రోహిత్ స్థానంలో కెప్టెన్ ఎవరు? టి20లకే కాదు.. వన్డేలు, టెస్టులకూ వెదకాల్సిందే!
అందరు ఆటగాళ్లకు సాధ్యం కానిది ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉండడం.. అందరు ఆటగాళ్లకు సాధ్యం కానిది ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు కెప్టెన్ గా ఉండడం
By: Tupaki Desk | 3 July 2024 8:30 AM GMTఅందరు ఆటగాళ్లకు సాధ్యం కానిది ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉండడం.. అందరు ఆటగాళ్లకు సాధ్యం కానిది ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు కెప్టెన్ గా ఉండడం. ఈ రెండూ సాధించాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. 2007లో ఆటగాడిగా టి20 ప్రపంచ కప్ తోనే అంరగేట్రం చేసిన అతడు అప్పట్లో చాంపియన్ జట్టు సభ్యుడు. ఇప్పుడు కెప్టెన్ గా టైటిల్ అందుకుని సగర్వంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ టి20ల్లో రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు కొట్టిన రోహిత్ స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ కప్ ద్వారా అతడు కెప్టెన్ గానూ పరిపూర్ణ క్రికెటర్ గా రిటైర్ అయ్యాడు. దీంతో కొత్త కెప్టెన్ ఎవరో వెదుక్కోవాల్సిందే.
ముందు టి20లకు
రోహిత్ లేని నేపథ్యంలో ముందుగా టి20లకు కెప్టెన్ ఎవరో తేలాలి. ఈ ప్రకారం చూస్తే తాజా ప్రపంచ కప్ లో వైస్ కెప్టెన్ గా ఉన్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకే ఎక్కువ చాన్సుంది. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ లో హార్దిక్ కు వంక పెట్టాల్సిన పనిలేదు. ఫిట్ నెస్ కూడా అద్భుతం. అయితే, గాయాల బెడదే ఆందోళన కలిగిస్తోంది. అదేమీ లేకుంటే హార్దిక్ పాండ్యానే భవిష్యత్ టి20 కెప్టెన్.
వీరూ రేసులోనే..
ఓపెనర్ శుబమన్ గిల్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్, పేస్ మిషన్ జస్ప్రీత్ బుమ్రా. వీరిలో 25 ఏళ్ల గిల్ గత ఏడాదిగా కాస్త డల్ అయ్యాడు. వన్డే ప్రపంచ కప్ లో మోస్తరుగానే రాణించడాడు. ఐపీఎల్ లోనూ బ్యాటర్, కెప్టెన్ గా ఆకట్టుకోలేదు. దీంతో టి20 ప్రపంచ కప్ లో ఓపెనింగ్ కు దింపలేదు. అయితే, జింబాబ్వే టూర్ కు మాత్రం కెప్టెన్ గా నియమించారు. అంటే భవిష్యత్ ప్రణాళికల్లో ఇతడు ఉన్నాడన్నమాట. కాగా, సూర్యకుమార్ ప్రస్తుత వయసు 33. మరో రెండేళ్లు మాత్రమే ఆడగలడు. ఇతడు విధ్వంసక బ్యాటర్. కెప్టెన్సీ ప్రభావం బ్యాటింగ్ పై పడితే జట్టుకు ఇబ్బంది ఎదురవుతుంది. ఇక బుమ్రా ప్రధాన పేసర్. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు. దీంతోపాటు నిరుటి వరకు గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఏడాదిపైగా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు బుమ్రాకు కెప్టెన్సీ అంటే కాస్త ఆలోచించాల్సిందే.
మిగతా రెండు ఫార్మాట్లకూ
రోహిత్ మరో ఏడాది మాత్రమే టెస్టులు, వన్డేలు ఆడతాడేమో? లేదా రెండేళ్లు..? దీంతో ఈ రెండు ఫార్మాట్లకూ కెప్టెన్ ను చూడాల్సిన పరిస్థితి. కేఎల్ రాహుల్ ను వన్డే, టెస్టు కెప్టెన్ గా పరిగణించవచ్చు. అయితే, అతడికీ గాయాల బెడద ఉంది. నిలకడ కూడా తక్కువే. ఈ ఐపీఎల్ సీజన్ లో కోల్ కతాను చాంపియన్ గా నిలిపిన శ్రేయాస్ అయ్యర్ ప్రతిభావంతుడే అయినా.. బోర్డుతో అనవసరంగా పేచీ పెట్టుకున్నాడు. దీంతో వన్డేలకూ హార్దిక్ నే కెప్టెన్ చేస్తారేమో. అయితే, ఇతడు టెస్టులు ఆడడం లేదు. కాబట్టి టెస్టులకు రోహిత్ స్థానంలో కెప్టెన్ ను ఇప్పటినుంచే తయారుచేయాలి.