Begin typing your search above and press return to search.

నేను 21 ఏళ్లు నిరీక్షించా.. వికెట్ కోసం 21 ఓవర్లు ఆగలేవా?

టీమిండియా క్రికెటర్ దేవుడు సచిన్‌ టెండుల్కర్‌ తనలో స్ఫూర్తి నింపాడంటూ ఓ క్రికెటర్ పేర్కొన్నాడు.

By:  Tupaki Desk   |   21 March 2024 2:30 PM GMT
నేను 21 ఏళ్లు నిరీక్షించా.. వికెట్ కోసం 21 ఓవర్లు ఆగలేవా?
X

మిగతా దేశాల జట్ల సంగతి ఏమోగాని, టీమిండియాలో మొదటినుంచి సీనియర్లు-జూనియర్ల మధ్య చక్కటి స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. తరతరాలుగా ఇది అలా అప్రకటిత సంప్రదాయంగా వస్తోంది. జూనియర్లను టార్గెట్ చేసి వేధించడం, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం వంటి దుస్సంప్రదాయాలు ఎప్పుడూ లేవు. ఇలాంటిదే ఓ సంఘటన ఇది..

అటు దేవుడు.. ఇటు యువకుడు

టీమిండియా క్రికెటర్ దేవుడు సచిన్‌ టెండుల్కర్‌ తనలో స్ఫూర్తి నింపాడంటూ ఓ క్రికెటర్ పేర్కొన్నాడు. దీనికి పెద్ద కథనే ఉంది. అరంగేట్ర యువ బౌలర్‌గా తాము ముంబై వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ ఆడుతున్నామని.. వికెట్‌ ఫ్లాట్‌ గా ఉండడంతో వెస్టిండీస్‌ స్కోరు నాలుగు వికెట్లకు 500కు చేరిందని తెలిపాడు. తనలో వికెట్‌ తీయలేకపోతున్నాననే అసహనం పెరిగిందని.. నిరాశ ఆవరించిందని చెప్పాడు. ‘‘అప్పటికి నా వయసు 21 ఏళ్లు. అయితే చిత్రంగా 21 ఓవర్ల పాటు వికెట్‌ తీయలేదు. నా కెరీర్ లో అలా జరగడం ఇదే మొదటిసారి. అప్పుడు సచిన్‌ మిడాఫ్‌ లో ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. నన్ను చూసి.. ‘ఏమైంది అలా ఉన్నావు? ఎందుకంత నిరాశ?’ అని అడిగినట్లు యువ క్రికెటర్ చెప్పాడు. ‘పాజీ.. నా బౌలింగ్‌లో 21 ఓవర్లు అయినా వికెట్‌ తీయకపోవడం ఇదే తొలిసారి తెలుసా? అరంగేట్రంలో ఇలా అవుతందని అనుకోలేదు’ అని సచిన్ కు చెప్పినట్లు తెలిపాడు.

22 ఏళ్లు ఆడాక కానీ కప్ కొట్టలే..

యువ క్రికెటర్ మాటలకు సచిన్ స్పందించాడు. ఓవర్‌ మధ్యలోనే.. అతడిని దగ్గరికి రమ్మని పిలిచి... నేను తొలి వరల్డ్‌కప్‌ అందుకోవడానికి 22 ఏళ్లు పట్టింది. నువ్వు తొలి వికెట్‌ కోసం కనీసం 21 ఓవర్లు ఆగలేవా? అంతగా నిరాశపడొద్దు. ఏం జరిగిందన్నది అప్రస్తుతం. ఏం చేయగలవో ఆలోచించు’ అని చెప్పాడు. విచిత్రం ఏమంటే మరుసటి బంతికే తాను డారెన్‌ బ్రావో (166)ను అవుట్‌ చేసి తొలి వికెట్‌ అందుకున్నట్లు యువ పేసర్ చెప్పాడు. కార్ల్‌టన్‌, డారెన్‌ సామీ వికెట్లు కూడా తీశానని వివరించాడు. తన అరంగేట్రం అలా ప్రత్యేకంగా మారిపోయిందని హర్షం వ్యక్తం చేశాడు.

ఆ పేసర్ ఎవరంటే..?

సచిన్ విలువైన సలహా ఇచ్చిన క్రికెటర్ వరుణ్‌ ఆరోన్‌. జంషెడ్‌ పూర్‌కు చెందిన ఇతడు 13 ఏళ్ల కిందటిని వివరించాడు. ప్రస్తుతం 34 ఏళ్ల వయసున్న అరోన్ 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 9 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. వీటిలో 18, 11 వికెట్లు తీశాడు.