Begin typing your search above and press return to search.

స్వదేశంలో ప్రపంచ కప్.. మ్యాచ్ లు చూడొద్దనుకున్న కెప్టెన్

జట్టులోకి ఎంపిక కాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యా. మ్యాచ్ లు చూడొద్దని గట్టి నిర్ణయించుకున్నా.

By:  Tupaki Desk   |   8 Aug 2023 7:57 AM GMT
స్వదేశంలో ప్రపంచ కప్.. మ్యాచ్ లు చూడొద్దనుకున్న కెప్టెన్
X

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఒక్కో జట్టు ప్రాబబుల్స్ ను ప్రకటిస్తున్నాయి. ఆస్ట్రేలియా నిన్ననే 18 మంది ఆటగాళ్లను ప్రకటించింది. కాగా, భారత్ నాలుగోసారి ప్రపంచ కప్ నిర్వహించనుంది. ఈసారి పూర్తిగా అన్ని మ్యాచ్ లకు సొంతంగా ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, చివరిసారిగా స్వదేశంలో 2011లో జరిగిన కప్ లో మన జట్టు విశ్వ విజేతగా నిలిచింది. దీనికిముందు 1983లో లార్డ్స్ లో తొలిసారి కప్ గెలిచింది. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ నాడు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా జగజ్జేతగా ఆవిర్భవించింది.

కెప్టెన్ చూడొద్దనుకున్నాడట...

స్వదేశంలో మరోసారి కప్ జరగనుండడంతో టీమిండియా కచ్చితంగా విజేతగా నిలుస్తుందనే అంచనాలున్నాయి. అందులోనూ మేటి బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సొంతగడ్డపై కచ్చితంగా చెలరేగుతారు. వీరికితోడు యువ శుబ్ మన్ గిల్ తదితర బ్యాట్స్ మెన్ ఆశలు రేపుతున్నారు. త్వరలో టీమిండియా 18 మంది సభ్యుల ప్రాబుబుల్స్ ను ప్రకటించే వీలుంది. రోహిత్ శర్మనే జట్టుకు కెప్టెన్ అవుతాడు. ప్రస్తుతం కెప్టెన్ హోదాలో జట్టును నడిపించనున్న రోహిత్.. భారత్ చివరిసారి విజేతగా నిలిచిన 2011 ప్రపంచ కప్ సందర్భంగా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాడట. అతడే ఈ విషయాన్ని చెప్పాడు.

స్థానం ఆశించి.. నిరాశ చెంది..

రోహిత్ 2007 ప్రపంచ కప్ సందర్భంగా టీమిండియాకు ఎంపికయ్యాడు. కింది స్థానాల్లో బ్యాటింగ్ కు దిగినా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2008 ప్రారంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు సిరీస్ లోనూ రోహిత్ రాణించాడు. కానీ, అనూహ్యంగా జట్టుకు దూరమయ్యాడు. 2011 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కలేదు. మహామహులతో నిండిన ఆ జట్టులో విరాట్ కోహ్లికి మాత్రం స్థానం దొరికింది. వాస్తవానికి రోహిత్ కంటే దాదాపు ఏడాది తర్వాత విరాట్ జట్టులోకి వచ్చాడు. కానీ, 2008 అండర్ 19 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ గా అందరి చూపునూ తనవైపు తిప్పుకొన్న అతడు మరికొద్ది నెలలకే టీమిండియాకు ఎంపికయ్యాడు. 2011 ప్రపంచ కప్ జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. రోహిత్ కు నాటి మెగా టోర్నీలో చాన్స్ దొరకలేదు. ఈ పరిణామంతో అసంతృప్తి చెందిన రోహిత్ మ్యాచ్‌ లను చూడకూడదని భావించాడట.

జట్టు గెలుపుతో పులకించి..

2011 ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగా రాణించింది. డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అద్భుత ప్రదర్శనలతో అదరగొట్టింది. ఓపెనర్లు సెహ్వాగ్, గంభీర్ మెరుపులు, పేసర్ జహీర్ ఖాన్ చక్కటి బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. మ్యాచ్ మ్యాచ్ కు ప్రదర్శన మెరుగుపడుతుండడంతో రోహిత్ కూడా తన నిర్ణయం మార్చుకున్నాడంట. మ్యాచ్ లను వదలకుండా చూశాడట. అమెరికాలో ఐసీసీ ప్రపంచ కప్‌ ప్రచార కార్యక్రమంలో రోహిత్ శర్మ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"2011 కప్ నాతో సహా అందరికీ గుర్తుండిపోతుంది. ఇంట్లో నుంచే మ్యాచ్‌లను వీక్షించా. కానీ, నాలో రెండు రకాల భావోద్వేగాలు చెలరేగాయి. జట్టులోకి ఎంపిక కాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యా. మ్యాచ్ లు చూడొద్దని గట్టి నిర్ణయించుకున్నా. క్వార్టర్స్ లో పాకిస్థాన్‌ తో తలపడిన మ్యాచ్‌ ను ఆస్వాదించా. అత్యంత ఒత్తిడి ఉండే మ్యాచ్‌లో భారత్‌ గెలుపును ఎప్పటికీ మరిచిపోలేను. సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా పై గెలుపులో యువీ, రైనా కీలకంగా నిలిచారు" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

తదుపరి రెండు కప్ లలో కీలకమై..

2011 ప్రపంచ కప్ ఆడని రోహిత్.. 2013 చాంపియన్స్ ట్రోఫీతో ఓపెనర్ గా వచ్చాడు. అక్కడినుంచి అతడికి తిరుగులేకుండా పోయింది. 2015, 2019 ప్రపంచ కప్‌ లలో ఆడాడు. 2019 కప్ లో అయితే ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. సెమీఫైనల్లో అనూహ్య ఓటమితో కన్నీరు కార్చాడు. ఇప్పుడు స్వదేశంలో తనే కెప్టెన్ గా జట్టును నడిపించబోతున్నాడు. మరి ఈసారి కప్ అందిస్తాడని ఆశిద్దాం.