Begin typing your search above and press return to search.

పంజాబ్ వర్సెస్ ఢిల్లీ... సామ్‌ కరన్‌ వన్ మేన్ షో!

అక్కడనుంచి ఎలా జరిగాయి మలుపులు, మెరుపులు అనేది ఇప్పుడు చూద్దాం...!

By:  Tupaki Desk   |   23 March 2024 2:13 PM GMT
పంజాబ్  వర్సెస్  ఢిల్లీ... సామ్‌  కరన్‌  వన్  మేన్  షో!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా రెండో మ్యాచ్ పంజాబ్ - ఢిల్లీ జట్ల మధ్య జరిగింది. చాలాకాలం తర్వాత రిషబ్ పంత్ మైనదానంలోకి దిగడంతో అందరి దృష్టీ అతనిపైనే ఉంది! ఇక టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అక్కడనుంచి ఎలా జరిగాయి మలుపులు, మెరుపులు అనేది ఇప్పుడు చూద్దాం...!

ఆరంభం అదుర్స్!:

ఢిల్లీ తరుపున ఓపెనర్లుగా డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్ లు మైదానంలోకి దిగి బ్యాట్ ఝులిపించారు! వీరిలో ఫస్ట్ ఓవర్ లో మార్ష్ రెండు ఫోర్లు కొట్టగా... రెండో ఓవర్లో వార్నర్ వరుసగా ఫుల్ షాట్ తో సిక్స్, కట్ షాట్ తో ఫోర్ సాధించి ఊపు తెచ్చారు. ఈ క్రమంలో మూడు ఓవర్లకు 33 పరుగులు సాధించింది ఢిల్లీ.

మార్ష్ మెరుపులు అలా ముగిశాయి:

రెండు ఫోర్లు, రెండు సిక్సర్లలో సాయంతో 11 బంతుల్లో 20 పరుగులు చేసి మెరుపులు మెరిపించిన మార్ష్... అర్షదీప్ బౌలింగ్ లో రాహుల్ చహర్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పంజాబ్కి నాలుగో ఓవర్ లో ఫస్ట్ వికెట్ దక్కినట్లయ్యింది. ఈ క్రమంలో 4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోరు 1 వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది.

వార్నర్ వెనుదిరిగిందిలా:

మార్ష్ నిష్క్రమణ అనంతరం హోప్ తో కలిసి ఇన్నింగ్స్ ని వార్నర్ దూకుడుగానే కంటిన్యూ చేస్తున్నాడు. ఈ క్రమంలో పటేల్ వేసిన 8 ఓవర్ చివరి బంతికి కీపర్ షర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో... 21 బంతులు ఆడిన వార్నర్ 3 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 29 పరుగులు చేశాడు. దీంతో 8 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 2 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది.

10 ఓవర్లకు ఇదీ పరిస్థితి:

పంత్, హోప్ లు నిలకడగా ఆడుతున్న వేళ ఢిల్లీ స్కోరు 10 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. అప్పటికి హోప్‌ (26), రిషభ్‌ పంత్ (3) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

హోప్ వెనుదిగిన వేళ:

25 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 పరుగులు చేసి దూకుడుమీదున్న హోప్ ని రబడ బోల్తా కొట్టించాడు. ఈ సమయంలో హర్ ప్రీత్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో... 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.

ప్చ్.. పంత్ ఔటయ్యాడు ఇలా:

నేటి మ్యాచ్ లో అందరి దృష్టీ రిషబ్ పంత్ పైనే ఉందన్నా అతిశయోక్తి కాదు. మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో స్టాండింగ్ ఓవేషన్ దొరికింది పంత్ కి. ఈ సమయంలో భారీ ఇన్నింగ్స్‌ ఆడతాడనుకున్న పంత్ 13 బంతుల్లో 18 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇందులో రెండు ఫోర్లు ఉన్నాయి. హర్షల్‌ పటేల్ వేసిన 12.4 ఓవర్‌ కు బెయిర్‌ స్టోకు చిక్కాడు. ఈ క్రమంలో 13 ఓవర్లలో 4 వికెట్లకు 111 పరుగులు చేసింది ఢిల్లీ.

