రోహిత్ కు గాయం..న్యూజిలాండ్ తో మ్యాచ్ లో భారత కెప్టెన్ అతడే?
తద్వారా గ్రూప్ బిలో రెండో స్థానంలోని జట్టుతో సెమీస్ ఆడుతుంది.
By: Tupaki Desk | 28 Feb 2025 10:30 AM GMTచాంపియన్స్ ట్రోఫీలో సులువుగా విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తోంది టీమ్ ఇండియా. వచ్చే ఆదివారం న్యూజిలాండ్ తో చివరి లీగ్ మ్యాచ్ లో తలపడనుంది. ఇప్పటికే మన జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. అటు న్యూజిలాండ్ కూడా సెమీస్ కు అర్హత సాధించింది. అయితే, ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ విన్నర్ టేబుల్ టాపర్ గా నిలుస్తుంది. తద్వారా గ్రూప్ బిలో రెండో స్థానంలోని జట్టుతో సెమీస్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో చివరి లీగ్ మ్యాచ్ రెండు జట్లకూ చాలా కీలకం.
కెప్టెన్ ఆడతాడా..?
న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఆదివారం కెప్టెన్ రోహిత్ శర్మ బరిలో దిగే అవకాశాలు లేనట్లేనని తెలుస్తోంది. తొడ కండరాలు పట్టేయడంతో రోహిత్ ప్రాక్టీస్ కు దూరంగా ఉన్నాడు. సెమీస్ కు ముందుజాగ్రత్తగా అతడికి న్యూజిలాండ్ తో మ్యాచ్ లో విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ లేదా స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను ఆడించే చాన్సుంది.
పాకిస్థాన్ తో మ్యాచ్ లోనే రోహిత్ కు కండరాలు పట్టేశాయి. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతిని ఆపేందుకు బౌండరీ వరకు పరుగెత్తిన రోహిత్ అసౌకర్యానికి గురయ్యాడు. దీంతో తాత్కాలిక కెప్టెన్ గా వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ బాధ్యతలు నిర్వర్తించాడు. రోహిత్ తిరిగొచ్చి కెప్టెన్సీ చేసినా.. తర్వాత రెండు రోజులు ప్రాక్టీస్ చేయలేదు. స్ట్రెంథ్, కండిషనింగ్ కోచ్, ఫిజియోథెరపిస్ట్ లతో గడిపాడు.
గిల్ కే కెప్టెన్సీ..
రోహిత్ గనుక ఆడకుంటే గిల్ పూర్తిస్థాయిలో కెప్టెన్సీ చేసే చాన్సుంది. చాంపియన్స్ ట్రోఫీకే గిల్ ను తొలిసారిగా వైస్ కెప్టెన్ గా నియమించారు. దీంతోనే అతడు న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కెప్టెన్ గా చేసే చాన్సుంది. గిల్ ఇప్పటికే గత ఏడాది టి20 జట్టు జింబాబ్వే టూర్ లో కెప్టెన్సీ చేశాడు. తొలిసారిగా వన్డే సారథ్యమూ చేపట్టనున్నారు.
పెద్ద టోర్నీల సందర్భంగా ఈ తరం స్టార్ ప్లేయర్లు జట్టుకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం లేదు. రోహిత్ సహజంగా 100 శాతం న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడేందుకే అతడు ప్రయత్నిస్తాడని చెప్పొచ్చు. అందుకే అతడి గాయంపై టీమ్ నుంచి అప్ డేట్ రాలేదు.