నా కొడుకుపై కుట్ర.. టీమ్ ఇండియా క్రికెటర్ తండ్రి సంచలన ఆరోపణలు
Sanju Samson’s father accuses Kerala Cricket Association
By: Tupaki Desk | 23 Jan 2025 10:33 AM GMTయోగ్ రాజ్ సింగ్.. టీమ్ ఇండియా డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి.. తన కుమారుడి ఎదుగుదలను కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ అడ్డుకున్నాడనేది యోగ్ రాజ్ ఆరోపణ. అంతేకాదు.. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో తన కుమారుడి బదులు ధోనీ బ్యాటింగ్ కు దిగి క్రెడిట్ కొట్టేశాడని విమర్శిస్తుంటాడు. కానీ, వాస్తవం వేరు జట్టు మేనేజ్ మెంట్ నిర్ణయం ప్రకారమే నాడు ధోనీ ముందుగా బ్యాటింగ్ కు దిగాడు. అప్పట్లో టీమ్ గెలిచింది కాబట్టి సరిపోయింది.. ఓడి ఉంటే అందరూ ధోనీని తప్పుబట్టేవారు కదా. అతడు రిస్క్ తీసుకుని వచ్చాడు. రాణించాడు. జట్టు గెలిచింది.
రవిచంద్రన్ అశ్విన్.. టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్ గా నెల కిందటి వరకు టెస్టు జట్టులో ప్రధాన ఆటగాడు. 500 పైగా వికెట్లు తీసిన దిగ్గజం. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో అనూహ్యంగా రిటైర్మెంట్ ఇచ్చాడు. దీంతో అశ్విన్ తండ్రి రవిచంద్రన్ తెరపైకి వచ్చి తనకు కుమారుడిని టార్గెట్ చేశారంటూ ఆరోపణలకు దిగాడు. దీంతో స్వయంగా అశ్విన్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చాడు. తన తండ్రి వ్యాఖ్యలను ఖండించాడు.
సంజూ శాంసన్.. గత ఆరు టి20ల్లో మూడు సెంచరీలు కొట్టిన ఆటగాడు. బుధవారం ఇంగ్లండ్ తో జరిగిన టి20లోనూ రాణించాడు. దీంతో టి20ల్లో రెగ్యులర్ మెంబర్ అయ్యేలా ఉన్నాడు. మంచి ఫామ్ లో ఉన్న సంజూ మున్ముందు కెప్టెన్ అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అతడు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్సీ చేస్తున్నాడు. మరో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ను కాదని మరీ సంజూకు టి20ల్లో అవకాశాలు ఇస్తున్నారు సెలక్టర్లు.
ఈ తండ్రులున్నారే..?
కుమారులు అంతర్జాతీయ క్రికెటర్లు అయినా తండ్రులు మాత్రం కాస్తయిన బుర్ర లేకుండా ఉంటారని యువరాజ్, అశ్విన్ తండ్రులతో పాటు సంజూ శాంసన్ తండ్రిని చూసినా తెలిసిపోతోంది.
గతంలోనూ సంజూ కెరీర్ అనుకున్నంత సజావుగా సాగకపోవడానికి కుట్రలు జరిగాయని అతడి తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఆరోపించాడు. వాస్తవానికి 9 ఏళ్ల కిందటే సంజూ టీమ్ ఇండియాలోకి వచ్చాడు. కానీ, నిలకడ లేమితో జట్టులో చోటు నిలుపుకోలేకపోయాడు. ఇప్పుడు మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఇలాంటి సమయంలో సంజూ తండ్రి విశ్వనాథ్ కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే బాగుండేది. కానీ, మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలకు దిగాడు. తమ సొంత రాష్ట్రం కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ)పైనే విమర్శలు చేశాడు. ఆరు నెలలుగా కేసీఏలో.. తన కుమారుడిపై కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించాడు. తన కుమారుడి కెరీర్ అక్కడ సురక్షితంగా లేదని.. ప్రతిదానికి సంజూపై నిందలు వేస్తోందని, ప్రజలూ నమ్ముతున్నారని విశ్వనాథ్ అన్నాడు. అందుకే సంజూ కేరళకు ఆడకుండా ఉండాలని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. కాగా, సంజూ ఇటీవల దేశవాళీ టోర్నీలో కేరళకు ఆడలేదు. విదేశాలకు వెళ్లాడు. అందుకే బీసీసీఐ అతడిని చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదనే కథనాలు వచ్చాయి. కానీ, పంత్ తో పాటు కేఎల్ రాహుల్ ఉన్నందునే సంజూను ఎంపిక చేయలేదని తెలుస్తోంది. విశ్వనాథ్ మాత్రం వేరే విధంగా ఆరోపణలు చేస్తున్నాడు.