Begin typing your search above and press return to search.

ఆరోపణలు చేసే ముందు బుర్ర వాడండి.. బాల్ ట్యాంపరింగ్ పై రోహిత్

కరీబియన్ దీవులు అమెరికాతో కలిసి తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న టి20 ప్రపంచ కప్ మరొక్క రెండు మ్యాచ్ లే మిగిలి ఉంది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 11:07 AM GMT
ఆరోపణలు చేసే ముందు బుర్ర వాడండి.. బాల్ ట్యాంపరింగ్ పై రోహిత్
X

కరీబియన్ దీవులు అమెరికాతో కలిసి తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న టి20 ప్రపంచ కప్ మరొక్క రెండు మ్యాచ్ లే మిగిలి ఉంది. గురువారం రాత్రి జరిగే రెండో సెమీఫైనల్ పూర్తవనుంది. శనివారం ఫైనల్ జరుగుతుంది. అయితే, అమెరికాలో నెమ్మదైన పిచ్ లు, ఒకటి రెండు ఆరోపణలు తప్ప టోర్నీ అంతా సజావుగా సాగింది. మరోవైపు టోర్నీలో మాజీ చాంపియన్లు పాకిస్థాన్, శ్రీలంక, మరో పెద్ద జట్టు న్యూజిలాండ్ లీగ్ దశకే పరిమితం అయ్యాయి. ఆస్ట్రేలియా సూపర్-8 దశ దాటలేకపోయింది. తమ చివరి లీగ్ మ్యాచ్ లో గనుక భారత్ పై నెగ్గి ఉంటే ఆసీస్ కు సెమీస్ చేరే చాన్సుండేది.

ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు

పాకిస్థాన్ మేటి బ్యాటర్లలో ఒకడైన మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ ఆస్ట్రేలియాతో సూపర్-8 మ్యాచ్ లో భారత్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిందంటూ ఆరోపించాడు. భారత పేసర్ అర్షదీప్ సింగ్ 16వ ఓవర్లో బంతిని రివర్స్ స్వింగ్ చేశాడు. 12 లేదా 13వ ఓవర్ లోనే బంతి రివర్స్ స్వింగ్ కు అనుకూలంగా మారిందా? అనే అనుమానం వ్యక్తం చేశాడు. చాలా ముందుగానే బాల్‌ రివ‌ర్స్ స్వింగ్ అయిందని.. ట్యాంపరింగే దీనికి కారణం అనే అర్థంలో మాట్లాడాడు. అంతేకాక అంపైర్లు కళ్లు మూసుకున్నారంటూ నిందించాడు.

నోరుందని మాట్లాడొద్దు..

ఇంజమాన్ ఆరోపణలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. ‘‘వాతావరణం వేడిగా ఉండి.. పిచ్ పొడిగా ఉంటే.. బంతి తానంతటదే రివర్స్ స్వింగ్ అవుతుంది. ప్రపంచ కప్ లో అన్ని జట్లకూ ఇది అనుభవమే. ఆరోపణలు చేసే ముందు కాస్త బుర్ర ఉపయోగించండి. మేం ఎక్కడ ఆడుతున్నాం అనేది చూడాలి. ఇదేమీ ఆస్ట్రేలియా/ఇంగ్లండ్ కాదు’’ అంటూ దీటైన సమాధానం ఇచ్చాడు. తద్వారా.. పరిస్థితుల కారణంగానే బాల్ రివర్స్ స్వింగ్ అవుతోంది తప్ప ట్యాంపరింగ్ గీంపరింగ్ అంటూ ఏమీ లేదని కొట్టిపారేశాడు.