సంజు శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్... బోణికొట్టిన రాజస్థాన్!
దీంతో... ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ క్రీజ్ లోకి రాగా... మోసిన్ ఖాన్ బంతి అందుకున్నాడు.
By: Tupaki Desk | 24 March 2024 3:49 PM GMTఐపీఎల్ సీజన్ 17లోని నాలుగో మ్యాచ్ రాజస్థాన్ - లఖ్ నవూ మధ్య జరిగింది. ఈ సమయంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో... ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ క్రీజ్ లోకి రాగా... మోసిన్ ఖాన్ బంతి అందుకున్నాడు.
మొదట్లోనే ఒత్తిడి పెంచిన లఖ్ నవూ!:
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కు మోసిన్ ఖాన్ వేసిన తొలి ఓవర్ లో మూడు పరుగులే వచ్చాయి. అయితే... నవీనుల్ హక్ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన జోస్ బట్లర్ చివరి బంతికి వికెట్ కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో రెండు ఓవర్లకు రాజస్థాన్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 13 పరుగులకు చేరింది.
యశస్వి జైస్వాల్ ఔట్:
దూకుడు మీద కనిపించిన యశస్వీ జైస్వాల్.. మోసిన్ ఖాన్ వేసిన ఐదో ఓవర్ లో ఐదో బంతికి సిక్స్ కొట్టి, చివరి బంతికి భారీ షాట్ కు ట్రై చేసి కృనాల్ పాండ్యకు చిక్కాడు. దీంతో... రాజస్థాన్ స్కోరు ఐదు ఓవర్ల తర్వాత రెండు వికెట్ల నష్టానికి 49 పరుగులకు చేరింది.
10 ఓవర్లకు పటిష్ట స్థితిలో రాజస్థాన్:
సంజు శాంసన్ 35 పరుగులతో.. రియాన్ పరాగ్ 17 పరుగులతో నిలకడగా రాణిస్తుండటంతో... 10 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి 89 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది.
సంజు శాంసన్ హాఫ్ సెంచరీ:
రవి బిష్ణోయ్ వేసిన 13 ఓవర్లో మొదటి బంతికి ఫోర్ బాదిన సంజు శాంసన్... 33 బంతుల్లో హాల్ఫ్ సెంచరీ చేశాడు. దీంతో... 13 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఈ సమయంలో శాంసన్ 51, రియాన్ పరాగ్ 31 పరుగులతో ఉన్నారు.
హాఫ్ సెంచరీ మిస్... రియాన్ పరాగ్ ఔట్:
నవీనుల్ హక్ వేసిన 15 ఓవర్ లో నాలుగో బంతికి సిక్స్ బాదిన రియాన్ పరాగ్... తర్వాతి బంతికి దీపక్ హుడాకు చిక్కాడు. ఫలితంగా 43 పరుగుల వద్ద వెనుదిరిగాడు. దీంతో... హాఫ్ సెంచరీ మిస్ అయ్యింది. ఈ సమయలో ధ్రువ్ జురేల్ క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే సిక్స్ బాదాడు. దీంతో... 17 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ 158 పరుగులు చేసింది.
శాంసన్ మెరుపులు.. లఖ్ నవూ లక్ష్యం ఇదే!
లఖ్ నవూతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ భారీ స్కోరే సాధించింది. ఇందులో భాగంగా... 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్స్ లో సంజు శాంసన్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్ లతో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇదే సమయంలో... రియాన్ పరాగ్ 29 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్ లతో 43 పరుగులు చేశాడు.
తొలి ఓవర్ లోనే లఖ్ నవూకు షాక్!:
194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్ నవూ కి తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. ఇందులో భాగంగా... ఇన్నింగ్స్ రెండో బంతికే ఫోర్ కొట్టి ఫాంలో ఉన్నట్లు కనిపించిన డికాక్.. అదే ఓవర్ ఐదో బంతికి.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో నాండ్రీ బర్గర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరాడు.
ఇదే క్రమంలో... ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్ లో రెండో బంతికి మరో వికెట్ పడింది. ఇందులో భాగంగా... దేవదత్ పడిక్కల్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 3 ఓవర్లకు లఖ్ నవూ స్కోరు రెండు వికెట్లకు 11 పరుగులుగా ఉంది.
మూడో వికెట్ డౌన్... పీకల్లోతు కష్టాల్లో లఖ్ నవూ!:
లఖ్ నవూ బ్యాటర్స్ కి తేరుకునే అవకాశం ఇవ్వడం లేదు రాజస్థాన్ బౌలర్లు. ఇందులో భాగంగా... 3 ఓవర్లకు రెండు వికెట్లు పడగొట్టగా... నంద్రీ బర్గర్ వేసిన నాలుగో ఓవర్ లో మొదటి బంతికి ఆయుష్ బదోని (1) ఔటయ్యాడు. దీంతో 4 ఓవర్లలో 3 పరుగులు కోల్పోయి 22 పరుగులు చేసిన లఖ్ నవూ పీకల్లోతు కష్టల్లో ఉందనే భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
10 ఓవర్లలో లఖ్ నవూ పరిస్థితి ఇది!:
రాజస్థాన్ నిర్ధేశించిన 194 పరుగుల భారీ లక్ష్యఛేదనలో లఖ్ నవూ తడబడుతోంది. ఈ క్రమంలో 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయిన లఖ్ నవూ... 76 పరుగులు చేసింది. ప్రస్తుతం నికోలస్ పూరన్ (10), కేఎల్ రాహుల్ (25) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
దూకుడు పెంచిన రాహుల్... హాఫ్ సెంచరీ పూర్తి:
10 ఓవర్లు పూర్తయిన తర్వాత కేఎల్ రాహుల్ గేరు మార్చాడు. ఇందులో భాగంగా నంద్రీ బర్గర్ వేసిన 11 ఓవర్ లో చివరి మూడు బంతులకు వరుసగా 6 - 4 - 4 బాదాడు. దీంతో లఖ్ నవు స్కోరు 11 ఓవర్లకు 4 వికెట్లకు 93 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే అశ్విన్ వేసిన 14 ఓవర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 35 బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇంతలోనే లఖ్ నవూకు షాక్...!!
16 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది లఖ్ నవూ. అప్పటికి రాహుల్ 58 పరుగులతో పటిష్టంగా ఉన్నాడు. ఈ క్రమంలో సందీప్ శర్మ వేసిన 17వ ఓవర్ తొలిబంతికి ధ్రువ్ జురెల్ కు క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. దీంతో లఖ్ నవూకు షాక్ తగిలినట్లయ్యింది. అయితే ఇదే ఓవర్ లో నికోలస్ పూరన్ 30 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో 17 ఓవర్లకు లఖ్ నవూ స్కోరు 5 వికెట్ల నష్టానికి 152 కు చేరుకుంది.
ఆరో వికెట్ కోల్పోయిన లఖ్ నవూ:
అశ్విన్ వేసిన 18వ ఓవర్ మూడో బంతికి స్టాయినీస్ (3) ధ్రువ్ జురెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో లఖ్ నవూ ఆరో వికెట్ కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో లఖ్ నవూ స్కోరు 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆ సమయానికి క్రీజ్ లో 53 పరుగులతో పూరన్, ఒక్క పరుగుతో కృనాల్ పాండ్య ఉన్నారు.
ఆరు బంతులు 27 పరుగులు!:
ఆఖరి ఓవర్లో 27 పరుగులు సాధించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సమయంలో ఆవేష్ ఖాన్ చేతికి బంతి అందించాడు శాంసన్. ఆ నిర్ణయానికి న్యాయం చేస్తూ... 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో... 20 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది.