Begin typing your search above and press return to search.

ఐపీఎల్ చిచ్చు.. 'కెప్టెన్' ను వద్దన్న 'కెప్టెన్'.. టీమిండియా మరో ముసలం?

కానీ, అతడిని జట్టులోకి తీసుకోవడమే రోహిత్, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ కు ఇష్టం లేదని ఇంగ్లిష్ మీడియా కథనం ప్రచురించింది.

By:  Tupaki Desk   |   15 May 2024 1:30 AM GMT
ఐపీఎల్ చిచ్చు.. కెప్టెన్ ను వద్దన్న కెప్టెన్.. టీమిండియా మరో ముసలం?
X

రెండేళ్ల కిందటి వరకు టీమిండియా గురించి ఒకటే చర్చ.. స్టార్ బ్యాటర్లు ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయంటూ రచ్చ.. దీనికితగ్గట్లే ఒకరు సిరీస్ లకు దూరం కావడంతో ఊహాగానాలకు మరింత ఊతం వచ్చింది. అంతా సమసిపోయింది అనుకుంటుండగా ఈ ఐపీఎల్ సీజన్ మరో చిచ్చుపెట్టింది. ఇది ఎక్కడవరకు వెళ్తుందో చూడాలి. లేదా టీమిండియాకు టి20 ప్రపంచ కప్ ను దూరం చేస్తుందేమో అనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.

గ్రేట్ కెప్టెన్ వర్సెస్ న్యూ కెప్టెన్ ఐపీఎల్‌ లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ నుంచి జాతీయ జట్టులోకి వచ్చిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. రెండు సీజన్ల కిందట వరకు ముంబైతోనే ఉన్న అతడు 2022లో గుజరాత్ టైటాన్స్ వంటి కొత్త జట్టుకు మారిపోయాడు. ఆ జట్టును తొలి ఏడాదే విజేతగా నిలిపాడు. మలి ఏడాది త్రుటిలో కప్ చేజారింది. అయితే, అనూహ్యంగా హార్దిక్ ను ఈ ఏడాది తమ కెప్టెన్ గా తీసుకొచ్చింది ముంబై. ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ కు పగ్గాలు అప్పజెప్పింది. అంటే.. రోహిత్ కెప్టెన్సీలో ఆడి జాతీయ జట్టుకు ఎంపికైన హార్దిక్.. గుజరాత్ కు మారీ మళ్లీ ముంబైకి వస్తూ రోహిత్ కెప్టెన్సీకే ఎసరు పెట్టాడు. ఇక ముంబై తరఫున కెప్టెన్ గా తొలి మ్యాచ్ నుంచే హార్దిక్ తీరు వివాదాస్పదం అయింది. రోహిత్ విషయంలో అతడి ప్రవర్తనతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో హార్దిక్ ను బాగా ట్రోల్ చేశారు. ఇక ఈ సీజన్ లో ముంబై దారుణ ప్రదర్శన చేసింది.

ఇప్పడు రోహిత్ కెప్టెన్సీలో హార్దిక్ వచ్చే నెల 1 నుంచి జరిగే టి20 ప్రపంచ కప్ లో టీమిండియా రోహిత్ కెప్టెన్సీలోనే ఆడాల్సి ఉంది. ఇటీవల జట్టు ఎంపిక సందర్భంగా ఓ సంఘటన జరిగిందని.. అందులో రోహిత్ జట్టులోకి హార్దిక్ ఎంపికను అడ్డుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో వరుస అపజయాలతో టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయిన తొలి జట్టుగా నిలిచింది ముంబై. రోహిత్, హార్దిక్ మధ్య మధ్య మైదానంలోనే సఖ్యత కనిపించలేదు. ఇదే టి20 ప్రపంచకప్‌ ఎంపిక సమయంలోనూ స్పష్టమైనట్లు చెబుతున్నారు.

ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యుల జట్టుతో పాటు హార్దిక్‌ ను రోహిత్‌ కు డిప్యూటీగా నియమించారు. కానీ, అతడిని జట్టులోకి తీసుకోవడమే రోహిత్, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ కు ఇష్టం లేదని ఇంగ్లిష్ మీడియా కథనం ప్రచురించింది. దీనికి ఐపీఎల్ లో ప్రస్తుతం పాండ్యా ఫామ్ ను కూడా సాక్ష్యంగా చూపినట్లు సమాచారం. 13 మ్యాచ్‌ లలో 200 పరుగులు మాత్రమే చేసిన హార్దిక్‌.. 11 వికెట్లు పడగొట్టాడు.

ఒత్తిడితోనే ఎంపిక చేశారా? వన్డే ప్రపంచ కప్ సందర్భంగా గాయపడి మధ్యలోనే వైదొలగిన పాండ్యా ఈ ఐపీఎల్ సీజన్ తోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. అత్యంత పేలవ ఫామ్ తో పరుగులు సాధించలేకపోతున్నాడు. కానీ, టి20 ప్రపంచ కప్ నకు మాత్రం ఆల్ రౌండర్ కోటాలో ఎంపికవడమే కాక వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు. దీని వెనుక ఒత్తిళ్లు ఉండడమే కారణమని చెబుతున్నారు. ప్రత్యామ్నాయం లేకనే హార్దిక్ ను తీసుకున్నట్లు అగార్కర్ చెప్పడం గమనార్హం.