రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ మ్యాచ్ తర్వాత టెస్టులకు గుడ్ బై?
టీమ్ ఇండియా హిట్ మ్యాన్, టి20 ప్రపంచ కప్ అందించిన అతి కొద్దిమంది కెప్టెన్లలో ఒకడైన రోహిత్ శర్మ క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 31 Dec 2024 7:37 AM GMTభారత క్రికెట్ లో ఓ శకం ముగియనుందా..? ప్రపంచ క్రికెట్ నుంచి ఓ స్టార్ బ్యాట్స్ మన్ కెరీర్ చాలిస్తున్నాడా..? తాజా పరిణామాలను చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. టీమ్ ఇండియా హిట్ మ్యాన్, టి20 ప్రపంచ కప్ అందించిన అతి కొద్దిమంది కెప్టెన్లలో ఒకడైన రోహిత్ శర్మ క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ముందుగా టెస్టులకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.
నిర్ణయం తీసేసుకున్నాడా..?
టెస్టు మ్యాచ్ లకు రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా ఫామ్ కోల్పోయిన అతడు ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ సిరీస్ లో తీవ్రంగా విఫలం అవుతున్నాడు. 3, 6,10, 3, 9.. ఇవీ అతడి గత ఐదు ఇన్నింగ్స్ స్కోర్లు. ఇటీవలి 10 ఇన్నింగ్స్ లో ఒక్కసారి మాత్రమే 25 పరుగులు దాటాడు. దీన్నిబట్టే అతడి ఫామ్ ఏమిటో తెలిసిపోతోంది.
రోహిత్ ఉంటేనే ఓటమి?
స్వదేశంలో న్యూజిలాండ్ తో సిరీస్ లో 0-3తో ఓటమితోనే రోహిత్ టెస్టు కెరీర్ ముగిసిందనే సంకేతాలు వచ్చాయి. ఇక ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో గెలిచిన టీమ్ ఇండియాలో రోహిత్ సభ్యుడు కాడు. వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత అతడు సారథ్యం వహించిన మూడు టెస్టుల్లో రెండింటిలో భారత్ ఓడిపోయింది. గులాబీ టెస్టులో అయితే రోహిత్ బంతులను ఎదుర్కొనడానికి గుటకలు మింగాడు. ఇక రోహిత్ తాజాగా ముగిసిన మెల్ బోర్న్ టెస్టులో ఓపెనర్ గా వచ్చి మరీ విఫలమయ్యాడు. పైగా అతడి కోసం కేఎల్ రాహుల్ ను వన్ డౌన్ లోకి పంపాల్సి వచ్చింది. యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్ ను పక్కన పెట్టారు. ఇలా జట్టు కూర్పంతా దెబ్బతింటోంది.
కెప్టెన్ గానూ నిరాశాజనకం బ్యాటింగ్ వైఫల్యాల ప్రభావం రోహిత్ కెప్టెన్సీ పైనా పడుతోంది. మెల్ బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కు 52వ ఓవర్ లో బంతి చేతికిచ్చాడు. మైదానంలో అతడి వ్యూహాలు విమర్శలకు దారితీస్తున్నాయి. దీంతోనే రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు బలంగా వస్తున్నాయి.
ఆ మ్యాచ్ ఆఖరు?
బోర్డర్- గావస్కర్ సిరీస్ లో జనవరి 3 నుంచి సిడ్నీలో చివరి, ఐదో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ, సెలెక్టర్లు కూడా అతడితో మాట్లాడారట. అయితే, టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ వరకు రిటైర్ కావొద్దని వారు కోరారట. ఒకవేళ రోహిత్ దీనికి ఒప్పుకొన్నా.. టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే చాన్స్ చాలా తక్కువగా ఉంది. ఫైనల్ కు అర్హత సాధించకుంటే మాత్రం రోహిత్ కు సిడ్నీ టెస్టే చివరిది కానుంది.
-ఈ ఏడాది జూన్ లో టి20 ప్రపంచ కప్ విజయం అనంతరం పొట్టి ఫార్మాట్ కు రోహిత్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
-వన్డేల్లోనూ రోహిత్ మరెంతో కాలం కొనసాగే చాన్స్ లేదు. జూలైలో అతడి కెప్టెన్సీలోనే శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఇక వచ్చే జనవరిలో ఇంగ్లండ్ తో భారత్ వన్డే సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్ తో రోహిత్ వన్డేలకూ వీడ్కోలు పలుకుతాడమో?