Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో సంచలనం.. కోల్ కతా లేదా ఢిల్లీకి దిగ్గజ కెప్టెన్ జంప్?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్ కు కాస్త భిన్నంగా ఉండబోతోంది.

By:  Tupaki Desk   |   17 Aug 2024 3:30 PM GMT
ఐపీఎల్ లో సంచలనం.. కోల్ కతా లేదా ఢిల్లీకి దిగ్గజ కెప్టెన్ జంప్?
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్ కు కాస్త భిన్నంగా ఉండబోతోంది. ఎందుకంటే వచ్చేది మెగా వేలం.. డిసెంబరులో జరిగే ఈ వేలంలో చాలామంది ఆటగాళ్ల జట్లు మారిపోనున్నాయి. ఎంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలనేదానిపై ఇప్పటికే ఫ్రాంచైజీలు ఒక్కోటి ఒక్కో డిమాండ్ తెస్తున్నాయి. అంతేగాక స్టార్ ప్లేయర్లు చాలామంది భవితవ్యం ఏమిటనేది కూడా తేలిపోనుంది. ఉదాహరణకు విరాట్ కోహ్లి పుట్టి పెరిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)లోనే.. అంతర్జాతీయ క్రికెటర్ గా కంటే ముందే ఆర్సీబీలో అడుగుపెట్టాడు. ఇప్పుడు దిగ్గజంగా ఎదిగాడు. ఇన్నేళ్లలో ఎప్పుడూ అతడు జట్టు మారలేదు. కొన్నేళ్ల కిందటనే కెప్టెన్సీని వదిలేశాడు. కేవలం బ్యాటర్ గానే కొనసాగుతున్నాడు. ఇక 43 ఏళ్లు దాటిన దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కే ఆడాడు. మధ్యలో రెండేళ్లు నిషేధంతో ఈ జట్టు పుణె సూపర్ జెయింట్స్ గా మారినప్పుడూ ధోనీ కొనసాగాడు. ఈ ఏడాది కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకొన్నాడు. వీరిద్దరి విషయంలోనే కాక మరో స్టార్ క్రికెటర్ సంగతి కూడా ఏమిటనేది చూడాల్సి ఉంది.

రికార్డు టైటిళ్లు అందించి..

ముంబై ఇండియన్స్ కు రికార్డు స్థాయిలో ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు రోహిత్ శర్మ. మొదటి రెండు సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడిన రోహిత్.. తర్వాత సొంత గడ్డ ముంబైకి మారాడు. అప్పటినుంచి మళ్లీ వేరే జట్టులోకి వెళ్లలేదు. ఈ క్రమంలో టీమ్ ఇండియాలో చోటును సుస్థిరం చేసుకున్నాడు. దిగ్గజంగా ఎదిగాడు. కెప్టెన్ కూడా అయ్యాడు. ఇటీవలే టి20 ప్రపంచ కప్ కూడా అందించాడు.

కొనసాగుతాడా? వెళ్లిపోతాడా?

రోహిత్ వచ్చే ఐపీఎల్ సీజన్ కు ముంబైకి ఆడతాడా? లేదా? అనేది సందిగ్ధంలో పడింది. వాస్తవానికి ఈ ఏడాది రోహిత్ ను తప్పించి గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి కెప్టెన్ చేశారు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ముంబై అత్యంత దారుణంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. వచ్చే సీజన్ కు హార్దిక్ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ చేయాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే.. రోహిత్ వచ్చే సీజన్ కు కోల్ కతా నైట్ రైడర్స్ కు వెళ్లిపోతాడని అంటున్నారు. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కు చెందిన కోల్ కతా ఈ ఏడాది చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. షారుక్.. రోహిత్ ను కెప్టెన్ గా తీసుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడట. అయితే, కేకేఆర్ యాజమాన్యమే కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రోహిత్ కోసం చూస్తోందట.

అటు కెప్టెన్.. ఇటు మేటి బ్యాటర్

ఏ జట్టకయినా రోహిత్ ను తీసుకుంటే రెండు లాభాలున్నాయి. మొదటిది ఓపెనింగ్ లో విధ్వంసక బ్యాటర్. రెండోది మేటి కెప్టెన్సీ. అందుకే మూడుసార్లు చాంపియన్ అయిన కోల్ కతాతో పాటు ఇంతవరకు కప్ కొట్టని ఢిల్లీ కూడా అతడి కోసం ప్రయత్నిస్తున్నాయి. రోహిత్ కావాలంటే ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా.. హిట్ మ్యాన్ ముంబైని వదలడమే కాదు.. వేరే జట్టుకు ఎంతకు వెళ్తాడనేది కూడా వచ్చే ఐపీఎల్ సీజన్ కు పెద్ద న్యూస్ కానుంది.

కొసమెరుపు: ముంబై ఫ్రాంచైజీ వర్గాల గురించి మరికొందరు చెబుతున్న మాట ఏమిటంటే.. ముంబై తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదిలేసి రోహిత్ ను అట్టిపెట్టుకుంటుందని. అయితే, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నదీ తెలియదు. హార్దిక్ ను ఒక్క సీజన్ కే పక్కనపెట్టడం తగదని కూడా ముంబై భావిస్తుండవచ్చు.