పాక్ తో మ్యాచ్.. టీమిండియాకు భారీ ‘గాయం’.. ఆ స్టార్ ప్లేయర్ దూరం?
టి20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో టీమిండియా ఆదివారం తలపడనుంది.
By: Tupaki Desk | 8 Jun 2024 8:30 AM GMTటి20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో టీమిండియా ఆదివారం తలపడనుంది. అమెరికాలోని న్యూయార్క్ లో జరిగే ఈ మ్యాచ్ కు అంతా సిద్ధం అయింది. గురువారం జరిగిన మ్యాచ్ లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్ పరాజయంతో కుంగిపోయిన పాకిస్థాన్ కు టీమిండియాతో మ్యాచ్ అంటే సవాలే.
మొత్తం 7.. గెలిచింది 1
2007 నాటి తొలి టి20 ప్రపంచ కప్ లో లీగ్ దశ, ఫైనల్ సహా మొత్తం ప్రపంచ కప్ లలో పాకిస్థాన్ తో ఏడు మ్యాచ్ లలో టీమిండియా తలపడింది. ఇందులో 2021 లో మాత్రమే భారత జట్టు పాక్ చేతిలో ఓడిపోయింది. మిగతా అన్నిసార్లూ ఘన విజయం సాధించింది. 2022లో మెల్ బోర్న్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ తో గెలిపించిన సంగతి అభిమానులకు ఎప్పటికీ చెరిగిపోని గుర్తు.
రేపే మ్యాచ్.. టెన్షన్ టెన్షన్
టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో కెప్టెన్ రోహిత్ శర్మది బలమైన ముద్ర. అందులోనూ యశస్వి జైశ్వాల్ తో కాకుండా కోహ్లితో కలిసి ఓపెనింగ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తో మ్యాచ్ లో రోహిత్ ఆడడం కీలకం. కానీ, ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ గాయపడ్డాడు. శుక్రవారం సాయంత్రం నెట్స్ లో అతడి బొటన వేలికి గాయమైనట్లు తెలిసింది. దీంతో ప్రాక్టీస్ పిచ్ పై బంతి అసాధారణంగా బౌన్స్ అవుతోందని ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అది గాయమా..? ఉద్దేశపూర్వకమా?
బుధవారం ఐర్లాండ్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ అర్దసెంచరీ చేసి మధ్యలో తప్పుకొన్న సంగతి తెలిసిందే. రిటైర్డ్ ఔట్ గా దీనిని పేర్కొన్నప్పటికీ.. రోహిత్ గాయంతో వైదొలగాడా? అన్న సందేహం వస్తోంది. ఏది ఏమైనా.. ఆదివారం నాటి మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో ఉంటే టీమిండియా సగం గెలిచేసినట్లే.