అతడికి 38.. ఇతడికి 19.. ప్రపంచ క్రికెట్ లో అరుదైన వింత జోడీ
ఆస్ట్రేలియా క్రికెట్ ను ఎంత ప్రొఫెషనల్ గా ఆడుతుందో అందరికీ తెలిసిందే. అలాంటి కంగారూ జట్టులో ఇప్పుడు ఓ కొత్త కెరటం.
By: Tupaki Desk | 26 Dec 2024 3:24 AM GMTలేలేత కుర్రాళ్లు సీనియర్లతో కలిసి ఆడడంలో ఆశ్చర్యం లేదు.. ఏ క్రీడలో అయినా ఇది సహజమే.. 16 ఏళ్లకే అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టిన సచిన్ టెండూల్కర్ అప్పటికి తనకంటే రెట్టింపు (32) వయసున్న పాకిస్థాన్ ఆటగాళ్లతో తలపడ్డాడు. కానీ, ఇలాంటి సందర్భాలు అన్నిసార్లూ జరగవు. దశాబ్దానికి ఒకసారో రెండుసార్లో మాత్రమే. ఇప్పుడు అలాంటి సమయమే వచ్చింది.
ఆసీస్ క్రికెట్లో సంచలనం..
ఆస్ట్రేలియా క్రికెట్ ను ఎంత ప్రొఫెషనల్ గా ఆడుతుందో అందరికీ తెలిసిందే. అలాంటి కంగారూ జట్టులో ఇప్పుడు ఓ కొత్త కెరటం. రికార్డులతో పని లేకుండా ఆటగాడిలోని సత్తా, ప్రతిభను చూసి అవకాశం ఇచ్చే దేశం ఆస్ట్రేలియా. అలాంటి ఆసీస్ టెస్టు జట్టులోకి వచ్చాడు శామ్ కొంటాస్. ఇతడి వయసు కేవలం 19 ఏళ్ల 84 రోజులే. కానీ, ఇప్పటికే ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఎంపికై టీమ్ ఇండియా పై గురువారం నుంచి బాక్సింగ్ డే టెస్టులో ఆడుతున్నాడు. ఇంతకూ కొంటాస్ ఫస్ట్ క్లాస్ గణాంకాలు గొప్పగా ఏమీ లేవు. 11 మ్యాచ్ లలో 18 ఇన్నింగ్స్ ఆడి 718 పరుగులు చేశాడు. సగటు 42.23. లిస్ట్ ఏ (దేశవాళీ వన్డే)లో ఒక మ్యాచ్ ఆడి 10 పరుగులు, టి20ల్లో 2 మ్యాచ్ లాడి 56 పరుగులు చేశాడు. ఈ ఏడాది అండర్ 19 ప్రపంచ కప్ లో వెస్టిండీస్ పై సెంచరీ కొట్టాడు. దీంతోనే సెలక్టర్ల కంట్లో పడ్డాడు. ఇతడి మెంటార్ ఎవరో కాదు.. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్.
కెప్టెన్ తర్వాత ఇతడే..
శామ్ కొంటాస్ ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ డే టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేస్తే ఘనమైన రికార్డును అందుకోనున్నాడు. అదేమంటే గత 95 ఏళ్లలో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత చిన్న వయస్కుడిగా నిలవనున్నాడు. 17 ఏళ్ల 239 రోజుల వయసులో ఇయాన్ క్రెయిన్ ఆస్ట్రేలియా తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ఇక ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 2011లో 18 ఏళ్ల 193 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. కొంటాస్ మాత్రం 18 ఏళ్ల 85 రోజుల వయసులో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు.
రెట్టింపు ఖవాజా..
శామ్ కొంటాస్ తో కలిసి ఓపెనర్ గా దిగనున్న ఉస్మాన్ ఖవాజాది కూడా రికార్డే. ఇతడు ఆస్ట్రేలియాకు ఆడిన తొలి పాకిస్థానీ. ప్రొఫెషనల్ పైలట్ అయిన ఖవాజా.. తర్వాత క్రికెటర్ గా మారాడు. కాగా, ఖవాజా వయసు 38 ఏళ్లు. 1986 డిసెంబరు 18న పుట్టాడు. అంటే మొన్నటికి 38 నిండాయి. సరిగ్గా కొంటాస్ కు రెట్టింపు వయసు. కాగా, వీరిద్దరూ ఓపెనింగ్ చేయడం ద్వారా ఓ ఘనమైన రికార్డును అందుకోనున్నారు. అత్యంత ఎక్కువ వయసు వ్యత్యాసం కలిగిన తొలి ఓపెనింగ్ జోడీగా రికార్డు సృష్టించనున్నారు.