Begin typing your search above and press return to search.

నా కొడుకు కెరీర్ నాశనం చేశారు.. సంజూ శాంసన్ తండ్రి తీవ్ర ఆరోపణలు

ఇప్పటివరకు భారత క్రికెట్ లో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ మాత్రమే దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   13 Nov 2024 1:30 PM GMT
నా కొడుకు కెరీర్ నాశనం చేశారు.. సంజూ శాంసన్ తండ్రి తీవ్ర ఆరోపణలు
X

ఇప్పటివరకు భారత క్రికెట్ లో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ మాత్రమే దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. తన కుమారుడు యువీ కెరీర్ ను ధోనీ దెబ్బతీశాడంటూ తరచూ మీడియాకు ఎక్కుతుంటాడు. కానీ, తాజాగా మరో క్రికెటర్ తండ్రి ముగ్గురు మాజీ కెప్టెన్లపై ఆరోపణలకు దిగాడు. అది కూడా ఆ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతుండగానే కావడం గమనార్హం.

ఇప్పుడిలాంటి వ్యాఖ్యలెందుకు?

టీమ్ ఇండియాలో.. మరీ ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో సంజూ శాంసన్ పేరు మార్మోగుతోంది. హైదరాబాద్ లో గత నెలలో బంగ్లాదేశ్ తో జరిగిన టి20లో, తాజాగా దక్షిణాఫ్రికాతో డర్బన్ లో జరిగిన మొదటి టి20లో సెంచరీలు బాదాడు. దీంతో వరుసగా రెండు టి20 సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు. రోహిత్ శర్మ స్థానంలో సంజూను టి20ల్లో రెగ్యులర్ ఓపెనర్ గా చూస్తున్న సమయంలో అతడి తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్లు ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సంజూ శాంసన్ పదేళ్ల కెరీర్‌ ను నాశనం చేశారని ఆరోపించాడు. కాగా, సంజూ 2015లోనే టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. అయితే, స్థానం నిలుపుకోలేకపోయాడు. వన్డేలు, టి20ల్లో వరుస అవకాశాలు ఇచ్చినా రాణించలేదు. అతడి గణాంకాలు చూసినా ఈ విషయం తెలుస్తుంది. దీంతోపాటు పోటీ కారణంగా ఓ దశలో శాంసన్ బాగా వెనుకబడ్డాడు. అయితే, ఇప్పుడు మాత్రం తన పాత్రకు, ప్రతిభకు న్యాయం చేస్తున్నాడు. పరిస్థితి ఇలా ఉండగా.. సంజూ తండ్రి మాత్రం తన కుమారుడి కెరీర్ పై ధోనీ, రోహిత్, కోహ్లి దెబ్బకొట్టారని ఆరోపించడం గమనార్హం. వాస్తవానికి కెరీర్ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న సంజూకు అతడి తండ్రి వ్యాఖ్యలు చేటు చేస్తాయి. క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చే బీసీసీఐ ఇలాంటి విషయాలను సీరియస్ గా తీసుకుంటే పరిస్థితి ఇబ్బందిగా మారుతుంది.

ఎవరికైనా నిలకడే ముఖ్యం

భారత్ లో 100 కోట్ల మంది ఆడే క్రికెట్ లో 11 మందికే జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కుతుంది. దానిని సద్వినియోగం చేసుకుంటేనే నిలదొక్కుకునే చాన్సుంటుంది. సంజూకు గతంలో అవకాశాలు ఇచ్చినా రాణించలేదనేది నిజం. ఇప్పుడు బాగా ఆడుతున్నాడనేది కూడా నిజం. అలాంప్పుడు అతడి కెరీర్ ను వేరే ఎవరో ఎలా దెబ్బతీశారని చెప్పగలం...? కాబట్టి సంజూ తండ్రి ఆరోపణణలకు విలువ లేదనే చెప్పాలి. కాగా, తన కుమారుడికి ఇప్పుడు వరుసగా అవకాశాలు రావడం పట్ల అతడి తండ్రి విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి కారళణం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ అని చెబుతున్నాడు. ఈ ఇద్దరూ లేకుంటే సంజూను మళ్లీ పక్కనపెట్టేవారని కూడా ఆరోపించాడు. సంజూ సాధించిన తొలి టి20 సెంచరీని ఈ ఇద్దరికీ అంకితం ఇవ్వాలని ఉందని చెప్పాడు.