వరుసగా పడుతున్న ఢిల్లీ వికెట్లు:

13వ ఓవర్లో పంత్ అవుట్ అయ్యేటప్పటికీ ఢీలీ గౌరవప్రదమైన స్కోర్ చేస్తుందా లేదా అనే సందేహం కలిగిన నేపథ్యంలో... ఆ సందేహానికి బలం చేకూరుస్తున్నట్లుగా... 14 ఓవర్‌ లో రెండో బంతికి వికెట్ కీపర్‌ జితేశ్ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు రికీ భుయ్‌ (3). అప్పటికి ఢిల్లీ స్కోరు 14 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 117.

అనంతరం నెక్స్ట్ ఓవర్లో... అంటే రాహుల్ చాహర్‌ వేసిన 15.4 ఓవర్లో స్టబ్స్‌ (5) శశాంక్‌ సింగ్‌ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 16 ఓవర్లకు స్కోరు 6 వికెట్ల నష్టానికి 128!

ఇదే క్రమంలో... నిలకడగా ఆడుతున్న అక్షర్‌ పటేల్ (21) కూడా ఔటయ్యాడు. హర్షల్‌ పటేల్ వేసిన 18 ఓవర్‌ లో ఫస్ట్ బాల్ కి రెండో పరుగు కోసం యత్నించి రనౌటయ్యాడు. దీంతో ఢిల్లీ స్కోరు 18 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 146 పరుగులకు చేరింది.

దడదడలతో ముగిసిన ఢిల్లీ ఇన్నింగ్స్:

19 ఓవర్లకు స్కోరు 8 వికెట్ల నష్టానికి 149 పరుగులుగా ఉన్న పరిస్థితుల్లో... చివరి ఓవర్లో స్ట్రైకింగ్ లో ఉన్న అభిషేక్ పొరెల్ దుమ్ము దులిపేశాడు. ఇందులో భాగంగా... 4 - 6 - 4 - 4 - 6 - 1 పరుగులతో హోరెత్తించేశాడు. దీంతో... 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు గౌరవప్రదమైన స్కోర్ చేసింది ఢిల్లీ! ఈ క్రమంలో... 10 బంతులు ఫేస్ చేసిన పొరెల్ 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేశాడు.. స్ట్రైక్ రేటు 320!

టార్గెట్ 175... అలా మొదలుపెట్టిన పంజాబ్:

175 పరుగుల లక్ష్యంతో చేజింగ్ మొదలు పెట్టిన పంజాబ్... బలంగానే ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి ఓవర్ లో శిఖర్ దావన్ 2 ఫోర్లు, బెయిర్‌ స్టో చెరో రెండు ఫోర్లూ కొట్టడంతో 17 పరుగులు రాబట్టారు. రెండో ఓవర్ లోనూ శిఖర్ ధావన్ అదే ఊపు కొనసాగించాడు. దీంతో... 2 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.

శిఖర్‌ ధావన్‌ కు షాకిచ్చిన ఇషాంత్ శర్మ:

దూకుడు మీదున్న పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ (22) ఔటయ్యాడు. దీంతో పంజాబ్‌ తొలి వికెట్ కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ వేసిన 3.1 ఓవర్‌ కు ధావన్‌ క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. ధావన్‌ ఔటైన తర్వాత ఇదే ఓవర్ లో క్రీజులోకి వచ్చిన సిమ్రన్‌ సింగ్ (8) ఎదుర్కొన్న తొలి రెండు బంతులకు బౌండరీలు బాదాడు. మూడో బంతికి అవతలి ఎండ్‌ లో ఉన్న బెయిర్‌ స్టో (9) రనౌటయ్యాడు. దీంతో 4 ఓవర్లకు స్కోరు 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 42 పరుగులు సాధించింది.

