Begin typing your search above and press return to search.

వీడియో... రోహిత్ శర్మ మట్టి ఎందుకు తిన్నాడో తెలుసా?

ఇటీవల టీంఇండియా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 2013 నుంచి అందని ద్రాక్షలా మారిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ అందింది.

By:  Tupaki Desk   |   2 July 2024 7:01 AM GMT
వీడియో... రోహిత్  శర్మ మట్టి ఎందుకు తిన్నాడో తెలుసా?
X

ఇటీవల టీంఇండియా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 2013 నుంచి అందని ద్రాక్షలా మారిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ అందింది. టీంఇండియా తాజాగా ఈ ప్రపంచ కప్ ను ముద్దాడింది. ప్రధానంగా కెప్టెన్ గా ఒక్క ఐసీసీ ట్రోఫీనైనా సాధించాలని గట్టి పట్టుదలపై ఉన్న రోహిత్ శర్మకు ఆ కల నెరవేరింది. తాజాగా జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై టీంఇండియా 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

దీంతో ప్రతీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సమయంలో చాలా మంది ఆటగాళ్లు తీవ్ర బావోధ్వేగానికి లోనయ్యారు. ఈ అద్భుతమైన విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ కన్నీళ్లతో తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్న రోహిత్ శర్మ... కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలోని పిచ్‌ పై తన మమకారాన్ని చాటుకున్నాడు. ఇందులో భాగంగా.. ఆ పిచ్‌ పై మట్టిని తిన్నాడు. రెండు సార్లు చాలా తక్కువ మోతాదులో చేతితో మట్టి తీసి నోట్లో వేసుకున్నాడు.

తోటి ఆటగాళ్లు, ఇతర సిబ్బంది సంతోషంతో కేకలు వేస్తూ సంబరాలు చేస్తున్న వేళ రోహిత్ ఈ విధంగా తన ఆనందాన్ని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో... ఈ చారిత్రక విజయం ఎప్పటికీ గుర్తిండిపోవాలని, తన శరీరంలో ఇమిడిపోవాలని రోహిత్ ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు భావించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా దీనికి సంబంధించిన కారణాన్ని చెప్పాడు రోహిత్ శర్మ.

అవును... ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన అనంతరం కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలోని పిచ్‌ పై మట్టిని ఎందుకు తిన్నదీ రోహిత్ తెలిపాడు. ఆ పిచ్‌ పైనే మనం ఫైనల్ గెలిచి వరల్డ్ కప్ సాధించామని.. అందుకు ఆ పిచ్ తనకు ఎంతో ప్రత్యేకం అని.. దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా అని చెప్పిన రోహిత్ శర్మ... దాన్ని నేను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో అలా మట్టి నోట్లో వేసుకున్నట్లు తెలిపాడు.

కాగా... ఈ విజయం అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ... టీ20 అంతర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో టీమిండియాకు ప్రపంచకప్‌ ను అందించిన మూడో కెప్టెన్‌ గా రోహిత్ శర్మ నిలిచాడు. కపిల్ దేవ్ తొలిసారిగా 1983లో ఈ ఫీట్ సాధించగా, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007, 2011లో ప్రపంచకప్ గెలిచింది. తాజాగా 2024లో టీ20 ప్రపంచకప్‌ ను గెలుచుకుంది.