నో రిటైర్.. రో.. కో.. మరికొన్నాళ్లు.. కనీసం ఏడాదిన్నర?
ఇక కోహ్లి విషయానికి వస్తే రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో జట్టను మెరుగైన స్థితిలో వదలాలని పేర్కొన్నాడు.
By: Tupaki Desk | 10 March 2025 1:28 PM ISTకొన్నాళ్లుగా టీమ్ ఇండియా గురించి ఒకటే చర్చ.. ఆ ఇద్దరు సీనియర్ స్టార్ బ్యాట్స్ మన్ ఎప్పుడు రిటైర్ అవుతారని.. కొందరేమే తాజా చాంపియన్స్ ట్రోఫీకి కొత్త కెప్టెన్ వస్తాడని కూడా అంచనా వేశారు. మరికొందరు ఇదే టోర్నీ తర్వాత సీనియర్లు రిటైర్మెంట్ ఇచ్చేస్తారని ఊహించారు.. కానీ, వీరందరినీ షాక్ కు గురిచేశారు ఆ ఇద్దరు స్టార్స్.
టీమ్ ఇండియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గగానే ఒకటే ఆలోచన.. కెప్టెన్ రోహిత్ శర్ నోటి నుంచి ఎప్పుడు రిటైర్మెంట్ వార్త వస్తుందా? అని కానీ, వారందరినీ నిరాశపరుస్తూ తాను వన్డేల నుంచి రిటైర్ కావడం లేదని, వదంతులు వ్యాప్తి చేయొద్దని కోరాడు రోహిత్. అంతేగాక భవిష్యత్ ప్రణాళికలేమీ లేవని కూడా చెప్పాడు.
ఇక కోహ్లి విషయానికి వస్తే రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో జట్టను మెరుగైన స్థితిలో వదలాలని పేర్కొన్నాడు. వచ్చే 8 ఏళ్లలో సత్తా చాటగలిగే జట్టు తమకు ఉందని అన్నాడు.
రో కో (రోహిత్ కోహ్లి) ఇద్దరి స్టేట్ మెంట్లను బట్టి చూస్తే వీరిద్దరూ మరో ఏడాదిపైగా వన్డేలు ఆడేలా కనిపిస్తున్నారు. వాస్తవానికి కోహ్లి కంటే రోహిత్ రిటైర్మెంట్ పైనే ప్రస్తుతం ఎక్కువ చర్చ. ఫిట్ నెస్, ఫామ్ దీనికి కారణం. కానీ, ఫైనల్లో రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ తో తనపై విమర్శలకు చెక్ పెట్టాడు.
మళ్లీ ఎప్పుడు?
టి20లకు గత ఏడాది ప్రపంచ కప్ విజయం తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన రో కో.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకూ వీడ్కోలు పలుకుతారని భావించారు. కానీ, ఇద్దరూ ఆ ఉద్దేశంలో లేనట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్ ఇవ్వలేదు సరే.. మరో వన్డే ఎప్పుడు? అనేదే అసలు ప్రశ్న. ఈ కాలంలో వన్డేలు ఏడాది నాలుగైదు కూడా లేవు. టి20లకు వీరిద్దరూ ఎలాగూ లేరు. వచ్చే జూన్ లో కానీ టెస్టు సిరీస్ (ఇంగ్లండ్ లో) లేదు. కోహ్లిని తీసుకున్నా.. రోహిత్ ను వచ్చే టెస్టు సిరీస్ కు పరిగణిస్తారా? లేదా? అనేది సందేహమే. అలాంటప్పుడు రోహిత్ ఇంకా వన్డేలకు వీడ్కోలు పలకకపోవడంలో ఆంతర్యం ఏమిటో?