాడు అనుకున్న ప్రధాన పేసర్ బుమ్రా గాయంతో దాదాపు మూడు నెలలుగా మైదానంలోకే దిగని పరిస్థితి. ఇలాంటి సమయంలో జట్టును నడిపించేది ఎవరు?
రోహిత్ ఉంటాడా?
టీమ్ ఇండియా టెస్టు పరాజయాల అనంతరం రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించాలని గట్టిగా డిమాండ్లు వచ్చాయి. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో అతడిపై వేటు కూడా పడింది. అయితే, అనూహ్యంగా చాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ సారథ్యంలోనే జట్టును పంపించారు. అతడు కప్ కొట్టుకొచ్చాడు కూడా. కాగా, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కావడంతో టీమ్ ఇండియా విషయాలు పెద్దగా చర్చకు రావు. ఆ తర్వాతే అసలు కథ మొదలవనుంది. టీమ్ ఇండియా వచ్చే జూన్ లో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అంతేకాదు.. దీంతో నాలుగో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ప్రారంభం కూడా. తొలి రెండు సీజన్లలో ఫైనల్ చేరి, మూడో సీజన్ లోనూ ఫైనల్ కు అవకాశాలు ఉన్నప్పటికీ చేజార్చుకున్న టీమ్ ఇండియాను నాలుగో ప్రపంచ టెస్టు చాంపియన్ సీజన్ లో నడిపించేది ఎవరు?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఓటమి, టెస్టుల్లో తన ఫామ్ కూడా సరిగా లేకపోవడంతో రోహిత్ రిటైర్ అవుతాడని కథనాలు వచ్చాయి. కానీ, అతడు అదేమీ లేదంటున్నాడు.
సెలక్టర్లు చెప్పేశారా?
రోహిత్ విషయం ఇప్పుడు సెలక్టర్ల చేతిలో ఉంది. కెప్టెన్సీతోపాటు టెస్టు భవిష్యత్తుపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టీమ్ కీలక నిర్ణయం తీసుకుందట. అదమంటే.. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కూ రోహిత్ ను కెప్టెన్ గా కొనసాగించాలనుకుంటోందట. 37 ఏళ్ల రోహిత్ 2025-27 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఆసాంతం కొనసాగిస్తారా? లేదా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. నాలుగో సీజన్ ఫైనల్ 2027లో జరగనుంది. చిత్రం ఏమంటే వన్డే ప్రపంచ కప్ కూడా అదే ఏడాది జరగనుంది. టి20 ప్రపంచ కప్, వన్డే చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన రోహిత్ 50 ఓవర్ల వరల్డ్ కప్ నూ తన ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చాంపియన్స్ ట్రోఫీ తో రిటైర్మెంట్ ప్రకటించలేదని చెబుతున్నారు.
అయితే, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం టెస్టు చాంపియన్ షిప్ నకు కొత్త సారథితోనే వెళ్లాలని భావిస్తున్నాడట. ఇప్పటికే గంభీర్ ప్రణాళికల్లో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కెప్టెన్ గా ఉండడం గమనార్హం.