Begin typing your search above and press return to search.

ఒకరు కాదు ఐదుగురు.. రోహిత్‌ తర్వాత ఎవరు?

టి20ల్లో దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ శకం ముగిసింది. కెప్టెన్ గానే కాదు.. ఓపెనర్ గానూ అతడు చెరగని ముద్ర వేశాడు

By:  Tupaki Desk   |   1 July 2024 3:30 PM GMT
ఒకరు కాదు ఐదుగురు.. రోహిత్‌ తర్వాత ఎవరు?
X

టి20ల్లో దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ శకం ముగిసింది. కెప్టెన్ గానే కాదు.. ఓపెనర్ గానూ అతడు చెరగని ముద్ర వేశాడు. మరి రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు..? ఓపెనర్ గా అయితే యశస్వి జైశ్వాల్ కనిపిస్తున్నాడు. మరి కెప్టెన్ గా..? దీనికోసం ఒకటికి నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి. రోహిత్‌ స్థాయి నాయకత్వాన్నిఅందించేవారి కోసం బీసీసీఐ వేట మొదలుపెట్టొచ్చు.

మొదట హార్దిక్..

ఇటీవలి ప్రపంచ కప్ గెలవడంలో వైస్ కెప్టెన్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర. ఫైనల్లో అతడి బౌలింగ్ ప్రతిభను అందరూ చూశారు. మరీ ముఖ్యంగా క్లాసెన్ ను ఔట్ చేయడం, చివరి ఓవర్ లో మిల్లర్ ను పెవిలియన్ కు పంపడం. రోహిత్ స్థానంలో కెప్టెన్ గా ఈ ఆల్ రౌండర్ పేరు ఎక్కువగా వినిపించడం ఖాయం. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా హార్దిక్ టైటిల్ కొట్టాడు. ఒత్తిడిని తట్టుకునే సత్తా ఇతడి సొంతం. 2022 టి20 ప్రపంచ కప్ లో సెమీస్ లో ఓటమి అనంతరం న్యూజిలాండ్‌ తో మూడు మ్యాచ్‌ ల సిరీస్‌ కు పాండ్యానే కెప్టెన్. శ్రీలంక (3-0), మళ్లీ న్యూజిలాండ్ లపై (2-1) సిరీస్‌ లు అందించాడు. వెస్టిండీస్‌ లో టోర్నీని మాత్రం 3-2 తేడాతో ఓడిపోయాడు. మంచి పేస్ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్ కలిసొచ్చే పాయింట్ల. కానీ, గాయాల భయం ఉంది. ఫిట్ నెస్ తో ఉంటే వన్డేల్లోనూ భవిష్యత్ కెప్టెన్ ఇతడే.

మిస్టర్ 360కి వయసే అడ్డం

33 ఏళ్ల సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ దశలో టి20 కెప్టెన్ చేశాడు. మిస్టర్ 360కి వయసు ప్రతిబంధకం. టి20ల్లో చెలరేగే ఇతడు వన్డేలు, టెస్టుల్లో ఫెయిల్. ఆస్ట్రేలియా జట్టు భారత్‌ లో పర్యటించినపుడు సూర్యనే కెప్టెన్. ఏడు మ్యాచ్‌ లలో సారథ్యం వహించాడు. ఐదు గెలిపించాడు. కానీ, సూర్యకు కెప్టెన్సీ ఇస్తారని చెప్పలేం.

బూమ్ బూమ్ కు చాన్సుందా?

టి20 కెప్టెన్ గా ప్రధాన పేసర్ బుమ్రా గురించి కూడా చర్చ జరుగుతోంది. మూడు ఫార్మాట్లలో ఆడుతుండడంతో పాటు ఓ దశంలో వైస్ కెప్టెన్ చేశాడు. కట్టుదిట్టమైన బంతులేసే బుమ్రాకూ గాయాల బెడద ఉంది. ఇటీవల ఐర్లాండ్‌ పర్యటనలో కెప్టెన్ ఇతడే. మూడు ఫార్మాట్లలో కీలక బౌలర్‌, గాయాల భయం ఉన్నందున బుమ్రాకు కెప్టెన్సీ కష్టమే. పైగా సారథ్యం అంటే పెద్ద తలనొప్పి.

కుర్ర గిల్ నిలిస్తే..

యువ శుభమన్ గిల్ ను ఇటీవలి టి20 ప్రపంచ కప్ ఆడించలేదు. కానీ, అతడిని జింబాబ్వేతో టి20 సిరీస్‌ కు కెప్టెన్ చేశారు. ఐదు మ్యాచ్‌ ల సిరీస్‌ లో ఎలా నడిపిస్తాడో చూడాలి. వాస్తవానికి భవిష్యత్ కెప్టెన్ (మూడు ఫార్మాట్లకూ) గిల్ అనే చెప్పాలి. కానీ, టి20ల్లో స్ట్రయిక్ రేట్ పై విమర్శలున్నాయి. దీంతోనే కాస్త అనుమానం.

అయితే, రోహిత్‌-కోహ్లీ ఇద్దరూ లేనందున టి20ల్లో ఒకరి స్థానం గిల్ దే.

పంత్ కూడా ఉన్నాడు..

2022 కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడక ముందు వరకు భవిష్యత్ కెప్టెన్ గా వికెట్‌ కీపర్‌ బ్యాటర్ రిషభ్‌ పంత్‌ పేరు వినిపించింది. ఏడాదిపైగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన అతడు ఇప్పుడు తిరిగొచ్చి దుమ్ము రేపుతున్నాడు. వికెట్ కీపర్ కావడంతో కెప్టెన్సీకి అవకాశాలు ఎక్కువ. అయితే, పంత్ కు కీపర్ గా సంజూ శాంసన్, ఇషాన్‌ కిషన్‌, కేఎల్ రాహుల్‌, ధ్రువ్‌ జురెల్‌ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాక.. గాయం నుంచి కోలుకుని వచ్చిన తాను అంతర్జాతీయ క్రికెట్ కు మరింత ఫిట్ అని నిరూపించుకోవాల్సి ఉంది.