రోహిత్ శర్మను వణికించిన పుల్వామా 6.4 అడుగుల బుల్లెట్
కారణం.. రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్ లో కాకలు తీరిన ముంబై బ్యాట్స్ మన్ ను అతడు వణికించిన తీరే.
By: Tupaki Desk | 24 Jan 2025 12:49 PM GMTఉమర్ నజీర్ మిర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు. కారణం.. రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్ లో కాకలు తీరిన ముంబై బ్యాట్స్ మన్ ను అతడు వణికించిన తీరే. టెస్టుల్లో ఫామ్ లో లేక.. వన్డేలకూ వీడ్కోలు పలకాల్సిన స్థితిలో రంజీ ట్రోఫీ బరిలో దిగిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఎలాగైన టీమ్ ఇండియాలోకి రావాలని చూస్తున్న అజింక్య రహానేలను నజీర్ మిర్ ఔట్ చేయడమే.
ఫాస్ట్ బౌలర్ కు ఎత్తు చాలా పెద్ద బలం. ఆరు అడుగులు పైన ఉండి.. మంచి లైన్ అండ్ లెంగ్త్ తో బంతులేసే పేసర్లకు వికెట్లు వద్దన్నా పడుతుంటాయి. ఇప్పుడు నజీర్ మిర్ కూడా అలాంటివాడే. జమ్ము కశ్మీర్‌కు చెందిన ఇతడు 6 అడుగుల 4 అంగుళాల పొడగరి. భారత్ లో ప్రస్తుతం బహుశా ఇతడే పొడవైన పేసర్, క్రికెటర్ అనడంలో సందేహం లేదేమో?
ముంబైతో మ్యాచ్ లో ఉమర్ నజీర్ మీర్ 11 ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. వీటిలో రోహిత్, రహానే వికెట్లు ఉన్నాయి. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన మిర్ వయసు 31. చక్కటి పేస్ తో పాటు బౌన్స్ రాబట్టడం ఇతడి ప్రత్యేకత.
12 ఏళ్ల కిందటే..
వెదికి చూస్తే భారత్ లో మెరికల్లాంటి పేసర్లు ఉంటారు. దీనికి ఉదాహరణ మిర్. 19 ఏళ్ల యువకుడిగా.. ఇతడు 2013లో ఫస్ట్ క్లాస్ కెరీర్ ఆరంభించాడు. 57 మ్యాచ్ లలో 138 వికెట్లు తీశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 54, టీ20ల్లో 32 వికెట్లు సాధించాడు.
ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ పేస్, బౌన్స్ తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే మిర్.. షార్ట్ పిచ్ డెలివరీతో రోహిత్ శర్మ (3)ను ఔట్ చేశాడు. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో మంచి ఫామ్ లో ఉన్న ముంబై కెప్టెన్ రహానే(12)ను అయితే క్లీన్ బౌల్డ్ చేశాడు. దూకుడుగా ఆడే శివమ్ దూబె(0)ను తొలి బంతికే ఔట్ చేశాడు. కీలక బ్యాటర్ హార్దిక్ తమోర్ (7)నూ పెవిలియన్ కు పంపాడు.
31 ఏళ్ల మిర్.. ఇప్పటికే టీమ్ ఇండియాలోకి రావాల్సిన వాడు. కానీ, ఎందుకనో మిస్ అయ్యాడు. వాస్తవానికి బౌలర్ లో వేగం ఒక్కటే క్రికెట్ లో సరిపోదు. వేగమే ముఖ్యం అయితే కశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్ వికెట్ల మీద వికెట్లు తీసేవాడు. కానీ, అతడు టీమ్ ఇండియాలో నిలదొక్కుకోలేకపోయాడు. మరి.. మిర్ కు ఇప్పటికైనా పిలుపు దక్కుతుందా? నిలుపుకొంటాడా? లేదా అనేది చూడాలి.