టీమ్ ఇండియాలో రోహిత్.. కోహ్లి స్థానాలు ఆ ఇద్దరివే..ఒకరు హైదరాబాదీ
టి20లు, వన్డేల్లో కోహ్లి వన్ డౌన్ బ్యాటర్. వన్డేల్లో కోహ్లి ఇంకా ఆడుతున్నాడు. మరి టి20ల్లో..? ఇదిగో తానున్నానంటున్నాడు హైదరాబాదీ తిలక్ వర్మ.
By: Tupaki Desk | 17 Nov 2024 8:30 PM GMTమధ్యలో కాస్త అటుఇటు అయినా 2007-08 నుంచి టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు విడదీయరాని భాగమయ్యారు. స్టార్ బ్యాట్స్ మన్ ఎదగడమే కాదు.. కెప్టెన్లు గానూ పనిచేశారు. దేశానికి ఎన్నో ట్రోఫీలు అందించారు. అయితే, వీరిద్దరూ ఇటీవలి టి20 ప్రపంచ కప్ అనతంరం పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. 36 ఏళ్ల కోహ్లి, 37 ఏళ్ల రోహిత్ స్థానాలు మరి భర్తీ చేసేదెవరు..? ఆ ఇద్దరు దిగ్గజాల స్థాయిలో ప్రతిభావంతులు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే మన హైదరాబాదీతో పాటు కేరళ కుర్రాడు.
తిలక్కొట్డుడు కొట్టి..
టి20లు, వన్డేల్లో కోహ్లి వన్ డౌన్ బ్యాటర్. వన్డేల్లో కోహ్లి ఇంకా ఆడుతున్నాడు. మరి టి20ల్లో..? ఇదిగో తానున్నానంటున్నాడు హైదరాబాదీ తిలక్ వర్మ.
సాధారణ మధ్య తరగతి తెలుగు కుటుంబం నుంచి వచ్చిన తిలక్.. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. క్రికెట్ పై ప్రేమతో జాతీయ జట్టు స్థాయికి ఎదిగాడు. 22 ఏళ్ల తిలక్.. ఇప్పుడు భారత క్రికెట్లో సంచలనం. ఐపీఎల్, దేశవాళీల్లో అదరగొట్టి నిరుడే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
నిలకడ లేమి, గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ తర్వాత గాయాలతో శ్రీలంక, జింబాబ్వే సిరీస్ లలో ఆడలేదు. బంగ్లాదేశ్ తో సిరీస్ లో అవకాశం రాలేదు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి రెండు మ్యాచ్ లలో 33, 20 పరుగులు. 4 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే తిలక్.. కెప్టెన్ సూర్య కుమార్ ను అడిగి దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో వన్ డౌన్ లో దిగాడు. వరుసగా రెండు సెంచరీలతో జట్టు ఆటనే కాదు తన రాతనూ మార్చుకున్నాడు. కోహ్లిని భర్తీ చేసేలా కనిపిస్తున్నాడు. ఇప్పటి కుర్రాళ్లు బంతిని బలంగా బాదడంపై దృష్టి పెట్టి వికెట్ పారేసుకుంటారు. తిలక్ మాత్రం సంప్రదాయ ఆటతో పాటు వినూత్న షాట్లతో కుమ్మేస్తున్నాడు. మోకాలిని నేలకు తాకించి కొట్టే సిక్సర్లు ముచ్చటగా ఉన్నాయి. తిలక్ ఇప్పటివరకు 20 టీ20లు, 4 వన్డేలు ఆడాడు. టి20ల్లో అతడి సగటు 51.33 కావడం విశేషం.
9 ఏళ్ల తర్వాత స్థానం పదిలం టి20ల్లో 2015లోనే టీమ్ ఇండియాకు ఆడాడు కేరళ కుర్రాడు సంజూ శాంసన్. అప్పటికి అతడికి 20 ఏళ్లే. ఈపాటికి జట్టులో స్థానం సుస్థిరం కావాలి. కానీ, ఆడింది 37 టి20లు, 16 వన్డేలే. విపరీతమైన పోటీ కారణంగా అవకాశాలు రాకపోగా.. వచ్చినప్పుడు అతడు సద్వినియోగం చేసుకోలేదు. సంజూను ఎంపిక చేయాలని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగేది. కానీ, అతడు మాత్రం రాణించేవాడు కాదు. తాజాగా మాత్రం ఓపెనర్ గా వస్తూ దుమ్మురేపుతున్నాడు. మొన్నటి బంగ్లాదేశ్ తో సిరీస్ కు ముందు 30 టి20ల్లో బ్యాటింగ్ ఆర్డర్ లో టాప్-7 స్థానాల్లో ఆడాడు. తనకంటూ శాశ్వత స్థానం లేకపోయింది. ఇప్పుడు ఓపెనర్ గా వస్తూ దుమ్మురేపుతున్నాడు. 5 టి20ల్లో మూడు సెంచరీలు కొట్టాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మలా ప్రస్తుతం శాంసన్ ఓపెనర్ గా అదరగొడుతున్నాడు. కాస్త కుదురుకుంటే పరుగులను పిండుకునే శాంసన్.. మున్ముందు రోహిత్ లోటును భర్తీ చేసేలా కనిపిస్తున్నాడు.