ఈ సాలా హోస నాయక.. ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చేశాడోచ్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇంతవరకు టైటిల్ కొట్టనప్పటికీ.. క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).
By: Tupaki Desk | 13 Feb 2025 7:43 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇంతవరకు టైటిల్ కొట్టనప్పటికీ.. క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). టీమ్ ఇండియా గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్ మొదలు మేటి బ్యాటర్ విరాట్ కోహ్లి నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వరకు ఎందరో కెప్టెన్లుగా వ్యహరించిన ఫ్రాంచైజీ ఇది. అయితే, బెంగళూరు బ్యాడ్ లక్ మహా బాగా పనిచేస్తుండడంతో ఒక్కసారీ టైటిల్ కొట్టలేకపోయింది. ‘ఈసాలా కప్ నమదే (ఈ సంవత్సరం కప్ మనదే)’ అంటూ ప్రతిసారీ బరిలో దిగడం ఉత్త చేతులతో వెనుదిరగడం బెంగళూరుకు అలవాటైంది.
ఇక గత ఏడాది నవంబరులో జరిగిన మెగా వేలంలో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ సహా పలువురు ఆటగాళ్లను వదులుకున్న ఆర్సీబీ.. ఈసారి కొత్త కెప్టెన్ తో బరిలో దిగుతోంది. వాస్తవానికి విరాట్ కోహ్లికే మరోసారి పగ్గాలు ఇస్తారని ఓ దశలో కథనాలు వచ్చినా.. అనూహ్యంగా యువ బ్యాట్స్ మన్ రజత్ పటీదార్ కు అవకాశం దక్కింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆర్సీబీ మేనేజ్‌మెంట్
పోస్టు పెట్టింది.
2024లో కెప్టెన్ గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్ ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలోనూ తీసుకోలేదు. కోహ్లి మళ్లీ కెప్టెన్సీ చేప్టటేందుకు మొగ్గుచూపలేదు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా ఉన్నప్పటికీ భవిష్యత్ ను ఊహించి రజత్ పటీదార్ ను కెప్టెన్ చేశారు.
ఎవరీ పటీదార్..?
ఆర్సీబీ తరఫున రెండేళ్లుగా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు పటీదార్. రంజీల్లో అత్యంత నిలకడగా ఆడుతుండడంతో పటీదార్ ను టీమ్ ఇండియాకు ఎంపిక చేశారు. నిరుడు టెస్టుల్లో, 2023లో వన్డేల్లోకి వచ్చాడు. మూడు టెస్టులు, ఒకే ఒక్క వన్డే ఆడాడు. 31 ఏళ్ల రజత్.. అంతర్జాతీయ టీ20లు ఆడలేదు. 2021 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 27 మ్యాచ్‌లలో 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు.
కాగా, ఆర్సీబీకి రాహుల్ ద్రవిడ్ (2008), కెవిన్ పీటర్సన్ (2009-స్టాండ్‌ఇన్ కెప్టెన్), అనిల్ కుంబ్లే (2009-10), డానియల్ వెటోరీ (2011-12), విరాట్ కోహ్లీ: 2011-2021, 2023 (స్టాండ్‌ఇన్), షేన్ వాట్సన్: 2017 (స్టాండ్‌ఇన్), ఫాఫ్ డుప్లెసిస్: 2022-24 కెప్టెన్లుగా వ్యహరించారు.