Begin typing your search above and press return to search.

ప్రపంచ కప్ ముంగిట కెప్టెన్ ఫ్లాప్.. ఇలాగైతే కష్టమే

హార్దిక్ పాండ్యాను భవిష్యత్ కెప్టెన్ గా తీర్చిదిద్దుతున్నట్లు హడావుడి చేసిన బీసీసీఐ చివరకు అతడి గాయాలకు భయపడి రోహిత్ శర్మకు మళ్లీ బాధ్యతలు అప్పగించింది.

By:  Tupaki Desk   |   7 May 2024 8:24 AM GMT
ప్రపంచ కప్ ముంగిట కెప్టెన్ ఫ్లాప్.. ఇలాగైతే కష్టమే
X

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ చేజారింది.. సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్ టైటిల్ అందినట్లే అంది అందకుండా పోయింది.. ప్రతిష్ఠాత్మక టి20 ప్రపంచ కప్ మరొక్క నెల రోజుల్లోపే మొదలు కానుంది. మరి టీమిండియా పరిస్థితి ఏమిటి..? ఏడాది కిందట వెటరన్లు అని పక్కనపెట్టిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను మళ్లీ తీసుకొచ్చారు.. అసలు ఫామ్ లోనే లేని హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ చేశారు. ఫినిషర్ గా పేరు తెచ్చకుంటున్న రింకూ సింగ్ ను పక్కనపెట్టి ఐపీఎల్ ఫామ్ ఆధారంగా శివమ్ దూబెను ఎంపిక చేశారు. తీవ్ర గాయం నుంచి కోలుకున్న రిషభ్ పంత్ నూ తీసుకున్నారు. సరే.. అందరూ ప్రతిభావంతులే కాబట్టి ఫలితాన్ని మైదానంలో మ్యాచ్ కు వదిలేద్దాం అనుకుంటే.. ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

కెప్టెన్ ఏం చేస్తాడో?

హార్దిక్ పాండ్యాను భవిష్యత్ కెప్టెన్ గా తీర్చిదిద్దుతున్నట్లు హడావుడి చేసిన బీసీసీఐ చివరకు అతడి గాయాలకు భయపడి రోహిత్ శర్మకు మళ్లీ బాధ్యతలు అప్పగించింది. ఏప్రిల్ 30తో 37 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్.. కుర్రాళ్ల గేమ్ అయిన టి20 కెప్టెన్సీ అప్పగించడం సరైనదా? అనే ప్రశ్నలు వచ్చాయి. అయితే, ప్రపంచంలోని ప్రస్తుతం టి20 విధ్వంసక బ్యాటర్లలో ఎవరితో పోల్చినా రోహిత్ ఏమాత్రం తక్కువ కాదు. కాబట్టి.. అతడికి కెప్టెన్సీ సరైనదే. అంతెందుకు.. ? వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ లు చూసి కూడా అతడికి ఓటేయొచ్చు. ఇక ఇప్పటి టి20 ప్రపంచ కప్ నకు వస్తే..?

స్లో పిచ్ లు..

జూన్ 1 నుంచి టి20 ప్రపంచకప్ కరీబియన్ దీవులు, అమెరికా వేదికగా మొదలుకానుంది. దీనికోసం 15 మంది సభ్యుల భారత జట్టును కొద్ది రోజుల కిందట ప్రకటించారు. అయితే, కరీబియన్, అమెరికా పిచ్ లు స్లో పిచ్ లు. ఇలాంటిచోట అనుభవం ఉన్న బ్యాటర్లు అయితేనే రాణించగలరు. ఈ కోణంలోనే రోహిత్, కోహ్లిలను ఎంపిక చేశారని భావించవచ్చు.

5 మ్యాచ్ ల్లో 33 పరుగులే..

4, 11, 4, 8, 6.. ఇవీ గత ఐదు మ్యాచ్ ల్లో రోహిత్ స్కోరు.. ఒక్కసారే డబుల్ డిజిట్ దాటాడు అన్నమాట. అయితే, దీనికిముందు మ్యాచ్ ల్లో అతడు 36, 105, 38, 49, 0 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ కూడా ఉన్నా.. మొత్తంగా చూస్తే ఫర్వాలేదనే ప్రదర్శనే. గత పది మ్యాచ్ లలో రోహిత్ చేసిన పరుగులు 261 మాత్రమే. దీంతోనే ప్రపంచ కప్ లో ఎలా ఆడతాడో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

కొసమెరుపు: 2022లో జరిగిన టి20 ప్రపంచ కప్ లోనూ రోహిత్ పెద్దగా రాణించలేదు. దీంతోనే అప్పట్లో బీసీసీఐ రోహిత్ తో పాటు కోహ్లిలను నెమ్మదిగా తప్పించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్లీ వారినే నమ్ముకుంది. తీరా కప్ ముంగిట రోహిత్ ఫామ్ పడిపోయింది.