నిలకడగా ఆడుతున్న పంజాబ్‌ బ్యాటర్లు:

రెండు వికెట్లు పడిన అనంతరం... లక్ష్యఛేదనలో పంజాబ్‌ బ్యాటర్లు నిలకడగా ఆడారు. ఈ సమయంలో 7 ఓవర్లకు పంజాబ్ స్కోరు రెండు వికెట్లు నష్టపోయి 67గా ఉంది. ఇందులో భాగంగా... సామ్‌ కరన్‌ (14), సిమ్రన్‌ సింగ్ (18) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

3 తర్వాత తడబాబు.. వెంటనే నాలుగో వికెట్!

కుల్‌ దీప్‌ యాదవ్ వేసిన 9.2 ఓవర్ లో భారీ షాట్ ఆడిన సిమ్రన్ సింగ్ (26: 17 బంతుల్లో) వార్నర్‌ కు చిక్కాడు. దీంతో 10 ఓవర్లకు స్కోరు 3 వికెట్లకు 87కి చేరుకుంది. ఇదే సమయంలో కుల్‌ దీప్‌ వేసిన 12 ఓవర్‌ లో మూడో బంతికి జితేశ్ శర్మ (9) స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో 12 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేశారు.

చివరి ఐదు ఓవర్లు.. లక్ష్యం 45 పరుగులు:

చివరి 30 బంతుల్లో 45 పరుగులు అవసరమైన పరిస్థితి 15 ఓవర్లు పూర్తయ్యే నాటికి వచ్చింది. ఆ సమయానికి సామ్‌ కరన్‌ (46), లివింగ్‌ స్టోన్‌ (12) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరూ క్రీజ్ లో ఉంటే... పంజాబ్ ఫస్ట్ విక్టరీ సాధ్యమయ్యే అవకాశం ఉండగా... ఈ రెండు వికెట్లు పడితే మాత్రం విజయం ఢిల్లీ వైపు మళ్లే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. మొత్తం మీద 15 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయిన 130 పరుగులు చేసింది.

సామ్‌ కరన్‌ హాఫ్‌ సెంచరీ.:

ఐపీఎల్ 17వ సీజన్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ నమోదైంది. ఇందులో భాగంగా... పంజాబ్ బ్యాట్స్ మెన్ సామ్ కరన్‌ 39 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో 16 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ స్కోరు 136 పరుగులు చేసింది.

విజయతీరాలకు చేర్చిన సామ్‌ కరన్‌ ఔట్:

175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 4 ఓవర్లలో 2 వికెట్లకు 42 పరుగులు చేసిన సమయంలో... క్రీజ్ లోకి వచ్చిన సామ్‌ కరన్‌.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇందులో భాగంగా... 47 బంతులు ఫేస్ చేసి 63 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఈ క్రమంలో శశాంక్ సింగ్ క్రీజ్ లోకి వచ్చిన వెంటనే ఔట్ అయ్యాడు. దీంతో... 19 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయిన పంజాబ్ 169 పరుగులు చేసింది.

6 బాల్స్ 6 రన్స్:

చివరి 6 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కాస్త ప్రెజర్ ఫీల్ అయ్యాడో ఏమో కానీ... ఫస్ట్ రెండు బంతులు వైడ్స్ వేయగా... 19.2 ఓవర్లో లివింగ్ స్టన్ 6 కొట్టడంతో పంజాబ్ ప్లేయర్స్ & ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు! పంజాబ్ ప్లేయర్స్ లో సామ్‌ కరన్‌ తర్వాత లివింగ్ స్టన్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో భాగంగా... 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు.

ఇక ఢిల్లీ బౌలర్లలో కుల్‌ దీప్‌ యాదవ్‌ 2, ఖలీల్‌ అహ్మద్‌ 2, ఇషాంత్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.