Begin typing your search above and press return to search.

మను మరో పతకం.. పారిస్ ఒలింపిక్స్ లో అరుదైన రికార్డు.. ఏకైక ఇండియన్

సరబ్‌ జోత్‌ సింగ్‌తో కలిసి పోటీకి దిగిన మను బాకర్‌.. దక్షిణ కొరియా షూటర్లతో పోటీపడి కాంస్య పతకం గెలిచారు.

By:  Tupaki Desk   |   30 July 2024 8:40 AM GMT
మను మరో పతకం.. పారిస్ ఒలింపిక్స్ లో అరుదైన రికార్డు.. ఏకైక ఇండియన్
X

'అద్వితీయం'.. అమోఘం.. ఆమె ప్రదర్శనను ఎంత పొగిడినా తక్కువే.. గత ఒలింపిక్స్ లోనే పతకం తెస్తుందన్న ఆశలు ఉండగా.. చివర్లో తుపాకీ మొరాయించడంతో త్రుటిలో అవకాశం చేజారింది. ఈ సారి మాత్రం ఎలాంటి తప్పిదాలకూ లోనివ్వకుండా భారత్ కు ఖాతా తెరిచిపెట్టింది. ఒక్కసారి కాదు.. రెండుసార్లు.. అదే సమయంలో ఒకే మరో ఘనమైన రికార్డునూ తన ఖాతాలో వేసుకుంది.

మను ది మరో చరిత్రే..

పారిస్‌ ఒలింపిక్స్‌ లో షూటర్ మను బాకర్ చరిత్రకెక్కింది. ఆదివారం వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ లో కాంస్య పతకం సాధించిన ఆమె.. తాజాగా మిక్స్‌ డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలోనూ కాంస్యం కొల్లగొట్టింది. సరబ్‌ జోత్‌ సింగ్‌తో కలిసి పోటీకి దిగిన మను బాకర్‌.. దక్షిణ కొరియా షూటర్లతో పోటీపడి కాంస్య పతకం గెలిచారు. మను బాకర్‌ జోడీ 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా షూటర్లు 10 పాయింట్లు దగ్గరే ఆగిపోయారు. మంగళవారం ఒంటి గంటలకు ప్రారంభమైన ఈ పోటీ ఫలితం అరగంటలోనే వెలువడింది. కాగా, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లో పతకాలు గెలిచిన మను బాకర్.. అరుదైన రికార్డు నెలకొల్పింది. ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్ గా నిలిచింది.

స్వాతంత్ర్యం తర్వాత ఇప్పుడే..

ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు నెగ్గిన భారత అథ్లెట్లు స్వాతంత్ర్యానికి పూర్వమే ఉన్నారు. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు పారిస్ లోనే జరిగిన 1900 ఒలింపిక్స్‌ లో అథ్లెటిక్స్‌ లో నార్మన్ ప్రిచర్డ్ రెండు రజత పతకాలు గెలిచాడు. అయితే, అతడు బ్రిటీష్‌-ఇండియన్ అథ్లెట్‌. పోటీల్లో మాత్రం భారత్‌ కు ప్రాతినిథ్యం వహించాడు.

మన సింధు కూడా ఉన్నా..

ఒలింపిక్స్‌ లో మొత్తమ్మీద రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లలో తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ఉండడం విశేషం. ఇక 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ లో రెజ్లర్ సుశీల్ కుమార్ కాంస్యం, 2012 లండన్‌ ఒలింపిక్స్‌ లో రజతం నెగ్గాడు. సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌ లో కాంస్యం గెలిచింది.