Begin typing your search above and press return to search.

సెన్సేషన్ . 27 బంతుల్లోనే భారతీయ క్రికెటర్ సెంచరీ.. టి20 రికార్డు బద్దలు

సైప్రస్ పై మ్యాచ్ లో చౌహాన్ 27 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఏకంగా 18 సిక్స్ లు బాదాడు. మొత్తం 41 బంతుల్లో 144 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 9:53 AM GMT
సెన్సేషన్ . 27 బంతుల్లోనే భారతీయ క్రికెటర్ సెంచరీ.. టి20 రికార్డు బద్దలు
X

ఇదేమిటి..? టి20 ప్రపంచ కప్ లో భారత్ సూపర్ 8 మ్యాచ్ లు ఇంకా మొదలుకాలేదు కదా..? మరి భారత క్రికెటర్ ఏకంగా రికార్డు స్థాయిలో సెంచరీ ఎలా కొట్టాడు..? అసలు అమెరికా–కరీబియన్ దేశాల పిచ్ లపై మొత్తం ఇన్నింగ్స్ లో వంద పరుగులు రావడమే కష్టంగా ఉంటే.. మరి ఇతడు 27 బంతుల్లో సెంచరీ ఎలా కొట్టాడు..? ఇదేమైనా ఫేక్ న్యూసా? అసలు ఇది సాధ్యమా..? ఔను ఇది నిజమే.. సాధ్యమైంది కూడా.. ఎలాగంటే..?

ఎక్కడి ఎస్తోనియా..? ఎక్కడి ఇండియా..?

ఎస్తోనియా.. సగటు క్రికెట్ అభిమాని అసలు విని ఉండని పేరు. ఉత్తర ఐరోపాకు చెందిన బాల్టిక్ ప్రాంతంలోని దేశం ఇది. ఉత్తర సరిహద్దున ఫిన్లాండ్, పశ్చిమాన స్వీడన్, దక్షిణాన లాట్వియా, తూర్పున రష్యా దేశాలు ఉంటాయి. ఇప్పుడిప్పుడే క్రికెట్ లో ఓనమాలు నేర్చుకుంటోంది ఎస్తోనియా. అలాంటి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సాహిల్ చౌహాన్. న్యూజిలాండ్, నెదర్లాండ్స్, అమెరికా, కెనడా ఇలా అనేక దేశాలకు భారతీయ మూలాలున్న క్రికెటర్లు ఆడుతున్నారు. ఇలాంటివారి కోవలోకే చేరాడు సాహిల్ చౌహాన్.

ఏ ప్రాంతం వాడో..?

సాహిల్ చౌహాన్ భారతీయ మూలాలున్నవాడే. అయితే, భారత్ లోని ఏ ప్రాంతానికి చెందినవాడో మాత్రం తెలియదు. అతడి పేరును బట్టి రాజస్థాన్ లేదా పంజాబ్, ఢిల్లీకి చెందినవాడుగా భావించాల్సి వస్తోంది. ఇంతకుమించిన వివరాలు ఇంటర్నెట్ లో దొరకడం లేదు. కాగా, బ్యాటర్ల రాజ్యం అయిన టి20 క్రికెట్‌ లో చౌహాన్ రికార్డులు బద్దలు కొట్టాడు.

ఏకంగా 18 సిక్స్ లు..

సైప్రస్ పై మ్యాచ్ లో చౌహాన్ 27 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఏకంగా 18 సిక్స్ లు బాదాడు. మొత్తం 41 బంతుల్లో 144 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో ఆరు ఫోర్లు కూడా ఉన్నాయి. కాగా, మొత్తం నాలుగు టీ20లు ఆడిన చౌహాన్ చేసిన పరుగులు 162. తాజా 144 పరుగులు కూడా ఇందులో ఉన్నాయి.

గేల్ రికార్డు మటాష్..

అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ నమీబియాకు చెందిన జాన్‌ నికోల్ (33 బంతుల్లో) పేరిట ఉంది. దీనిని చౌహాన్ బద్దలుకొట్టాడు. లీగ్ లు సహా చూస్తే.. టీ20 ఫార్మాట్‌ లో గేల్ (30 బంతుల్లో సెంచరీ) రికార్డును కూడా సాహిల్‌ చెరిపేశాడు.

సిక్సుల రికార్డూ బద్దలు..

ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ ల రికార్డునూ చౌహాన్ చెరిపేశాడు. అఫ్ఘాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్, న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ గతంలో 16 సిక్స్ ల చొప్పున కొట్టారు.

గోల్డెన్ డకౌట్ కావాల్సిన వాడు..

సైప్రస్ తో మ్యాచ్ లో అసలు చౌహాన్ మొదటి బంతికే (గోల్డెన్ డక్) ఔట్ కావాల్సిన వాడు. కానీ, లక్ అతడి వైపు ఉండడంతో బతికిపోయాడు.