Begin typing your search above and press return to search.

ఈ కసి మామూలుగా లేదు.. ''ఈ సాలా కప్ నమదేనేమో?''

16 సీజన్లు గడిచిపోయాయి.. ప్రతి సీజన్ లోనూ ఒకటే ఆశ.. ఈ సాలా కప్ నమదే (ఈ ఏడాది కప్ మనదే)

By:  Tupaki Desk   |   19 May 2024 11:30 AM GMT
ఈ కసి మామూలుగా లేదు.. ఈ సాలా కప్ నమదేనేమో?
X

16 సీజన్లు గడిచిపోయాయి.. ప్రతి సీజన్ లోనూ ఒకటే ఆశ.. ఈ సాలా కప్ నమదే (ఈ ఏడాది కప్ మనదే). కానీ, ఒక్క సాలా కూడా నమదే కాలేదు. ఈ సాలా మాత్రం ఆ కసి చూస్తుంటే నమదే నమదే కప్ అన్నట్లుంది పరిస్థితి. ఎనిమిది మ్యాచ్‌ లలో ఒకే ఒక్క గెలుపు.

పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్‌ రేటూ మైనస్ లో. అప్పటికి కనీసం నాలుగు మ్యాచ్ లలో నెగ్గిన జట్లు ఆరు ఉన్నాయి. కానీ, మిగతా ఆరు మ్యాచ్ లను గెలిచిన ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరింది. తమ కథ ముగిసినట్లేనని ఎగతాళి చేసిన వారికి.. తమ పరిస్థితిని ఎగతాళి చేస్తూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పెట్టినవారిని వెక్కిరిస్తూ ప్లే ఆఫ్స్ నకు దూసుకెళ్లింది.

భళా బెంగళూరు..

డివిలియర్స్, మెకల్లమ్, క్రిస్ గేల్ లాంటి ఎందరో స్టార్ బ్యాట్స్ మెన్లు.. స్టార్క్ లాంటి మెరుపు బౌలర్లు.. కానీ, 16 సీజన్లలో ఒక్కసారీ కప్ కొట్టలేదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. కానీ, ఈసారి మాత్రం లీగ్ దశలో అదరగొట్టింది. మిగతా అన్ని మ్యాచ్‌ లలో సంగతి ఏమో కానీ.. వరుసగా 6 మ్యాచ్‌ లలో గెలిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఐపీఎల్‌-17 ప్లేఆఫ్స్‌ కు దూసుకెళ్లింది.

మన్నలి గుర్తు పెట్టుకోవాలంటే..

చెన్నైతో ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్ అనంతరం బెంగళూరు డ్రెస్సింగ్‌ రూమ్‌ కోలాహలంగా మారిపోయింది. ఈ క్రమంలో సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్ మాట్లాడాడు. ‘కొన్ని దశాబ్దాల పాటు మనల్ని అభిమానులు గుర్తు పెట్టుకోవాలంటే ప్రత్యేకంగా ఏదొకటి చేయాలి. ఆర్సీబీ స్పెషల్‌ టీమ్‌ గా కనిపించాలి’ అని పిలుపునిచ్చాడు.

ఆర్సీబీ.. అంతా ఆల్ రైట్

ఆర్సీబీకి మొదటినుంచి ఉన్న లోటు.. సరైన ఆటగాళ్లను సరైన విధంగా వాడుకోకపోవడం. ప్రస్తుత సీజన్ తొలి మ్యాచ్ ల్లోనూ ఇలాగే చేసింది. అయితే, తప్పులను సరిదిద్దుకుంది. రజత్ పటీదార్ వంటి బ్యాటర్ పై నమ్మకం ఉంచింది. యశ్ దయాల్ కూ భరోసా కల్పించింది. ఆల్ రౌండర్ కామెరూన్ గీరన్ ఫామ్ లోకి రావడం, దినేశ్ కార్తీక్ కూడా అద్భుతంగా ఆడడంతో గెలుపు బాట పట్టింది.

మ్యాక్సీ మాయ చేస్తే..

భారత అల్లుడు, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎంతటి విధ్వంసకారుడో అందరికీ తెలిసిందే. అక్టోబరు-నవంబరులో జరిగిన ప్రపంచ కప్ లో అఫ్గానిస్థాన్ పై డబుల్ సెంచరీ కొట్టి మరీ జట్టును గెలిపించాడు. కానీ, ఈ ఐపీఎల్ మొదట్లో అతడు దారుణంగా విఫలమయ్యాడు. అలసిపోయానంటూ విశ్రాంతి తీసుకున్నాడు. తిరిగొచ్చాక లయ అందుకున్న మ్యాక్సీ.. ఫామ్ లోకి వస్తున్నాడు. చెన్నైతో శనివారం మ్యాచ్ లో విలువైన 16 పరుగులు చేయడమే కాక.. తొలి బంతికే వికెట్ పడగొట్టాడు.

మరొక్క రెండు అడుగులే..

ఐపీఎల్ టైటిల్ కొట్టాలన్న ఆర్సీబీ చిరకాల కోరిక తీరాలంటే మరొక్క రెండు అడుగులే. ప్లే ఆఫ్స్ ఆపై ఫైనల్లోనూ గెలిస్తే చాంపియన్ గా నిలుస్తుంది. విరాట్ కోహ్లికి ఘనమైన బహుమతి అందిస్తుంది.

కొసమెరుపు: ఐపీఎల్ లీగ్ దశలో 14 పాయింట్లు మాత్రమే సాధించిన జట్లు ప్లే ఆఫ్స్ చేరడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది. ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే ఈ ప్రత్యేకత సాధించింది. ఇప్పుడు మళ్లీ బెంగళూరు ఆ మ్యాజిక్ చేసింది.