అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసిన ఆర్సీబీ!
ఈ పరిస్థితుల్లో ఈ ఐపీఎల్ లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది
By: Tupaki Desk | 19 May 2024 4:22 AM GMTఈ ఐపీఎల్ సీజన్ లో బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న టీం లలో ఆర్సీబీ ఒకటి! దీంతో... ఈ సీజన్ లో ఆర్సీబీ దుమ్ములేపడం ఖాయమని ప్రేక్షకులు, అభిమానులు ఆశించారు. అయితే ఈ సీజన్ 17లోని ఆర్సీబీ తొలి ఎనిమిది మ్యాచ్ ల్లో ఒకే ఒక్క గెలుపుతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన పరిస్థితి. అప్పటికే కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఈ ఐపీఎల్ లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. ఆర్సీబీ అభిమానూల్ తో పాటు ప్రతీ క్రికెట్ అభిమానీ బెంగళూరు ను డిజాస్టర్స్ లిస్ట్ లో వేసేశాడు.. మరి కొంతమంది మాత్రం టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలనే విశ్లేషణలూ తెరపైకి తెచ్చారు. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ సంగతి సరేసరి. కానీ అద్భుతం జరిగింది!
అదేదో సినిమాలో డైలాగ్ లా... “అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు” అన్నట్లుగా మారింది పరిస్థితి. ఆర్సీబీ జట్టు కనీ వినీ ఎరగని రీతిలో ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ కు దూసుకెళ్లింది. దీనికోసం వరుసగా 6 మ్యాచ్ ల్లో గెలిచింది. ఈ క్రమంలో గెలుపు తప్పనిసరైన తన ఆఖరి మ్యాచ్ లో శనివారం చెన్నైపై గెలిచింది.
అవును... శనివారం చెన్నై - ఆర్సీబీ మధ్య రసవత్తర పోరు నడిచింది. ఇందులో భాగంగా... తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్స్ లో కోహ్లి - 47, డుప్లెసిస్ - 54, రజత్ పటీదార్ - 41, గ్రీన్ - 38 రాణించారు.
అనంతరం ఛేదనకు దిగిన చెన్నై ని ఆర్సీబీ బౌలర్లు బాగానే కట్టడి చేశారు. చెన్నై 7 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. రన్ రేట్ పరంగా చూసుకున్నా చెన్నై 201 చేసినా ప్లేఆఫ్స్ కు వెళ్లగలిగేది.. కానీ, ఆర్సీబీ బౌలర్లు ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఫలితంగా ఊహించని రీతిలో అన్నట్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్ కతా (19), రాజస్థాన్ (16), హైదరాబాద్ (15), బెంగళూరు (14) పాయింట్లతో వరుసగా టాప్ నాలుగు స్థానాల్లోనూ ఉన్నాయి.